సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 03:20:43

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

  • 16-24 మధ్య నవరాత్రి బ్రహ్మోత్సవాలు
  • కల్యాణమండపంలో వాహన సేవలు 

తిరుమల, నమస్తే తెలంగాణ: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి 7-8 గంటల మధ్య అంకురార్పణ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల మాదిరే నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగా జరుపాలని టీటీడీ తీర్మానించింది. శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కల్యాణమండపంలో వాహన సేవలు నిర్వహిస్తారు. ఉదయం 9-10 గంటల మధ్య, రాత్రి 7-8 గంటల మధ్య వాహన సేవలు జరుగుతాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి తొలిరోజు (అక్టోబర్‌ 16) ఉదయం 9-11 గంటల మధ్య బంగారు తిరుచ్చి, రాత్రి 7-8 గంటల మధ్య పెద్ద శేష వాహన సేవ జరుపుతారు. 20 రాత్రి 7-8.30 గంటల మధ్య గరుడ వాహన సేవ, 21 మధ్యాహ్నం 2-3 గంటల మధ్య వసంతోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 3-4 గంటల మధ్య పుష్పక విమానంపై స్వామి, అమ్మవార్లు దర్శనమిస్తారు. 23 ఉదయం 8 గంటలకు స్వర్ణరథానికి బదులు స్వామి వారికి సర్వభూపాల వాహన సేవ నిర్వహిస్తారు. 24 ఉదయం 6-9 గంటల మధ్య ఆలయంలోని అద్దాల మండపంలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం జరుగుతుందని టీటీడీ తెలిపింది. 


logo