ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 01:38:23

ఆడుకునేందుకు వెళ్లి అనంతలోకాలకు..

ఆడుకునేందుకు వెళ్లి అనంతలోకాలకు..

  • రిజర్వాయర్‌లో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి

భీమారం: ఆడుకునేందుకని వెళ్లి ముగ్గురు బాలురు రిజర్వాయర్‌లో పడి ప్రాణాలు కోల్పోయారు. మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపిన ఈ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమారంలో గురువారం చోటుచేసుకున్నది. ఇన్‌స్పెక్టర్‌ డేవిడ్‌ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం అంబాలకు చెందిన మునికుం ట్ల సుధాకర్‌, దొడ్డిపాటి సంపత్‌, దొడ్డిపాటి చంద్రశేఖర్‌ కుంటుంబాలు హసన్‌పర్తి మండలం భీమారంలోని గణేశ్‌నగర్‌ కాలనీలో స్థిరపడ్డాయి. ఈ కుటుంబాలకు చెందిన దొడ్డిపాటి మన్విత్‌ కుమార్‌(11) ఆరోతరగతి, దొడ్డిపాటి మహేశ్‌బాబు(14), మనుకుంట్ల విష్ణుతేజ (14) ఏడో తరగతి చదువుతున్నారు. ఆడుకునేందుకు సమీపంలోని పుట్టలమ్మ రిజర్వాయర్‌ వద్దకు వెళ్లిన వీరు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. పిల్లలు ఎంతకూ రాకపోవడంతో సాయంత్రం సదరు కుటుంబాల వారు వెతకగా స్థానికులు రిజర్వాయర్‌ వైపు వెళ్లారని సమాచారమిచ్చారు. అక్కడికి వెళ్లి చూడగా రిజర్వాయర్‌కు కొద్దిదూరంలో మూడు సైకిళ్లు, ఒడ్డున చెప్పులు కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి గజ ఈతగాళ్లతో గాలించి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. ఘటనా స్థలంలో వారి తల్లిదండ్రులు, బంధువుల రోదన అందరినీ కంటతడి పెట్టించింది. 


logo