శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 03:13:19

అవి పగుళ్లు కాదు.. లైనింగ్‌పై మట్టి

అవి పగుళ్లు కాదు.. లైనింగ్‌పై మట్టి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన లక్ష్మీ పంపుహౌజ్‌- అన్నారం బరాజ్‌ గ్రావిటీ కాలువకు పగుళ్లు ఏర్పడ్డాయంటూ ఓ పత్రికలో కథనం రాస్తూ ఇచ్చిన ఫొటో ఇది. కాలువకు వేసిన లైనింగ్‌ అంతా కొట్టుకుపోయిందంటూ రాశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పైనుంచి కిందకువచ్చి జారిన మట్టిని కనీసం పరిశీలించకుండా ఫొటో తీసి.. కథనం ప్రచురిస్తూ.. ఈ చిన్న విషయంతో వేలకోట్ల ప్రాజెక్టు నిర్వీర్యమవుతున్నదంంటూ రాశారు.

వాస్తవంగా కాళేశ్వరం గ్రావిటీ కాలువల్లో నీళ్లు కిందకు పారడమే కాదు.. కొన్నిచోట్ల నిల్వ ఉంటూ ఎదురెక్కుతాయి. అలాంటి సమయంలో కాలువ అడుగుభాగం కంటే ఇరుపక్కల ఉండే లైనింగ్‌ గట్టిదనంతో ఉండాలి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని గ్రావిటీ కాలువల లైనింగ్‌ పనులను పకడ్బందీగా చేపట్టింది. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలతో కట్టపైనుంచి మట్టి కాలువలోకి నీళ్లతోపాటు కారింది. ఎత్తుగా ఉన్నచోట గడ్డలుగా పేరుకుపోయింది. అధికారులు నీళ్లతో శుభ్రం చేయడంతో మట్టిఅంతా పోయి లైనింగ్‌ బయటపడింది. కాళేశ్వరం ఎస్‌ఈ రమణారెడ్డి మట్టి తొలగించడానికి ముందు, తర్వాత ఫొటోలను ఈఎన్సీ వెంకటేశ్వర్లుకు పంపించారు. వానకాలం సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి అవాస్తవ కథనాలతో రైతులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉన్నది. logo