మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 02:18:43

ఇదేనా సహకార సమాఖ్యవాదం?

ఇదేనా సహకార సమాఖ్యవాదం?

నరేంద్రమోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించిన మూడు వ్యవసాయ సంస్కరణల బిల్లులు భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తి అయిన సహకార సమాఖ్యవాదానికి విఘాతం కలిగించేలా ఉన్నాయి. భారత రాజ్యాంగం 7వ షెడ్యూల్లోని రాష్ర్టాల హక్కుల పట్టిక 14వ అధికరణాన్ని అనుసరించి, వ్యవసాయం, వ్యవసాయవిద్య, పరిశోధన, మొక్కలను తెగుళ్లనుండి రక్షించే బాధ్యత రాష్ర్టాలది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌, ఉమ్మడి జాబితా (కాంకరంట్‌ పట్టిక) 33వ అధికారణాన్ని అనుసరించి వ్యవసాయ వాణిజ్యం, సరఫరా, పంపిణీ వ్యవస్థ.. 34వ అధికారణాన్ని అనుసరించి వ్యవసాయ ఉత్పత్తుల ధరల నియంత్రణ కేంద్ర, రాష్ర్టాల ఉమ్మడి పరిధిలో ఉంటాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 248, పార్ట్‌ 11, ఆర్టికల్‌ 249ని అనుసరించి కేంద్రానికి రెసిడ్యూల్‌ అధికారం, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏ చట్టం చేసే అధికారాలు అయినా ఉన్నప్పటికీ, వీలైనంతవరకు రాజ్యాంగం సూచించిన సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగకుండా చూడవలసిన బాధ్యత కేంద్రంపై ఉన్నది. 

ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌ బిల్లు 2020 లోని 12 వ ఆర్టికల్‌ 

The Central Government may, for carrying out the provisions of this Act, give such instructions, directions, orders or issue guidelines as it may deem necessary to any authority or officer subordinate to the Central Government, any State Government or any authority or officer subordinate to a State Government, an electronic trading and transaction platform or to any person or persons owning or operating an electronic trading and transaction platform, or a trader or class of traders. అని చెప్తున్నది.

ఈ 12వ ఆర్టికల్‌ కేంద్రానికి రాష్ర్టాల నుండి హక్కులను కబళించే అధికారాన్ని కట్టబెట్టింది.

దీనివలన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి ప్రత్యక్షంగా వెళ్లనున్నారు. ఇది రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం.

ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ బిల్లు-2020 16వ ఆర్టికల్‌

The Central Government may, from time to time, give such directions, as it may consider necessary, to the State Governments for effective implementation of the provisions of this Act and the State Governments shall comply with such directions. అని పేర్కొంటున్నది.

రాష్ర్టాల జాబితా, ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయాన్ని కేంద్రం ఏదిచెప్తే అది రాష్ర్టాలు అమలుచేయడం తప్ప స్వతంత్రంగా తమ రైతుల ప్రయోజనం కోసం ఏ నిర్ణయమూ తీసుకోలేని స్థితికి రాష్ర్టాలు చేరుకోబోతున్నాయి. ఇది సమాఖ్యస్ఫూర్తికి విఘాతం కాక మరేమిటి?

ఏపీఎంసీల ద్వారా వస్తున్న ఆదాయాన్ని.. రాష్ర్టాలు ఈ వ్యవసాయ సంస్కరణల బిల్లుల వల్ల కోల్పోబోతున్నాయి. ఈ ఆదాయాన్ని రాష్ర్టాలకు ఏ విధంగా కేంద్రం పరిహారం చెల్లించనున్నదో చెప్పలేదు. ఇది రాజ్యాంగం ప్రతిపాదించిన ఆర్థిక సమాఖ్యకు విఘాతం కాదా?

కాంట్రాక్ట్‌ వ్యవసాయంలో ఇప్పటివరకు ఏపీఎంసీలు రైతులకు, కార్పొరేట్‌ కంపెనీలకు మధ్య ఒప్పందాల్లో మధ్యవర్తిత్వం చేసేవి. ఈ ఒప్పందాలు ఏపీఎంసీలలో రిజిస్టర్‌ చేయబడేవి. కొత్త బిల్లు ప్రకారం ఈ ఒప్పందాలు కేవలం రైతులకు, కార్పొరేట్‌ కంపెనీలకు మధ్యనే ఉండబోతున్నాయి.

పేద, మధ్యతరగతి రైతుల రక్షణ బాధ్యత ప్రభుత్వం వదిలించుకోవటం రైతుల కోసమా? కార్పొరేట్‌ కంపెనీల కోసమా? నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు -2020ను  అనుసరించి ఆహార ధాన్యాలు, పప్పులు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, వంట 

నూనెలపై ఉన్న అన్ని నియంత్రణలను కేంద్రం ఎత్తేయబోతున్నది. కరువు, యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, 100%పైబడి హార్టికల్చర్‌ ఉత్పత్తులు, 50% పైబడి పాడుకాని ఆహార పదార్థాల ధరలు పెరిగినపుడు మాత్రమే ధరల నియంత్రణ కేంద్రం చేయబోతున్నది. ఇప్పుడు ఉన్న అన్ని నిబంధనలు తుంగలో తొక్కుతూ వ్యవసాయ ఉత్పత్తులు నిలువ ఉంచుకునే అవకాశం కార్పొరేట్‌ కంపెనీలకు లభించనున్నది. ఈ మార్పు వినియోగదారులకు కానీ పండించే రైతుకు కానీ ఎలా ఉపయోగపడుతుంది?

