గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 01:27:30

ఈ విరామమూ మంచిదే!

ఈ విరామమూ మంచిదే!

మొబైల్‌ ఫోన్‌లో తలదూర్చి.. తోటివాళ్లను నెట్టుకుంటూ, తొక్కుకుంటూ.. సమాజ శ్రేయస్సును, మానవ సంబంధాలను తుంగలో తొక్కి.. స్వార్థం, లాభాపేక్ష, ఈర్ష్యలతో.. మితిమీరిన వేగంతో.. లేని లక్ష్యాన్ని సాధించడం కోసం వెర్రెత్తినట్టు పరుగెడుతున్న మానవుడికి ఒక వైరస్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేసింది. దాని దెబ్బకు మానవజాతి మొత్తం కంపించింది, ప్రపంచం ఒక్కసారిగా స్తంభించింది. ఆ సడన్‌ బ్రేక్‌ చేసిన శబ్దంతో యావత్‌ భూమండలం చెవులు, గుండెలు, రెక్కలు, డొక్కలు డంగై పోయాయి. తన మేధోశక్తితో ఏదైనా సాధించవచ్చని మితిమీరిన ఆత్మవిశ్వాసం, ఎక్కడలేని ధీమాతో ఉన్న మనిషిని గింగిరాలు తిప్పి అన్నీ (సరిహద్దులు, విమానాశ్రయాలు, ఇంటి తలపులు... )మూసుకుని ఇంట్లో కూర్చునేలా చేసిందది. నిస్సహాయంగా.. ఇప్పు్పడెలాగబ్బా అని మనిషి జుట్టుపీక్కునే అసాధారణ పరిస్థితిని కల్పించింది.ప్రపంచయుద్ధాల తర్వాత అంతటి విపత్కర వాతావరణాన్ని మానవాళి మళ్లీ ఇప్పుడు అనుభవిస్తున్నది.అన్ని అవసరాలు తీరుస్తూ మనిషిని కంటికి రెప్పలా కాపాడే ప్రకృతి పెట్టిన ఈ విషమ పరీక్షను మనిషి శక్తియుక్తులను వినియోగించి విరుగుడు మంత్రం కనిపెట్టాల్సిందే, విజయం సాధించాల్సిందే. ఏ దేవదేవుడో వచ్చి మనిషిని ఆదుకోడు. కచ్చితంగా.. ఇన్నేళ్లుగా మనిషి ప్రోది చేసుకున్న శాస్త్రీయ పరిజ్ఞానం నుంచే ఒక పరిష్కారం వెతుక్కోవాలి, అది దొరుకుతుంది. ఇందులో అనుమానం లేదు. కానీ, ఈ అంతర్జాతీయ విషమ పరిస్థితి సృష్టించిన ఒక మౌన రోదన, శ్మశాన నిశ్శబ్దం మధ్యన వేగం ఆగిన మనిషి తీరిగ్గా కూర్చొని మననం చేసుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. అందులో కీలకమైన ఓ నాలుగు అంశాల విశ్లేషణే ఈ వ్యాసం ఉద్దేశం. 

సమాచారసునామీ

ప్రపంచీకరణ, వినూత్న సాంకేతిక ఆవిష్కరణలు, సమాచార విప్లవం.. మూడూ మూకుమ్మడిగా ప్రపంచ గమనాన్ని గణనీయంగా మార్చి, మనిషి పోకడను, మానవ సంబంధాలను ప్రభావితం చేశాయి. ఎన్నో సుఖప్రదమైన సౌకర్యాలను కల్పించిన డిజిటల్‌ ప్రపంచం మనుషులను దగ్గర చేసింది కానీ మనసులను దూరం చేసింది, చేస్తున్నది. భవిష్యత్‌ విశ్లేషణ పేరిట 1964 నుంచి సమాచార రాశిని గణిస్తున్న ఇంటర్నేషనల్‌ డాటా కార్పొరేషన్‌ (ఐడీసీ) చెప్తున్న ప్రకారం.. మనిషి సృష్టిస్తున్న డాటా ప్రతి రెండేండ్లకు రెండింతలు అవుతున్నది. 2013లో 4.4 ట్రిలియన్‌ గిగాబైట్స్‌ నుంచి 2020 కల్లా 44 ట్రిలియన్‌ గిగాబైట్స్‌ అవుతుందని కొన్నేండ్ల కిందట జోస్యం చెప్పింది. ఇందులో ఉపకరించే సమాచారం 20 నుంచి 25 శాతం ఉండొచ్చట. మిగిలినది.. సొల్లు, దుల్లు, పోచుకోలు అని అనుకోవచ్చు. మనమంతా ఏదో ఒక రూపంలో ఎలాగోలా డిజిటల్‌ డాటా సృష్టించి వదులుతున్నాం. మొబైల్‌ ఫోన్‌ ఉన్న ప్రతివాడూ ఈ క్రతువులో భాగస్వామే. ఎవరింటికి వెళ్లినా.. కుటుంబసభ్యులంతా ఈ సమాచార సృష్టి, వినియోగంలో బిజీ అవుతూ క్షణం తీరిక లేకుండా ఎవరి ప్రపంచంలో వారు కనిపిస్తారు. వయో, మేధో పరిణతులతో సంబంధం లేకుండా ఇంతేసి సమాచారం అరచేతిలో ఉండటంతో చాలావరకు బీభత్సకాండ జరుగుతున్నది. ‘ఊరుకున్నంత ఉత్తమం లేదు..’ అన్న మాటకు ఇప్పుడు విలువే లేదు. అంతా నిరంతరం మొబైల్‌లోనో, కంప్యూటర్‌లోనో తలదూర్చి పరలోక విహారం చేస్తున్నారు. సోషల్‌మీడియాలో సొల్లు కబుర్లతో కాలక్షేపం చేస్తూ.. ఇతరుల జీవితాల్లోకి ఎక్కువ తొంగిచూస్తూ, అవసరం లేకపోయిన విషయాల మీద అభిప్రాయాలు విసురుతూ, లైకులు, ఫార్వడ్స్‌ కోసం పడిచస్తున్న జనం ఎక్కువైపోతున్నారు. సహజత్వానికి, సృజనత్వానికి సమాధులు కట్టి అవధుల్లేని సమాచార సాగరంలో పిచ్చోళ్లలా పడి కొట్టుకుపోవడం లేదూ?

