సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 01:13:21

కడవరకూ సీఎం కేసీఆర్‌ వెంటే..

కడవరకూ సీఎం కేసీఆర్‌ వెంటే..

  • టీఆర్‌ఎస్‌ను వీడుతున్నాననే ప్రచారం అవాస్తవం
  • సోషల్‌మీడియా ప్రచారంపై సీపీకి తుమ్మల ఫిర్యాదు 

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అసాధారణ రీతిలో గౌరవ స్థానాన్ని కల్పించిన చిరకాల మిత్రుడు, సీఎం కేసీఆర్‌ వెంటే చివరి వరకూ ఉంటానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా తనను క్యాబినెట్‌లో తీసుకుని ఉన్నత గౌరవాన్ని కల్పించిన కేసీఆర్‌కు దూరమయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. తనపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బుధవారం ఆయన ఖమ్మం నగర పోలీస్‌ కమిషనర్‌ తప్సీర్‌ ఇక్బాల్‌కు ఫిర్యాదు చేశారు. తాను టీఆర్‌ఎస్‌ను వీడి వేరే పార్టీలోకి వెళ్తున్నట్లు అసత్య, అభూత కల్పనలతో కూడిన విషయాలను పొందుపరుస్తూ కొందరు సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారని ఆధారాలతో సహా సీపీకి అందజేశారు. 

సీఎం కేసీఆర్‌ సహకారంతో వందల కోట్ల రూపాయలను జిల్లాకు తీసుకువచ్చి అభివృద్ధి చేశానని తుమ్మల తెలిపారు. ఓడినా, గెలిచినా తాను నిరంతరం ప్రజల మధ్యే ఉంటానన్నారు. జీహెచ్‌ఎంసీ, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కొందరు తనపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం సరికాదని తుమ్మల హెచ్చరించారు.