శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 16:51:42

గిరిజన గ్రామాలకు త్రీ ఫేజ్ కరెంట్ పూర్తి చేయాలి : మంత్రి సత్యవతి

గిరిజన గ్రామాలకు త్రీ ఫేజ్ కరెంట్ పూర్తి చేయాలి : మంత్రి సత్యవతి

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు సింగిల్ ఫేజ్ కరెంట్ ఉన్న గిరిజన గ్రామాలు, ఆవాసాల్లో వెంటనే త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వాలి, కోడంగల్, మహబూబాబాద్, డోర్నకల్  నియోజకవర్గాల్లో 10 కోట్ల రూపాయలతో గిరిజనులకు డెయిరీ డెవలప్ మెంట్ కింద పాడి బర్లను పంపిణీ చేపట్టాలని గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. 

ట్రైబల్ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద అందుబాటులో ఉన్న 163.67 కోట్ల రూపాయల ద్వారా నిర్ణయించిన నోడల్ ఏజన్సీలతో గిరిజన గ్రామాలు, తండాల్లో సింగిల్ ఫేజ్ కరెంట్ 3 ఫేజ్ కరెంటుకు మార్చడం, కోడంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనులకు డెయిరీ డెవలప్ మెంట్ కింద బర్రెల పంపిణీ, గిరిజన ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరగా పూర్తి చేయడంపై మంత్రి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు, టీఎస్ ఐడీసీ డైరెక్టర్ విద్యాసాగర్, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. 

గ్రామీణ విద్యుదీకరణ పథకం కింద సింగిల్ ఫేజ్ కరెంట్ ఉన్నట్లు గుర్తించిన 2,221 గిరిజన గ్రామాలకుత్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వడం కోసం మొదటి దశలో 117.82 కోట్ల రూపాయలను కేటాయించారని తెలిపారు. వెంటనే ఈ పనులు చేపట్టి పూర్తి చేస్తే గిరిజనులకు చాలా ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. తెలంగాణ ఎన్పీడీసీఎల్ సీఎండీ స్పందిస్తూ ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల గిరిజన గ్రామాల్లో నీరు బాగా ఉందని, వర్షాలు ఆగిపోయిన వెంటనే పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

 మంత్రి కేటీఆర్ కోడంగల్ నియోజక వర్గాన్ని దత్తత తీసుకున్నారు. అక్కడి గిరిజనుల అభివృద్ధి కోసం డెయిరీ డెవలప్ మెంట్ పాడి బర్ల పంపిణీ ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తామని తెలిపారు. దీనికి గిరిజన శాఖ ఇప్పటికే నిధుల ప్రతిపాదనలు పూర్తి చేసిందని, సంబంధిత నోడల్ ఏజన్సీ పనులు చేపట్టాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో డెయిరీ డెవల్ మెంట్ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నామని, ఇది విజయవంతం అయితే అంతటా విస్తరిస్తామని మంత్రి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు సాగునీరందించేందుకు 2015లో 70 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించి, పూర్తి చేశారని దీనికి ఆర్థిక శాఖ ధ్రువీకరణ (ర్యాటిఫికేషన్) కావాలని టీఎస్ ఐడీసీ డైరెక్టర్ విద్యాసాగర్ కోరారు.

గిరిజన ప్రాంతాల్లో ఆవాసాలకు త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వడం, గిరిజనులకు డెయిరీ డెవలప్ మెంట్ కార్యక్రమం తీసుకోవడం వంటివి చాలా మంచి కార్యక్రమాలని వీటికి ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి సమస్యలు లేవని, ఈ ప్రతిపాదనలన్నింటికి ఆమోదం ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి ప్రకటించారు. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి 70 కోట్లరూపాయల ప్రతిపాదనలు వెంటనే పంపితే ధ్రువీకరిస్తామన్నారు. logo