మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:32:06

కవ్వాల్‌లో పెద్ద పులుల గాండ్రింపులు

కవ్వాల్‌లో పెద్ద పులుల గాండ్రింపులు

  • టైగర్‌ రిజర్వు ఫారెస్టులో పెరుగుతున్న సంతతి
  • ఇప్పటికే ఆరు.. తాజాగా శ్రీరాంపూర్‌ వద్ద మరొకటి
  • సత్ఫలితాలిస్తున్న తెలంగాణ సర్కారు చర్యలు

తెలంగాణ సర్కార్‌ చేపడుతున్న సంరక్షణ చర్యలతో కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టుకు పులుల తాకిడి పెరుగుతున్నది. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్‌ అడవుల నుంచి ఆవాసం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుండగా.. క్రమంగా వాటి సంతతి అభివృద్ధి చెందుతున్నది. ఇప్పటికే కవ్వాల్‌లో రెండు పెద్దపులులతోపాటు నాలుగు పిల్లలుండగా.. తాజాగా తడోబా నుంచి వచ్చిన మరో మగ పులి శ్రీరాంపూర్‌ ఆర్కే-6 గని వద్ద సంచరిస్తున్నట్టు గుర్తించారు. 

నిర్మల్‌, నమస్తేతెలంగాణ: కవ్వాల్‌ అభయారణ్యానికి పెద్ద పులుల తాకిడి పెరుగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని ఈ టైగర్‌ రిజర్వు ఫారెస్టు పులులకు ఆవాసంగా మారుతున్నది. పులులు మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్‌ నుంచి ఇక్కడికి వస్తున్నాయి. ఇప్పటికే కవ్వాల్‌లో ఆరు పెద్ద పులులు ఉండగా.. తాజాగా మరో మగ పులిని శ్రీరాంపూర్‌ ఆర్కే-6 గని సమీపంలో అధికారులు గుర్తించారు.  

పులులకు ఆవాసం..

నిర్మల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలో 2,020 చదరపు కిలోమీటర్లలో కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టు విస్తరించి ఉన్నది. ఇందులో 897 చదరపు కిలోమీటర్లు కోర్‌ ఏరియా, 1,123 చదరపు కిలోమీటర్ల బఫర్‌ ఏరి యా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంరక్షణ చర్యల కారణంగా కవ్వాల్‌లో పెద్ద పులుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే ఇక్కడ ఆరు ఉండగా వీటిలో ఆడ,మగ పులులతోపాటు నాలుగు పిల్లలున్నాయి. తాజాగా తడోబా నుంచి మరో మగ పెద్దపులి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఏరియా మీదుగా కవ్వాల్‌కు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తడోబా నుంచి కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా మీదుగా 25 రోజుల క్రితం ఈ పులి వచ్చింది.  కాగా, ఇప్పటికే కవ్వాల్‌లో మగ పులి ఆవాసం ఉండటంతో అది అటు వెళ్లకుండా కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో సంచరిస్తున్నది.  


రాష్ట్ర సర్కార్‌ ప్రత్యేక ఏర్పాట్లు 

కవ్వాల్‌లో పులుల సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. పులులు సంచరించే ప్రాంతా లు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టింది. యానిమల్‌ ట్రాకర్‌, బేస్‌క్యాం పు వాచర్‌తో నలుగురు సభ్యులున్న 23 బృం దాల ను ఏర్పాటు చేసింది. ఈ బృందాల సభ్యులు పెద్దపులుల కదలికలపై  నిఘా ఉంచారు. అవి సంచరిం చే ప్రాంతంలో కెమెరాలను ఏర్పాటు చేశారు. పులు లు రోజుకు 10నుంచి 12కిలోమీటర్ల మేర సంచరి స్తూ.. రోజుకు ఒక్కసారి నీళ్లు తాగుతాయి. వాటికి తాగునీటి ఇబ్బందులు లేకుండాఏర్పాట్లు చేశారు. చెలిమెల్లో నీరు ఉండేలా చూశారు. చెక్‌డ్యాంలు, చిన్నచిన్న నీటి గుంతలు నిర్మించారు. 

నీరు రాని చోట సాసర్‌ పిట్స్‌ నిర్మించారు. బోర్లు వేసి.. సోలార్‌ వ్యవస్థ ద్వారా నీటి సరఫరా చేశారు. ప్రతి నాలుగు చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని విభజించి గ్రిడ్‌గా నీటి వసతి ఏర్పాటు చేశారు. ఆహారం కోసం పులు లు వెనక్కి వెళ్లిపోకుండా శాకాహార జంతువులను అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్కో పులికి ఏడా దికి 300 నుంచి 350 శాకాహార జంతువులు అవసరముండగా.. అడవి పందులు, జింకలు, దుప్పు లు, నీల్గాయ్‌లు, కొండగొర్రెలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శాకాహార జంతువుల కోసం డాక్టర్‌ మురత్కర్‌ సూచనలతో ప్రత్యేక పచ్చగడ్డి క్షేత్రాలను పెంచుతున్నారు. పెద్ద పులులకు కరోనా వైరస్‌ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టు ఎఫ్‌డీటీ వినోద్‌కుమార్‌ ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు.

వన్యప్రాణులకు హానిచేస్తే పీడీ యాక్టు 

  • రామగుండం సీపీ హెచ్చరిక

వన్యప్రాణులకు హాని తలపెడితే పీడీ యాక్టు కింద కేసులు పెట్టి కఠినంగా శిక్షిస్తామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఏరియాలోని గనుల పరిసరాలను జైపూర్‌ ఏసీపీ నరేందర్‌తో కలిసి సీపీ పరిశీలించారు. అటవీ అధికారులతో కలిసి పులి పాదముద్రలను గుర్తించారు. ఆర్కే-5గని, కోల్‌  యార్డు సమీపం, రైల్వే ట్రాక్‌, ఆర్కే-6గని, 8, శ్రీరాంపూర్‌ జీఎం ఆఫీస్‌ ముందు నర్సరీ నుంచి పులి అడవిలోకి వెళ్ల్లినట్లు స్థానికులు చూశారని సీపీ తెలిపారు.  మహారాష్ట్ర చంద్రాపూర్‌, తడోబా అడవుల నుంచి వచ్చిన పెద్ద పులులు లాక్‌డౌన్‌తో జనసంచారం లేనందున స్వేచ్ఛగా తిరుగుతున్నాయని చెప్పారు. పులులకు ఎలాంటి హాని కలుగకుండా ఉండేందుకు అటవీ అధికారులతో కలిసి రక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 


logo