ఎస్‌డీఎం/ఆర్డీవో ఆధ్వర్యంలో జరిగే dispute resolutionలో రైతుల తరఫున వాదించేవారు ఎవరు? కార్పొరేట్‌ లాయర్లను రైతులు ఎదుర్కోగలరా? కలెక్టర్‌ ముందుకు అప్పీల్‌ వెళితే రైతు తరఫున మాట్లాడేవారు ఎవరు? పెప్సీకో కంపెనీ గుజరాత్‌ ఆలుగడ్డ రైతులపై వేసిన పేటెంట్‌ కేసులో.. గుజరాత్‌ ప్రభుత్వం ప్రతివాది రైతుల తరఫున నిలబడిన తర్వాతే పెప్సికో కంపెనీ కేసు వాపసు తీసుకున్నది అనే విషయాన్ని మనం విస్మరించకూడదు. రైతు తన ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవడమనే అధికారాన్ని పొందడం కోసం రైతుకు ఇప్పుడున్న ప్రభుత్వ రక్షణ కోల్పోక తప్పదా? ఈ విధంగా రైతు తన ఆదాయాన్ని 2022 వరకు రెట్టింపు చేసుకోగలడా? ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌.. జూన్‌ 2017లో ఇచ్చిన తమ నివేదికలో కాంట్రాక్ట్‌ ఫామింగ్‌లో ప్రభుత్వం రైతుల తరఫున కార్పొరేట్‌ కంపెనీలతో మధ్యవర్తిత్వం చేసినప్పుడే రైతులకు మేలు కలుగుతుందని తెలిపింది. ఓపెన్‌ మార్కెట్‌, కాంట్రాక్టు ఫామింగ్‌లో ప్రభుత్వం మధ్యవర్తిగా లేకపోతే అటు రైతు, ఇటు వినియోగదారుడు ఇద్దరూ నష్టపోయే అవకాశం లేకపోలేదు. ఒక చెట్టు కొట్టి దానితో పనిముట్లో, ఫర్నిచరో తయారుచేసినా, లేదా వంట చెరుకుగా వాడినా శ్రమ, ఉత్పత్తి జరిగి ఆదాయం కలుగుతుంది. తద్వారా దేశ స్థూల ఆదాయం పెరుగుతుంది. ఆ చెట్టును నరకకపోతే ఆదాయం రాదు. కానీ అదేసమయంలో దాన్ని నరకడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందనే విషయాన్ని ఆర్థికవేత్తలు పట్టించుకోరు. కొత్త వ్యవసాయ బిల్లులు..  మార్కెట్‌కు ఉపయోగపడవచ్చు కానీ సన్న, చిన్నకారు రైతు నష్టపోయే అవకాశమే ఎక్కువగా  ఉన్నట్లు కనిపిస్తున్నది. అందుకే ఆర్థికవేత్తలు ఈ బిల్లులను స్వాగతించినా రైతులు వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త రఘురాంరాజన్‌ ఇటీవల రచించిన థర్డ్‌ పిల్లర్‌లో మార్కెట్‌, రాజ్యం, కమ్యూనిటీకి సమతుల్యం ఉన్నపుడే క్యాపిటలిజం సమాజ ఉన్నతికి దోహదం చేస్తుందని.. లేకపోతే వికృతరూపం దాలుస్తుందని హెచ్చరించారు. 

ఈ సమతుల్యం దెబ్బతినకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉన్నది. ఈ బిల్లును ఆమోదించి ఆ బాధ్యతను కేంద్రం విస్మరించిందని తేటతెల్లమవుతుంది. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సివిల్‌ న్యూక్లియర్‌ బిల్లును ఉభయసభల్లో ఆమోదించుకున్నప్పటికీ, రాష్ర్టాలు వాటిని తిరస్కరించిన కారణంగా అనేక రాష్ర్టాల్లో సివిల్‌ న్యూక్లియర్‌ బిల్లు అమలుకు నోచుకోలేదు.

2003లో కేంద్ర ప్రభుత్వం మోడల్‌ ఏపీఎంసీ చట్టాన్ని చేసినప్పటికీ, వ్యవసాయం, మార్కెటింగ్‌.. రాష్ర్టాల అంశం కాబట్టి రాష్ర్టాల్లో వాటి అమలు అధికారం రాష్ర్టాలదే. ఆ అధికరణాన్ని ఉపయోగించి, ఇప్పటికే కేరళ, మణిపూర్‌ రాష్ర్టాల్లో ఏపీఎంసీ నియమాలను అమలుపరచలేదు. రాష్ర్టాల అంశమైన వ్యవసాయానికి సంబంధించిన వాటిల్లో మార్పులు తీసుకురావాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 249ను అనుసరించి రాజ్యసభలో బిల్లు మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అలా పాస్‌ అయిన రెసొల్యూషన్‌ కాల పరిమితి సంవత్సరం మాత్రమే ఉంటుందని, నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఎవరు గుర్తుచేయగలరు? రాజ్యసభలో సింపుల్‌ మెజార్టీతో మూజువాణి ఓటుతో ఈ బిల్లులు పాస్‌ అయినట్లు డిప్యూటీ చైర్మన్‌ ప్రకటించారు. ఈ బిల్లులు పాస్‌ అవ్వడం రాజ్యాంగబద్ధమా కాదా అనే ప్రశ్న లెవనెత్తక తప్పదు.

- పెండ్యాల మంగళా దేవి


logo