శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 05, 2020 , 01:29:43

గ్రేటర్‌లో మూడు పాజిటివ్‌ కేసులు

గ్రేటర్‌లో మూడు పాజిటివ్‌ కేసులు

నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో: నిన్నటి వరకు భయాందోళనకు గురిచేసిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య సోమవారం నాటికి మూడుకి పడిపోయింది. గ్రేటర్‌ పరిధిలో మూడు కేసులు మాత్రమే నమోదవగా అందులో ఒకటి హైదరాబాద్‌ నగరంలో కాగా రెండు రంగారెడ్డి జిల్లా జీహెచ్‌ఎంసీ పరిధిలోవి. పాజిటివ్‌ కేసుల్లో ఒకటి వనస్థలిపురంలోని కిరాణాషాపునకు సంబంధించిన కేసు కాగా రెండవది సరూర్‌నగర్‌లో నమోదైంది. మూడవ కేసు నగరంలోని జియాగూడలో ఇటీవల పాజిటివ్‌తో మృతిచెందిన  మహిళ బంధువుగా తేలింది. 

  • కరోనా నియంత్రిత ప్రాంతాల్లోని ప్రజలు 24 గంటలు ఇండ్లలోనే ఉండాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.వాసం వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కంటైన్మెంట్‌ ప్రాంతంగా ప్రకటించిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఫేజ్‌-3 (ఇందిరమ్మ ఇండ్ల) ప్రాంతంలో కలెక్టర్‌ పర్యటించి సూచనలు చేశారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌, మేయర్‌ నీలా గోపాల్‌ రెడ్డి, కమిషనర్‌ గోపీనాథ్‌, ఆర్డీవో మల్లయ్య, బాచుపల్లి తహసీల్దార్‌ నిర్మల, శాంతి నగర్‌ వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు చక్రవర్తి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
  • బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పెంటారెడ్డి కాలనీ రెడ్‌జోన్‌ పరిధిలో కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పర్యటించారు. క్వారంటైన్‌ గడువు ముగియడంతో పెంటారెడ్డి కాలనీని రెడ్‌జోన్‌ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. 
  • సికింద్రాబాద్‌లోని న్యూబోయిగూడకు చెందిన ఓ రిటైర్డ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (63) కరోనా వైరస్‌ సోకడంతో మృతిచెందింది.
  • ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, హయత్‌నగర్‌ డివిజన్లలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పర్యటించి అధికారులకు సూచనలు చేశారు.
  • రాంకోఠిలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వృద్ధుడి కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌లో ఉన్న వారిని వైద్యాధికారులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆశా వర్కర్లతో కలిసి వారు సర్వే నిర్వహించారు.
  • నేరేడ్‌మెట్‌ పరిధి శ్రీకాలనీలో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్‌ జోన్‌ను ఎత్తివేయడంతో కాలనీవాసులు సోమవారం సీఐ నర్సింహ్మస్వామి, డాక్టర్లు, జీహెచ్‌ఎంసీ సిబ్బందిని  ఆహ్వా నించి పూలబొకే అందించి ఘనంగా సన్మానించారు. 
  • బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ వేణు గోపాల్‌రెడ్డి సన్‌సిటీలోని కంటైన్మెంట్‌ ప్రాంతాలను సంద ర్శించారు.
  • కరోనా వైరస్‌ సోకి చికిత్స కోసం గాంధీ దవాఖానలో చేరిన చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుళ్లు వీర శేఖర్‌, సత్యం ఆదివారం అర్ధరాత్రి డిశ్చార్జ్‌ అయ్యారు. కుటుంబ సభ్యులు, పోలీసులు ఆనందం వ్యక్తం చేశారు.
  • దిల్‌సుఖ్‌నగర్‌ శారదానగర్‌కు చెందిన పల్లీ వ్యాపారి బావమరిది బీఎన్‌రెడ్డినగర్‌ ఎస్‌కేడీనగర్‌కు చెందిన  వ్యక్తి(51)కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే పల్లీ వ్యాపారికి కరోనా పాజిటివ్‌ వచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులైన భార్య, కుమారుడు, తమ్ముడు, తమ్ముడి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, బావమరిది భార్య, కోడుకుకు కరోనా పాజిటివ్‌గా తేలగా తాజాగా ఆయన బావమరిదికి కూడా కరోనా వచ్చింది. కరోనాతో పల్లీ వ్యాపారి తండ్రి, తమ్ముడు కూడా మరణించాడు. పల్లి వ్యాపారికి పాజిటివ్‌ తేలిన వెంటనే వ్యాపారి బావమరిదికి కూడా ఏప్రిల్‌ 26న టెస్ట్‌ చేయగా నెగిటివ్‌ రాగా ఇంటికి పంపించారు. అయితే ఆయన బావమరిది భార్య, కుమారుడికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో తాజాగా మరోమారు బావమరిదికి పరీక్షలు నిర్వహించగా సోమవారం ఆయనకు కూడా పాజిటివ్‌గా వచ్చింది.  దీంతో సదరు వ్యక్తిని గాంధీ దవాఖానకు తరలించారు. 


logo