బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 21:32:04

పశువుల మందపై పెద్దపులి పంజా

పశువుల మందపై పెద్దపులి  పంజా

దహెగాం: కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం లోహ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లిన పశువుల మందపై పెద్దపులి దాడి చేసింది. ఒక ఆవు మృతి చెందగా, మరో ఆవు గాయాలతో బయటపడింది. లోహకు చెందిన సిడం గంగయ్య ఎప్పటిలాగే ఆదివారం గ్రామ సమీపంలోని అటవీప్రాంతానికి పశువులను తోలుకొని వెళ్లాడు. పశువులు మేత మేస్తుండగా, ఒక్కసారిగా పెద్దపులి మందపై దాడి చేసింది. మడావి గంగుబాయికి చెందిన ఆవు మృతి చెందగా, ఏనుక శ్రీనివాస్‌ ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిని చూసి సిడం గంగయ్య భయంతో పరుగు తీసి ఓ చెట్టు ఎక్కాడు. గ్రామస్తులకు సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారం అందించగా, వారు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. 

గ్రామస్తులు, అధికారులు డప్పు చప్పుళ్లతో.. శబ్ధాలు చేస్తూ అటవీ ప్రాంతానికి వెళ్లారు. చెట్టుపై ఉన్న కాపరి గంగయ్యను ఇంటికి తీసుకువచ్చారు. ఈ విషయమై ఎఫ్‌ఆర్వో పూర్ణిమను వివరణ కోరగా, ఈ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నది నిజమేనని, అది మనుషులను ఏం చేయదని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లారని, విచారణ చేపట్టి బాధిత రైతుకు అటవీశాఖ ద్వారా పరిహారం అందేలా చూస్తామన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల దిగడ గ్రామానికి చెందిన సిడం విఘ్నేశ్‌ పులి దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని లోహ గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.