శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 02, 2020 , 02:22:33

కొండపోచమ్మసాగర్‌ను ఆడ్డుకునే‌ కుతంత్రం విఫలం

కొండపోచమ్మసాగర్‌ను ఆడ్డుకునే‌ కుతంత్రం విఫలం

  • 3 లక్షల ఎకరాల ఆయకట్టును అడ్డుకునేందుకు ముగ్గురి యత్నం
  • వారికి కాంగ్రెస్‌ పార్టీతో అనుబంధం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌ను అడ్డుకొనేందుకు చేసిన కుటిలయత్నాలకు తెరపడింది. మూడు కుటుంబాలు కలిసి మూడేండ్లపాటు కేసుల పేరుతో సాగించిన కుట్రలకు హైకోర్టు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ఈనెల 4 తర్వాత జలాశయంలో నీటిని నింపుకోవచ్చంటూ రాష్ట్రప్రభుత్వానికి పూర్తిస్థాయిలో అనుమతులు లభించాయి. దీంతో మెదక్‌, నిజామాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని బీడుభూములకు నీళ్లతోపాటు, హైదరాబాద్‌ తాగునీటికి లైన్‌క్లియర్‌ అయింది. ఐదు జిల్లాల్లోని లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు, హైదరాబాద్‌కకు తాగునీరు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 15 టీఎంసీలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌ పనులను మొదలుపెట్టారు. ఇందుకోసం 2,483 మంది నుంచి 4,664 ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్ర భూసేకరణ- పరిహారం అమైండ్‌మెంట్‌ యాక్ట్‌-2017 అనుసరించి పరిహారం అందజేసింది. ఎకరానికి రూ.12 లక్షలు, డబుల్‌బెడ్రూం ఇండ్లతోపాటు, ఇతర పరిహారాలను ఇచ్చింది. రైతుల నుంచి స్వాధీనం చేసుకున్న భూమిని జిల్లా రెవెన్యూ యంత్రాంగం నీటిపారుదలశాఖకు కూడా అందజేసింది. 

మూడు కుటుంబాలతో మూడేండ్లు ఆలస్యం!

రిజర్వాయర్‌ కోసం సేకరించిన భూమిలో ముంపునకు గురయ్యే 1,838 కుటుంబాలు ఉన్నాయి. ములుగు మండలంలోని బైలంపూర్‌, మామిడాల, తానిదార్‌పల్లి గ్రామాలవారు కూడా ఉన్నారు. వారంతా ప్యాకేజీ తీసుకోవడంతోపాటు తునికిబొల్లారంలో ఐదున్నర లక్షలకు పైగా వెచ్చించి ప్రభుత్వం కట్టించిన ఇండ్లకు కూడా మారిపోయారు. ఇక అన్నీ సవ్యంగా ఉన్నాయనుకున్న సమయంలో రిజర్వాయర్‌ పనులను నిలిపివేయాలని కోరుతూ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి, మాజీ ఎంపీపీకి చెందిన కుటుంబసభ్యులు, ప్రాథమిక సహకార పరపతి సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కోర్టును ఆశ్రయించారు. 165 ఎకరాలు కలిగిన వీరి మూడు కుటుంబాలు ఒక్కొక్కటిగా మొత్తం 24 పిటిషన్లు వేశారు. విస్తృత ప్రజాప్రయోజనాలను ఆశించి పిటిషన్లను ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ అధికారులు అనేకసార్లు చర్చలు జరిపినా, ఉత్తమమైన ప్యాకేజీ ఇస్తామని నచ్చజెప్పినా ఒప్పుకోలేదు. చివరకు అధికారులు తమకున్న అధికారాలను ఉపయోగించి, కోర్టు సూచనలను అనుసరించి కేంద్రప్రభుత్వ చట్టానికి అనుగుణంగా పరిహారం కూడా చెల్లించారు. కానీ ప్రాజెక్టు అడ్డుకోవడమే లక్ష్యంగా వారు ‘ఎడ్డెం అంటే తెడ్డెం’ అన్నట్టుగానే వ్యవహరించారు. దీంతో అధికారులు కోర్టులోనే వీరి పరిహారాన్ని డిపాజిట్‌ చేసి రిజర్వాయర్‌ పనులు మొదలుపెట్టారు. మరోవైపు వీరికోసం డబుల్‌బెడ్రూం ఇండ్లు కాకుండా ఇందిర ఆవాస్‌ యోజన (ఐఏవై) ఇండ్లను కూడా నిర్మించారు. అదేసమయంలో ఆ ముగ్గురు ప్రోత్సాహంతో ఆ కుటుంబాలు మళ్లీ న్యాయస్థానం మెట్టెక్కారు. ఈసారి విచిత్రంగా తమ ప్రాంతంలోని వారికి ఇచ్చినవిధంగా పరిహారం అందజేయాలంటూ అడిగారు. రాష్ట్రప్రభుత్వం దీనికి కూడా ఒప్పుకున్నప్పటికీ.. తమను బలవంతంగా ఖాళీ చేయించారంటూ ఇటీవల మరోసారి కోర్టుకెక్కారు. తమకు డబుల్‌ బెడ్రూం ఇండ్లే కావాలంటూ డిమాండ్‌చేశారు. రైతులకు సాగునీరు అందివ్వడమే ధ్యేయంగా ఉన్న ప్రభుత్వం చివరకు వాటిని కూడా ఒప్పుకోవడంతో శుక్రవారం హైకోర్టులో కేసు విచారణకు వచ్చింది. కేవలం రాజకీయదురుద్దేశంతో రిజర్వాయర్‌ను ఆపేందుకు చేసిన ప్రయత్నాలన్నీ చివరకు పటాపంచలయ్యాయి.


logo