మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 03:08:38

సరిహద్దుల్లో నరభక్షక పులులు?

సరిహద్దుల్లో నరభక్షక పులులు?

  • చంద్రాపూర్‌ టు కవ్వాల్‌! 
  • అప్రమత్తమైన రాష్ట్ర అటవీశాఖ
  • వందల సంఖ్యలో కెమెరాలతో నిఘా
  • అటవీ సరిహద్దు గ్రామాల్లో టైగర్‌ అలర్ట్‌

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పెద్దపులులు కాలుదువ్వుతున్నాయి. పరిమితికి మించి పెద్దపులుల సంఖ్య పెరుగటంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. ఆకలి తీర్చేందుకు సరిపడా వన్యప్రాణులు(ప్రే యానిమల్‌) పెరుగకపోవడంతో అటవీ సరిహద్దు గ్రామాల్లోని మనుషులపై దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆసిఫాబాద్‌ కుమ్రంభీం జిల్లా దహేగాం మండలం దిగడ గ్రామంలో యువకుడు విఘ్నేశ్‌పై దాడి చేసింది చంద్రాపూర్‌ ప్రాంతానికి చెందిన పులేనని అటవీశాఖ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి పెద్దపులుల వలస తాకిడి రోజురోజుకు పెరుగుతున్నది. వలస వస్తున్న పెద్దపులులకు ఇప్పటికే స్థిరపడ్డ పులులకు ‘టెరిటోరియల్‌ వార్‌' నెలకొనే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం కవ్వాల్‌ అభయారణ్యం అధికారులకు సవాల్‌గా మారింది. చంద్రాపూర్‌ సర్కిల్‌లో పెద్దపులుల సంఖ్య మితిమీరింది. భండారా, వార్ధా, నాగ్‌పూర్‌, గోండా, అమరావతి, యావత్‌మల్‌ పరిసరాల్లో పులుల సంఖ్య విస్తరించింది. 

దేశంలో పెద్దపులుల సంఖ్య మూడు వేలు

వాస్తవానికి దేశమంతటా పెద్దపులుల సంఖ్య మూడు వేల వరకు ఉండగా  మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, తడోబా-అంధేరీ టైగర్‌ రిజర్వ్‌, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యాల్లోనే వాటి సంఖ్య 310 దాటినట్టు తాజా గణాంకాలు చెప్తున్నాయి. ఒక్క చంద్రాపూర్‌ పరిధిలోనే నాలుగైదు పెద్దపులులు నరమాంసానికి అలవాటు పడ్డాయి. రెండేండ్లుగా మ్యాన్‌ ఈటర్‌ పులుల సంఖ్య పెరుగుతున్నట్టు అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. పెద్దపులుల పంజాకు ఒక్క చంద్రాపూర్‌ పరిసర ప్రాంతాల్లోనే 21 మంది బలైనట్టు రికార్డులు చెబుతున్నాయి. యావత్‌మల్‌లో ‘అవని’ అనే పెద్దపులి నరమాంసానికి అలవాటు పడిందన్న వార్త అప్పట్లో సంచలనం రేపింది. ఒకే పులి 13మందిని పొట్టన పెట్టుకున్నట్టు సమాచారం. దీంతో మహారాష్ట్ర సర్కార్‌ షూట్‌ ఎట్‌ సైట్‌ ఆదేశాలను జారీ చేసింది.  హైదరాబాద్‌కు చెందిన అస్గర్‌ అలీఖాన్‌ అనే వేటగాడు (లైసెన్స్‌డ్‌ హంటర్‌) రంగంలోకి దిగి అటవీశాఖ అనుమతితో దానిని కాల్చిచంపటం అప్పట్లో సంచలనం రేపింది. చంద్రాపూర్‌ సెంట్రల్‌ సర్కిల్‌ పరిధిలో  రాజూరా టైగర్‌-1(ఆర్టీ-1) అనే పెద్దపులి తరుచూ పంజా విసురుతూ అలజడి సృష్టించింది. దాదాపు 8 నుంచి 10 మందిని చంపినట్టు రికార్డులు చెప్తున్నాయి. ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు ఆర్టీ-1ను మత్తుమందు ఇచ్చి బంధించారు. ఇదే ప్రాంతంలో ఒక చిరుత కూడా నరమాంసానికి అలవాటు పడిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇదే క్రమంలో కొన్ని రోజులుగా చంద్రాపూర్‌ నుంచి రెండు నుంచి మూడు పులులు ఆసిఫాబాద్‌ అడవుల్లోకి ప్రవేశించినట్టు సమాచారం. వాటిలో ఏవైనా నరమాంసానికి అలవాటుపడ్డవి ఉన్నాయా.? అన్న కోణంలో అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  

అనుక్షణం అప్రమత్తం 

సాధారణంగా ఒక పెద్దపులి మనుగడ సాధించాలంటే దానికి కనీసం 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవి కావాలి. దీంతో తడోబా, తిప్పేశ్వర్‌, ఇంద్రావతి అభయారణ్యాల్లో పులులకు సరైన ఆవాస ప్రాంతం లేక తెలంగాణ వైపు పరుగులు తీస్తున్నాయి. అవి వేటగాళ్ల ఉచ్చులో పడకుండా.. జనావాసాల్లో పంజా విసరకుండా రాష్ట్ర అటవీశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తోపాటు ఇంద్రావతి తీరం మొదలుకుని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వరకు రెండు కారిడార్‌లలో నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ ఇప్పటికే పలు సార్లు టైగర్‌ అలర్ట్‌లను జారీ చేసింది. పులుల జాడలను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయడానికి వందల సంఖ్యలో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటుచేస్తున్నారు. పెద్దపులులు జనావాసాల వైపునకు వెళ్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకొంటున్నారు.