సోమవారం 18 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 17:51:19

పీడీపీకి ముగ్గురు ముఖ్య నాయకుల రాజీనామా

పీడీపీకి ముగ్గురు ముఖ్య నాయకుల రాజీనామా

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లో డిస్ట్రిక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికలకు ముందు పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ)కి భారీ ఎదురు దెబ్బతగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్యనేతలు పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీమానా చేశారు. పదిరోజుల క్రితం పీడీపీ వ్యవస్థాపక సభ్యుడు ముజఫర్‌ హుస్సేన్‌ భేగ్‌ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ముఖ్యనేతలంతా పార్టీని వీడుతుండటంతో ఎన్నికలకు ముందు ఆ పార్టీలో నైరాశ్యం నెలకొంది.

పీడీపీ నాయకులు ధామన్‌ భాసిన్‌, ఫల్లైల్‌ సింగ్‌, ప్రీతమ్‌ కోత్వాల్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గురువారం రాజీమానా చేశారు. అధిష్ఠానం సిద్ధాంతాలను పక్కనబెట్టి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ (ఎన్‌సీపీ)కి బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నందున పార్టీలో ఇమడలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘మా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి పీడీపీ ఏర్పాటు నాటి నుంచి పార్టీలో ఉన్నాం. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అవినీతి, రాజవంశం పాలనకు బలమైన లౌకిక ప్రత్యామ్నాయంగా మతపర, ప్రాంతీయ అంశాలకు తావులేకుండా ముఫ్తీ మొహమ్మద్‌ సయీద్‌ పీడీపీని ఏర్పాటు చేశారు.

కానీ దురదృష్టవశాత్తు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పార్టీ ఎజెండాను పక్కనబెట్టి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీకి బీ టీమ్‌గా మార్చింది’ అని వారు రాజీనామా లేఖలో ఆక్షేపించారు. జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ‘డీడీసీ’ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 28 నుంచి డిసెంబర్‌ 19 వరకు 8 విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. గుప్కార్‌ డిక్లరేషన్‌నే లక్ష్యంగా ఎన్నికల్లో పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, సీపీఐ(ఎం) ప్రజాకూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.