శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 02:57:38

రఘునందన్‌ నీతిమంతుడని లేఖ ఇస్తారా?

రఘునందన్‌ నీతిమంతుడని లేఖ ఇస్తారా?

  • ఆర్సీపురం పీఎస్‌లో అతనిపై కేసు వాస్తవం కాదా?
  • కేసులు లేవని చెప్పే దమ్ము బండి సంజయ్‌కు ఉన్నదా?
  • ఉప ఎన్నికల కోసం ఇప్పటికే రూ.10 కోట్లు వసూలు  
  • బీజేపీపై తోట కమలాకర్‌రెడ్డి ఫైర్‌

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మీద ఎలాంటి రేప్‌ కేసులు లేవని చెప్పే దమ్ము.. ఆయన నీతిమంతుడు అని లేఖను విడుదల చేయించే సత్తా  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఉందా అని బీజేపీ బహిష్కృత నేత తోట కమలాకర్‌రెడ్డి ప్రశ్నించారు. దుబ్బాకలో రఘునందన్‌రావును మార్చకపోయినా, తనపైన ఉన్న సస్పెన్షన్‌ ఎత్తివేయకపోయినా బీజేపీ  పాతాళ లోకంలోకి పోతుందని హెచ్చరించారు. గురువారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో కమలాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాయకులపై ఫైర్‌ అయ్యారు. ఒక రేపిస్టుకు బీజేపీలో టికెట్టు ఎలా ఇస్తారని  ప్రశ్నించారు. బీజేపీ నాయకుడు మంత్రి శ్రీనివాస్‌ వ్యవహార శైలిపై సిగ్గుపడుతున్నానన్నారు. ఒక పెట్టుబడి దారుడు, రేపిస్టు, అక్రమ సంపాదనతో ధనబలం ప్రదర్శించే ఒక అహంకారిని ప్రశ్నించినందుకు.. ఏకపక్షంగా షోకాజు నోటీస్‌ ఇవ్వకుండా పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు లేఖను ఎలా విడుదల చేశారని కమలాకర్‌రెడ్డి బీజేపీ నాయకులను ప్రశ్నించారు. తెలంగాణ భాషలో లైంగికదాడి చేసిన వారిని రేపిస్టు అనకుండా మహానుభావుడు అంటారా?.. ఉద్యమకారుడు అంటారా? ఏమని అంటారో మంత్రి శ్రీనివాస్‌, రఘునందన్‌రావు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రఘునందన్‌రావు రేప్‌చేసింది వాస్తవం కాదా?.. ఆర్సీపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెండింగ్‌ ఉన్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. మీ పక్షాన కొట్లాడుతా అని చెప్పి రఘునందన్‌రావు.. మల్లన్నసాగర్‌ బాధితుల వద్దకు బీజేపీ ముఖ్యనేతలను తీసుకొచ్చి ముంపు గ్రామాల ప్రజల వద్ద తీర్మానాలు చేయించి, కాంట్రాక్టర్ల వద్ద డబ్బు వసూలు చేసుకొని పోయారని కమలాకర్‌రెడ్డి ఆరోపించారు. దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించగానే ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి, ఈ రెండు నెలల కాలంలోనే రఘునందన్‌రావు ఇప్పటికే రూ.10 కోట్లు వసూలు చేశారని రాష్ట్రం కోడై కూస్తుందన్నారు. నిజం నిర్భయంగా మాట్లాడితే బీజేపీలో స్థానం లేదన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి తప్ప తాగి వచ్చి మాట్లాడుతాడని ఆరోపించారు. తన ఆరోపణల్లో  ఏ ఒక్కటి తప్పున్న  తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ముక్కు నేలకు రాస్తానని ఆయన సవాల్‌విసిరారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మంచిగున్నది

  • బీజేపీ రఘునందన్‌ది పూరా లూటీ కంపెనీ
  • పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్‌

దుబ్బాక: తెలంగాణలో సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు మంచిగా కట్టిండు. అక్కడి నుంచి నీళ్లు ఇక్కడికి మల్లన్నసాగర్‌ ద్వారా రైతులకు అందించడం బాగుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హన్మంతరావు కొనియాడారు. గురువారం సాయంత్రం సిద్దిపేట జిల్లా దుబ్బాక పద్మశాలి సంఘంలో కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌తో కలిసి హన్మంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు శానా పెద్ద రికార్డు ఉన్నదనీ,  ఆయన పూరా లూటీ కంపెనీ అని విమర్శించారు. మీ ఇండ్లళ్లకు వస్తే ఆడోళ్లు జాగ్రత్త.. దర్వాజ సాటుకు ఉండుమనండి. ఆయన పెద్ద ఎక్స్‌పర్ట్‌ అని ఆ పార్టీ వాళ్లే చెప్తునట్టు పేపర్ల వచ్చిందని వీహెచ్‌ చెప్పారు. 


logo