మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 03:08:35

విఘ్నేశ్‌ కుటుంబానికి 5 లక్షల పరిహారం

విఘ్నేశ్‌ కుటుంబానికి 5 లక్షల పరిహారం

  • దిగడలో పులిదాడి ఘటనపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దిగ్భ్రాంతి 
  • మహబూబాబాద్‌ జిల్లా ముల్కనూరులో పులి సంచారం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/గార్ల:  ఆసిఫాబాద్‌ కుమ్రంభీం జిల్లా దహేగాం మండలం దిగడ గ్రామంలో పెద్దపులి దాడిలో చనిపోయిన విఘ్నేశ్‌ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. బాధిత కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు. గురువారం మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కండ్లకోయ వద్ద నిర్మించిన డీఎఫ్‌వో కార్యాలయాన్ని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఇదే ప్రాం గణంలోనిర్మించనున్న డీఆర్వో క్వా ర్టర్స్‌కు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మం త్రి అల్లోల మాట్లాడుతూ..అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులకు, స్నేక్‌ రెస్క్యూ సెంటర్లకు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ప్రసిద్ధిగాంచిందని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం మొదటి డీఎఫ్‌వో కార్యాలయం మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాదేనని పేర్కొన్నారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎర్రచందనం, రోజ్‌వుడ్‌, టేక్‌, మంచిగంధపు మొక్కలు నాటారు. కార్యక్రమంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, పీసీపీఎఫ్‌లు స్వర్గం శ్రీనివాస్‌, డోబ్రియల్‌, లోకేశ్‌జైస్వాల్‌, అడిషనల్‌ పీసీపీఎఫ్‌ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎఫ్‌వోలు సుధాకర్‌రెడ్డి, భీమానాయక్‌, డీవీరెడ్డి, అశోక్‌కుమార్‌, డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 ముల్కనూరులో పెద్దపులి పాదముద్రలు? 

మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం ముల్కనూరు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్టు తెలిసింది. ఓ రైతుకు చెందిన మిరప, పత్తి చేలల్లో గురువారం పాదముద్రలు కనిపించడంతో అటవీ అధికారులతో కలిసి తాసిల్దార్‌ సయ్యద్‌ రఫియుద్దీన్‌ పరిశీలించారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో పులి పాదముద్రలను సేకరించి పరీక్షల కోసం పంపారు. ప్రజలెవరూ రాత్రివేళల్లో ఒంటరిగా తిరగవద్దని, అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్‌ సూచించారు.