గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 17:19:57

ఇది రైతు బడ్జెట్ : మంత్రి నిరంజన్ రెడ్డి

ఇది రైతు బడ్జెట్ : మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్ : ఇవాళ అసెంబ్లీలో  ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం, ఆకాంక్ష, లక్ష్యం, చిత్తశుద్ది, పట్టుదలకు అద్దం పడుతుందని  వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బడ్జెట్ కేటాయింపులపై మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ...కోటి ఎకరాల మాగాణ తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులున్నాయన్నారు.  సమైక్య పాలనలో వ్యవసాయం దండగ అని అన్నంపెట్టే రైతన్న వెన్ను విరిచారు. గత ఆరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాల మూలంగా తెలంగాణ అంతా పచ్చబడుతున్నదని స్పష్టం చేశారు.

మాది రైతు ప్రభుత్వం అని, ఇది రైతు బడ్జెట్ అని మరోసారి నిరూపితమైందన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో అగ్రభాగం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించడం సంతోషకరమైన విషయమని చెప్పారు. రైతుబంధు పథకం కింద లబ్దిదారులు పెరిగిన నేపథ్యంలో గతంలో కేటాయించిన రూ.12 వేల కోట్లకు అదనంగా మరో రూ. 2 వేల కోట్లు పెంచి రూ.14 వేల కోట్లు కేటాయించడం హర్షణీయమని పేర్కొన్నారు.  రైతులకు ప్రభుత్వమే భీమా చెల్లించి రైతు కుటుంబాలలో ధీమాను పెంచే రైతు భీమా పథకానికి రూ.1141 కోట్లు కేటాయించిందన్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష లోపు రైతుల రుణాల మాఫీకోసం బడ్జెట్ లో రూ. 6,225 కోట్లు ప్రభుత్వం కేటాయించినట్లు పేర్కొన్నారు. రూ.25 వేల లోపు రుణాలున్న రైతులకు..రుణమాఫీకి సంబంధించిన చెక్కులను  స్వయంగా త్వరలో ఎమ్మెల్యేలు అందజేస్తారు. రూ.25 వేల పైబడి రూ.లక్ష వరకు రుణం ఉన్న రైతులకు నాలుగు విడతలుగా రుణమాఫీ చెక్కులు అందజేస్తారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక రైతువేదిక నిర్మాణం.. ప్రతి రైతు వేదికకు రూ.12 లక్షలు కేటాయిస్తూ రూ.350 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పంటల కొనుగోళ్లకోసం (మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్) రూ.1000 కోట్లు కేటాయించడం సాహసోపైతమయిన చర్య అని పేర్కొన్నారు. రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కాలనే  ప్రభుత్వ ఆలోచనకు ఇది కార్యరూపమని మంత్రి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

విత్తనాల సబ్సిడీకి రూ.142 కోట్లు..పాడి రైతుల ప్రోత్సాహం కోసం రూ.100 కోట్లు, బిందు, తుంపర సేద్యానికి రూ. 600 కోట్లు, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరంటు సరఫరా భారం రూ.5 వేల కోట్లు,  సాగునీటి రంగానికి రూ. 11,054 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్దపీట వేసి కేటాయింపులు ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికమంత్రి హరీష్ రావుకు రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. 


logo
>>>>>>