e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home Top Slides హెలికాప్టర్‌ మనీ.. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు!

హెలికాప్టర్‌ మనీ.. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు!

హెలికాప్టర్‌ మనీ.. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు!
  • మరింత కరెన్సీ ముద్రణకు ఇదే సరైన సమయం
  • కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి
  • కొటక్‌ మహీంద్ర సీఈవో ఉదయ్‌ కొటక్‌ సూచన
  • గత ఏడాదే ప్రధానికి ప్రతిపాదించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, మే 27 (నమస్తే తెలంగాణ): హెలికాప్టర్‌ మనీ! ఈ పదం గుర్తుందా? కరోనా మొదటి వేవ్‌ సమయంలో నెలకొన్న పెను ఆర్థిక విపత్తు నేపథ్యంలో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకొచ్చిన ప్రతిపాదన ఇది. స్థూలంగా చెప్పాలంటే.. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి, ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రజలకు నేరుగా కొంత మొత్తంలో డబ్బు అందుబాటులో ఉంచడానికి ఉద్దేశించినదే ఈ హెలికాప్టర్‌ మనీ, లేదా క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌. కేంద్ర ప్రభుత్వం కరెన్సీని అదనంగా ముద్రించి, ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టడం. ఒక విధంగా చెప్పాలంటే హెలికాప్టర్‌ ద్వారా నగదును ప్రజలపై వెదజల్లడం అన్నమాట. ఈ విధానంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు వారికి తక్కువ వడ్డీకి నగదు అందజేస్తారు. ఫలితంగా వ్యాపారాలు కొనసాగి, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఇప్పుడు ఇదే అంశాన్ని బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌ సీఈవో ఉదయ్‌ కొటక్‌ కూడా ప్రస్తావిస్తున్నారు.

కొవిడ్‌తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు అదనపు కరెన్సీని ముద్రించాల్సిన అవసరం ఉన్నదని ఆయన ఎన్డీటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఇబ్బందిని ఎదుర్కొంటున్న రంగాలకు గతేడాది కేంద్రం బ్యాంకుల ద్వారా రుణాలు అందజేసింది. ఆ పథకాన్ని మరింత విస్తరించాల్సి ఉన్నది’ అన్నారు. దీన్ని ఒకటి.. వనరుల కూర్పులో అట్టడుగున ఉన్న వారు, రెండు.. మహమ్మారితో ప్రభావితమైన రంగాల్లో ఉద్యోగ భద్రత అవసరమైనవారుగా ఆయన వర్గీకరించారు. ‘ఈ పరిస్థితిలో నగదు లభ్యత పెంచడం లేదా ముద్రించడానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?’ అని ఉదయ్‌ కొటక్‌ అన్నారు. పేదలకు నేరుగా నగదు బదిలీ చేయడానికి జీడీపీలో ఒకశాతం వరకు లేదా లక్ష-రెండు లక్షల కోట్ల మధ్య కేంద్రం ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. ఇది వనరుల కూర్పులోని చివరి వరుసలో తలసరి వినియోగం పెంపును బలోపేతం చేస్తుందన్నారు.

