శనివారం 30 మే 2020
Telangana - May 21, 2020 , 01:32:58

ఆడతోడు కోసం పెద్దపులి ఆరాటం

ఆడతోడు కోసం పెద్దపులి ఆరాటం

  • ఆవాసానికీ విస్తృతంగా అన్వేషణ 
  • మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో సంచారం

మంచిర్యాల, నమస్తే తెలంగాణ: ఆవాసం, ఆడతోడు కోసం ఓ పెద్దపులి విస్తృతంగా అన్వేషిస్తున్నది. 45 రోజులుగా మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనే సంచరిస్తున్నది. మహారాష్ట్రలోని తిప్పేశ్వరం అటవీప్రాంతం నుంచి ఉమ్మ డి ఆదిలాబాద్‌ జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి.. రెండ్రోజుల వ్యవధిలోనే అక్కడినుంచి కుమ్రంభీం జిల్లాలోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా తాండూరు, బెల్లంపల్లి, నెన్నెల మండలాలతోపాటు కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని రెబ్బెన, తిర్యాణి మండలాల్లోని అడవుల్లో సంచరిస్తున్నట్టు తెలుస్తున్నది. పలుచోట్ల పశువులను వేటాడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నది. సీసీ కెమెరాల్లో రికార్డయిన ప్రకారం దీన్ని మగపులిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆడ తోడు కోసమే ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నదని భావిస్తున్నారు. ఒక పులి మరో పులిని చెమట వాసన ద్వారా పసిగడుతూ దాన్ని చేరుకుంటుంది. వారం కిందట నెన్నెల పరిసరాల్లో సంచరించినది ఆడపులి అని అనుమానిస్తున్నారు. ఆయా అటవీప్రాంతాల్లో నీటి వసతితోపాటు వన్యప్రాణులు పెద్దసంఖ్యలో ఉండటంతో ఆవాసం కోసం పులి ఆరాటపడుతున్నట్టు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా పులి 20 నుంచి 50 కిలోమీటర్ల మేర పరిధిని ఏర్పాటుచేసుకొని జీవిస్తుంది. దట్టమైన అటవీప్రాంతాలు లేకపోవడం, ఓపెన్‌కాస్ట్‌ల బ్లాస్టింగ్‌ల వల్ల ప్రశాంత వాతావరణం లేక నిర్దిష్టమైన ఆవాసం ఏర్పాటు చేసుకోలేకపోతున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.దీని కారణంగా రెండు జిల్లాల సరిహద్దుల్లోనే తచ్చాడుతున్నదని అంచనావేస్తున్నారు. కైరిగూడ ఓపెన్‌కాస్ట్‌ అటవీప్రాంతంలో బుధవారం మరోసారి పెద్దపులి కనిపించింది. మొత్తంగా ఒకటే పులా.. రెండా అనేదానిపై అటవీశాఖ అధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేదు. పులి సంచారం అధికం కావడంతో అది వేటగాళ్ల ఉచ్చుకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 


logo