బుధవారం 27 మే 2020
Telangana - May 11, 2020 , 22:40:56

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం

మంచిర్యాల : జిల్లాలో గత నాలుగు రోజులుగా చెన్నూర్‌, బెల్లంపల్లి డివిజన్ల పరిధిలో ఓ పెద్దపులి సంచరిస్తోంది. ఇది కూడా కొత్తగానే వచ్చినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. 20 రోజుల వ్యవధిలో రెండు కొత్త పులులు తెలంగాణకు వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ పులుల అభయారణ్యం నుంచి ఏప్రిల్‌ 18 నుంచి 22వ తేదీ వరకు ఆసిఫాబాద్‌ జిల్లాలోని రెబ్బెన, తిర్యాణి అడవుల గుండా మంచిర్యాల జిల్లాలోని తాండూర్‌, బెల్లంపల్లి, నెన్నెల మండలాల పరిధిలోని అడవిలోకి ఓ పులి వచ్చింది. కుష్నపల్లి రేంజ్‌ పరిధిలోని పలు బీట్లలో తిరిగింది. బెల్లంపల్లి రేంజ్‌లోని రంగపేట, చర్లపల్లి మధ్యలో బర్రెను చంపి మూడు రోజుల పాటు స్థానికంగా తిరుగుతూ కెమెరాలకు చిక్కింది.

అటు తాండూర్‌ మండలంలోని అచ్చలాపూర్‌, గోపాల్‌పూర్‌, మాదారంలో కూడా సంచరించింది. దాదాపు 150 కిలోమీటర్ల దూరం పులి ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. నెన్నెల మండలంలోని గొల్లపల్లి, కొత్తూర్‌, చెన్నూర్‌ మండలంలోని బుద్దారం, సంకారం అడవుల్లో సంచరిస్తున్నదని అధికారులు దాని జాడలను గుర్తిస్తున్నారు. ఇంతకుముందు జిల్లాలో కే-6, కే-4, ఎస్‌-1, ఏ-1 పెద్దపులులు కారిడార్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. కొత్తగా వస్తున్న పులులు కూడా జిల్లా అడువుల్లోకి రావడంతో అధికారులు వాటి రక్షణను కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.logo