గురువారం 09 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 01:39:23

కొత్త రోగానికి పాతమందు

కొత్త రోగానికి పాతమందు

  • కరోనా చికిత్సకు ఇదే ఉత్తమ మార్గం
  • ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ఐఐసీటీ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చికిత్సకు కొత్త ఔషధాన్ని కనుగొనే బదులు ఉన్నవాటిల్లోనే ప్రభావవంతంగా పనిచేసే పాత ఔషధాలపైనే దృష్టి సారించాలని హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ సూచిస్తున్నారు. ఒక వ్యాధికి వ్యాక్సిన్‌ను వేగంగా తయారుచేయగలం కానీ.. ఔషధానికి మాత్రం దశాబ్దం పడుతుందని అంటున్నారు. ‘పారాసిటమాల్‌ మనకు విరివిగా దొరికే ఔషధం. అనేక సందర్భాల్లో వాడుతుంటాం. ఈ ఔషధాన్ని సృష్టించడానికి శాస్త్రవేత్తలు 8 నుంచి 12 ఏండ్లపాటు శ్రమించారు. రూ.10 వేల కోట్లకుపైనే వ్యయం అయ్యింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. మనం వాడుతున్న ప్రతి ఔషధం వెనుక ఉన్న వాస్తవమిది’ అని ఆయన వివరించారు. ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రశేఖర్‌ పలు అంశాలను పంచుకొన్నారు.

ఒక ఔషధాన్ని తయారుచేయడానికి ఎంత సమయం పడుతుంది? 

ఒక వ్యాధికి సంబంధించిన డ్రగ్‌ తయారుకావాలంటే కనీసం 8 నుంచి 10 ఏండ్ల సమయం పడుతుంది. సగటున దాదాపు రూ.10 వేల కోట్ల వరకు వ్యయం అవుతుంది. 

అంత సమయం ఎందుకు తీసుకుంటుంది?

మన శరీరం సాధారణంగా పనిచేయడానికి రోజూ ఎన్నో రసాయన చర్యలు జరుగుతుంటాయి. ఒక్కో రకమైన కణంలో ఒక్కో చర్య జరుగుతుంటుంది. ఇందులో ఒకటో రెండో రసాయన చర్యలు తప్పుగా జరిగినప్పుడు మనకు వ్యాధి పుడుతుంది. వీటిని సరిదిద్దే ఔషధాన్ని మనం తయారుచేయాల్సి ఉంటుంది. ఆ ఔషధం ఆరోగ్యవంతమైన కణాలపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి. ఈ క్రమంలో మనకు అవసరమైన మూలకాన్ని గుర్తించి, వివిధ దశల్లో పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. 

మార్కెట్‌లో ఎన్ని ఔషధాలు ఉన్నాయి?

ప్రస్తుతం మార్కెట్‌లో అన్నిరకాల రోగాలకు కలిపి 3,500 నుంచి 4 వేల ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ అప్రూవ్డ్‌ డ్రగ్స్‌. వాటి పనితీరు, సైడ్‌ ఎఫెక్ట్స్‌పై మనకు పూర్తి అవగాహన ఉన్నది. కాబట్టి కరోనా చికిత్సకు వీటిలో నుంచే వాడుకోవడం ఉత్తమం. యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ అయిన రెమ్డిసెవిర్‌, ఫావిపిరవిన్‌.. కరోనా చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు హైదరాబాద్‌ ఐఐసీటీ నిర్ధారించింది. ఇవి త్వరలోనే విస్తృతంగా అందుబాటులోకి రావొచ్చు.

మన వద్ద ఎక్కువగా ఔషధ పరిశోధనలు జరుగకపోవడానికి కారణం? 

ఒక ఔషధం కనిపెట్టాలంటే కనీసం 1 నుంచి 2 బిలియన్‌ డాలర్ల వ్యయం అవుతుంది. సగటున తీసుకున్నా.. రూ.10 వేల కోట్లవరకు వ్యయం అవుతుంది. పరిశోధనలకు ఇంత మొత్తంలో వ్యయంచేసే పరిస్థితి మన వద్ద లేదు. 

ఒక ఔషధం తయారీలో ఎన్ని దశలుంటాయి?

  • మన ఆవర్తన పట్టిక ప్రకారం ప్రకృతిలో 118 మూలకాలు ఉన్నాయి. ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయి రసాయన సమ్మేళనాలుగా మారుతాయి. మనం ఈ మూలకాలతో అనంతమైన సమ్మేళనాలను తయారుచేయవచ్చు. ఇప్పటివరకు దాదాపు 2 లక్షల సమ్మేళనాలు మనకు ఉపయోగపడుతాయని తేలింది.
  • మొదటిదశలో వీటినుంచి దాదాపు లక్ష సమ్మేళనాలను ఎంచుకొంటాం. జబ్బుబారిన పడిన కణాలను తీసుకొని ఒక్కో రసాయన సమ్మేళనాన్ని వాటిపై ప్రయోగిస్తాం. ఇలా చేసుకుంటూ వెళ్తే చివరగా దాదాపు వెయ్యివరకు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తేలుతాయి. తర్వాత ఇవి ఆరోగ్యవంతమైన కణాలపై ఏమైనా ప్రభావం చూపుతున్నాయేమో పరీక్షిస్తాం. చివరికి 100 నుంచి 150 సమ్మేళనాలు షార్ట్‌ లిస్ట్‌ అవుతాయి. దీనికి కనీసం 2 నుంచి 3 ఏండ్లు పడుతుంది. 
  • రెండోదశలో ఈ సమ్మేళనాలను ఎలుకలు వంటి చిన్న జంతువులపై ప్రయోగిస్తాం. వ్యాధి తగ్గుతున్నదా? లేదా? ఇతర అవయవాలపై ఏమైనా దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయా? వంటివి పరిశీలిస్తాం. దీర్ఘకాలికంగా ఏమైనా సైడ్‌ ఎఫెక్ట్స కనిపిస్తున్నాయేమో చూస్తాం. చివరికి 3- 4 సమ్మేళనాలు మిగులుతాయి. ఈ దశకు మరో 2 నుంచి 3 ఏండ్లు పడుతుంది. 
  • మూడోదశలో కోతులు, కుందేళ్లు వంటివాటిపై ప్రయోగిస్తాం. ప్రభావవంతంగా పనిచేసే ఒక ఔషధాన్ని ఎంపికచేస్తాం. ఇందుకు దాదాపు రెం డేండ్ల సమయం తీసుకుంటుంది. 
  • చివరగా మనుషులపై ప్రయోగాలు ప్రారంభిస్తాం. అన్నిరకాల అనుమతులు తీసుకొని, రోగులను ఎంపికచేసి వారిపై ప్రయోగించాల్సి ఉంటుంది. దీర్ఘకాలికంగా కలిగే ప్రభావాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకు 2 నుంచి 3 ఏండ్లు పడుతుంది. 


logo