హెలికాప్టర్‌ మనీ ఇప్పుడే అవసరం
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థను కరోనా సెకెండ్‌ వేవ్‌ చావుదెబ్బ తీసింది. మొదటివేవ్‌లో లాక్‌డౌన్‌ను జనవరి నుంచి దశలవారీగా కేంద్రం సడలిస్తూ వచ్చింది. కానీ.. దాదాపు అన్ని రాష్ర్టాల్లో ఉధృతంగా పెరిగిన కొవిడ్‌ కేసులు.. కొత్తగా ఆంక్షల విధింపునకు దారితీశాయి. వ్యాపారాలకు మళ్లీ బ్రేక్‌ పడింది. తొలి దశలో కొన్ని వ్యాపారాలు కొవిడ్‌ పరిస్థితుల్లోనూ మనుగడ సాగించగా, మరికొన్ని చతికిలపడ్డాయి. మొదటి తరహా వ్యాపారాలకు మరింత మద్దతు ఇవ్వాలని, రెండో తరహా వ్యాపారాలకు కొత్త పరిష్కార మార్గాలు వెతికి, అందులోని ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు కృషిచేయాలని ఉదయ్‌ కొటక్‌ అంటున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్‌ మనీ లేదా క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ అనేది ముందుకు వచ్చింది. వాస్తవానికి కరోనా మొదటి వేవ్‌ సృష్టించిన ఆర్థిక సంక్షోభం సమయంలోనే అమెరికా, జపాన్‌, యూరప్‌ దేశాలు టర్కీ, ఇండొనేషియా వంటి దేశాలు హెలికాప్టర్‌ మనీపై దృష్టిసారించాయి. కేసీఆర్‌ గతంలో ఈ ప్రతిపాదన చేసినప్పుడు ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు సైతం ఏకీభవించారు. రాష్ర్టాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నాయని, ప్రజలకు వైద్య సేవలు, నిత్యావసర వస్తు సరఫరాలు అందజేయడంతోపాటు వారి జీవనోపాధిని కాపాడటంలో రాష్ర్టాలకు కేంద్రం చేయూతనివ్వాలని అప్పట్లో ఉద్ఘాటించారు. క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై దృష్టిసారించి, సాహసోపేతమైన విధానాన్ని అనుసరించాలని కోరారు.

హెలికాప్టర్‌ మనీతో ప్రజలకు సాధికారత
వస్తు, సేవల కొనుగోలులో ప్రజలకు అసాధారణ రీతిలో సాధికారతను కల్పించి, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు హెలికాప్టర్‌ మనీ తోడ్పడుతుంది. దీన్ని సృష్టించేందుకు క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ ఉపకరిస్తుంది. హెలికాప్టర్‌ మనీతో కరెన్సీ నోట్ల సంఖ్య పెరిగి మార్కెట్లోకి మరింత నగదు వస్తుంది. క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాలంపాటు బాండ్లను సేకరించేందుకు రిజర్వుబ్యాంకు అనుమతినిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాటిని ఆర్బీఐ తిరిగి కొనడంతోపాటు అదనంగా కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది. కాంటిటేటివ్‌ ఈజింగ్‌ ద్వారా సృష్టించిన హెలికాప్టర్‌మనీ ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు గట్టెక్కేందుకు ఎంతో దోహదపడుతుంది.

క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ అనే ఆర్థిక సూత్రీకరణ ద్వారా దేశానికి అవసరమైన నిధులను అందుబాటులోకి తెచ్చుకొనే విధానం ఒకటి ఉన్నది. దేశ నిర్ధారిత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో నిర్ణీతశాతం మేరకు, క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ పద్ధతిలో రిజర్వు బ్యాంకు నుంచి నిధులు వాడుకునే వీలున్నది. 2019-20లో నిర్ధారిత జీడీపీ 203 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ కింద 5 శాతం లెక్క వేసుకున్నా పది లక్షల కోట్లకుపైగా అందుబాటులోకి వస్తాయి. 1929 మహా మాంద్యం, 2008 ఆర్థిక సంక్షోభం కంటే భీకరమైన ఆర్థిక సంక్షోభం నెలకొన్న తరుణంలో ఇంతకుమించి మరో మార్గం లేదు.

  • గతేడాది ఏప్రిల్‌ 11న ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌

దీర్ఘకాలంగా కొవిడ్‌ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు అదనపు కరెన్సీని ముద్రించాల్సి న అవసరం ఉన్నది. నగదు లభ్యత పెంచడం లేదా ముద్రించడానికి ఇదే సరైన సమయం. ఆ పనిచేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?

  • ఉదయ్‌ కొటక్‌,కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌ సీఈవో
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హెలికాప్టర్‌ మనీ.. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు!

ట్రెండింగ్‌

Advertisement