ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 01:56:17

పాపం పసివాళ్లు

పాపం పసివాళ్లు

  • వేర్వేరు ఘటనల్లో ముగ్గురు కన్నుమూత
  • తుంగతుర్తిలో ఊపిరి తీసిన ఉయ్యాల 
  • రాయపర్తిలో కోతులను చూసి ఆగిన గుండె
  • నల్లగొండలో వేడినీటిలో పడి చిన్నారి 
  • తల్లిదండ్రులకు తీరని శోకం 

తుంగతుర్తి/రాయపర్తి/ నీలగిరి, జనవరి 12: పాపం పసివాళ్లు.. ఎంతో భవిష్యత్‌ ఉన్న చిన్నారులు వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం వేర్వేరు జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు చిన్నారులు మృతిచెందగా.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. వివరాల్లోకి వెళ్తే.. ఉయ్యా ల కోసం కట్టిన చీర మెడకు చుట్టుకుని రెండేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మం డలం కొత్తగూడెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జటంగి లింగరాజు-శైలజ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. వ్యవసాయ పనుల నిమిత్తం చిన్న కొడుకు చిన్న(2)ను తీసుకొని పొలానికి వెళ్లారు. చెట్టుకు కట్టిన ఉయ్యాలలో చిన్నారిని పడుకోబెట్టి పనుల్లో నిమగ్నమయ్యారు. కొంతసేపటి తర్వాత బాలుడు మేల్కొని అటు ఇటు కదలడంతో ఉయ్యాల కోసం కట్టిన చీర మెడకు చుట్టుకొని ఊపిరాడక మృతి చెందాడు. తర్వాత భార్యాభర్తలు కుమారుడి వద్దకు వెళ్లి చూడగా చనిపోయి ఉండటంతో లబోదిబోమన్నారు.  

కోతులను చూసి పరిగెడుతూ గుండెపోటుతో బాలుడు..  

కోతుల గుంపును చూసి భయపడిన ఓ బాలుడు పరిగెత్తగా గుండెపోటుతో కుప్పకూలాడు. వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన సంధ్య-సంపత్‌ దంపతులకు కుమారుడు రిషివర్ధన్‌(6), కుమార్తె ఉన్నారు. చిన్నప్పటి నుంచే హృదయ సంబంధింత వ్యాధితో రిషివర్ధన్‌ బాధపడుతున్నాడు. మంగళవారం ఉదయం ఇంటి ఆవరణలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా వచ్చిన కోతుల గుంపును చూసి భయపడి పరిగెత్తాడు. ఈ క్రమంలో గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.  

వేడి నీటి బకెట్‌లో పడి చిన్నారి.. 

వేడి నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి చెందిన ఘటన నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామంలో చోటుచేసుకొన్నది. గ్రామానికి చెందిన నారపాక నర్సింహ కూతురు నక్షత్ర(3) సోమవారం సాయంత్రం ఆడుకునేందుకు ఎదురింటికి వెళ్లింది. పిల్లలతో ఆడుకుంటున్న క్రమంలో వెనక్కి నడుస్తూ వెళ్లి బాత్‌రూంలో స్నానానికి పెట్టిన వేడినీటి బకెట్లో పడింది. తీవ్ర గాయాలైన నక్షత్రను హైదరాబాద్‌ ఉస్మానియా దవాఖానకు తరలించగా మంగళవారం ఉదయం మృతి చెందింది. నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నల్లగొండ రూరల్‌ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.