మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 17:36:06

ఎన్నిక‌ల ఖ‌ర్చు స‌మ‌ర్పించ‌నివారిపై మూడేళ్ల‌ అన‌ర్హ‌త

ఎన్నిక‌ల ఖ‌ర్చు స‌మ‌ర్పించ‌నివారిపై మూడేళ్ల‌ అన‌ర్హ‌త

హైద‌రాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పోటీచేసిన అభ్య‌ర్థులు త‌మ ఎన్నిక‌ల ఖ‌ర్చు వివ‌రాలు స‌మ‌ర్పించ‌క‌పోతే మూడేళ్ల వ‌ర‌కు ఎన్నిక‌ల్లో పోటీ చేసే అర్హ‌త‌ను కోల్పోవ‌డంతో పాటు గెలిచిన అభ్య‌ర్థి అయితే త‌న‌ ప‌ద‌విని కూడా కోల్పోతారని ఎస్ఈసీ పార్ధ‌‌సార‌థి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశ మందిరంలో ఎన్నికల అధికారి, కమిషనర్, జీహెచ్ఎంసి, జోనల్ కమిషనర్లు, ఎన్నికల వ్యయ పరిశీలకులతో పార్ధ‌సార‌థి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఎస్ఈసీ మాట్లాడుతూ..

జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్ధులు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజులలోపు అంటే ఈ నెల 18 వ తేదీ లోపు తమ ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల అధికారికి సమర్పించాలన్నారు. లేని పక్షంలో మూడు సంవత్సరాల వరకు ఎన్నికలలో పోటీ చేసేందుకు అర్హత కోల్పోవడంతో పాటు, గెలిచిన అభ్యర్ధి అయిన పక్షంలో పదవి కూడా కోల్పోతారన్నారు. 

ఇప్ప‌టికీ ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించని అభ్యర్ధులకు తాఖీదులు జారీచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు ఉన్నందున అభ్యర్ధులు సమర్పించాల్సిన అఫిడవిట్లు వీలైనంత తొందరలో పూర్తి చేసి సమర్పించాలని సూచించారు. మొత్తం పోటీచేసిన 1122 మంది అభ్యర్ధులకు గాను 999 మంది తమ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించారని, మిగిలిన 123 మంది అభ్యర్ధులు గడువులోపు సమర్పించాల‌న్నారు.

అధికారులు తమ విధులు నిర్వహించే విషయంలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎక్స్ పెండిచర్ మానిటరింగ్ కమిటీ రిపోర్టుతో సరిచూసి, స్క్రూటినీ చేసి ఎన్నికల ఖర్చుల వివరాలను ఫైనల్ చేయాలన్నారు. ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ నెల 25వ తేదీ లోపు తుది రిపోర్టును ఎన్నికల సంఘానికి సమర్పించాలన్నారు.