ఆధిపత్య భావం

కులం, మతం, ప్రాంతం.. వంటి అంశాల ప్రాతిపదికన ఇతరుల కన్నా తామే గొప్పన్న భావన అంతకంతకూ పెరుగుతున్నది. ఆధిపత్య భావన గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన మానసిక విశ్లేషకుడు ఆల్ఫ్రెడ్‌ అడ్లర్‌ ప్రకారం.. ఆత్మన్యూనతతో సతమతమయ్యే వారు ఆ భావాన్ని దాచుకునే క్రమంలో ఇతరులపై ఆధిపత్యం కనబరిచేందుకు తపిస్తారు. ఇండ్లలో, కుటుంబాల్లో, కార్యాలయాల్లో, సమాజంలో ఈ భావన చెప్పలేనంత చేటు చేస్తున్నది. భార్యను భర్త, ఉద్యోగిని బాసు, బలహీనుడ్ని బలవంతుడు, లేనివాడిని ఉన్నవాడు.. ఇలా ఆధిపత్య ధోరణితో వ్యక్తిగత ప్రతిభను ఖూనీ చేస్తున్నారు. ఈ జాడ్యం వల్ల కక్షలు, కార్పణ్యాలు పెచ్చరిల్లుతున్నాయి. ఫలితంగా ఒక సమూహంపై మరో సమూహం అపార్థంతో మెలగడం, ఒక గ్రూపు మరొక గ్రూప్‌పై కత్తికట్టడం.. వీటివల్ల సామాజిక అశాంతి నెలకొని ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తున్నది. మనిషిని మనిషిగా చూడటం మానేసి.. సమయానుకూలంగా, తమ ప్రయోజనాలకు అనుకూలంగా జనం ఆధిపత్య భావన కనబరిచి మానసిక హింసకు పాల్పడుతున్నారు.ఇక్కడ ప్రస్తావించిన నాలుగు అంశాలకు కరోనా పుట్టుక, వ్యాప్తికి సంబంధం ఇసుమంతైనా లేదు. పదిమంది కలిస్తే.. మాట్లాడుకుని ఈసడించుకునే అంశాలే ఇవి. కరోనా కల్పించిన ఈ కొంత విరామ సమయంలో ఈ అంశాలమీద దృష్టిపెట్టి సుఖమయమైన జీవితానికి మార్గాన్ని సుగమం చేసుకోవాలి. ఎండమావి నీళ్లు తాగి గుండె మంటలార్పుకోకుండా.. ఆనందమే జీవిత మకరందం.. అని సుఖసంతోషాలతో హాయిగా బతికేద్దాం.

డబ్బే ధ్యేయం

పది రూపాయలు పెట్టుబడిగా పెట్టి వంద రూపాయలు సంపాదించేవాడు ఇప్పుడు హీరో. తొంభై రూపాయలు సంపాదించడానికి ఎంత గడ్డి కరిచిందీ, ఎన్ని అడ్డదార్లు తొక్కిందీ ఇప్పుడు ఎవ్వడూ పట్టించుకోవడంలేదు. పది రూపాయలు పెట్టుబడి పెట్టి పదిహేను రూపాయలు లాభంగా గడించేవాడు మొదటివాడి ముందు అప్రయోజకుడి కింద లెక్క. జనం, సమాజం, మీడియా.. అందరూ మొదటి రకం వ్యక్తికి జేజేలు పలుకుతారు. జనాలను, బ్యాంకులను ముంచిన మహానుభావులందరికి ఆరంభంలో రాచమర్యాదలు, ఆహో ఓహోలు పుష్కలంగా దక్కిన విషయం మనం చూసిందే. పోయేప్పుడు మూటకట్టుకుపోయేది శూన్యమున్న స్పృహ లేకుండా నీతీ రీతీ లేకుండా సంపాదించడం ఒక ఎత్తైతే, అలాంటివారిని ఆదరించి అందలాలు ఎక్కించడం మరొక ఎత్తు. లాభాపేక్ష లేకుండా ఇప్పుడు ఎవ్వరూ ఏమీ చేయడంలేదు కదా!

ఆనందం మాయం

మనిషి చేసే ప్రతి పని పరమావధి ఆనందమే. తొందరగా పోకుండా ఈ భూమ్మీద సాధ్యమైనన్ని రోజులు గడపడానికి మనిషి పడే తపనే జీవితం. గ్రీసులో ఇకారియా ఐలాండ్‌ ఒకటుంది. అక్కడి ప్రజలు సునాయాసంగా వయస్సులో సెంచరీ కొడతారు. అక్కడి జీవన విధానంపై ఎన్నో అధ్యయనాలు జరిగాయి. ’మరణించడం మరిచిపోయే ప్రజలున్న ద్వీపం’ పేరిట ది న్యూయార్క్‌ టైమ్స్‌ ఎనిమిదేండ్ల కిందట ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. బాగా సంపాదించి కూడబెట్టాలన్న యావ లేకపోవడం, ఉన్నదానితో తృప్తిపడటం, ప్రకృతిని ఆస్వాదించడం, శారీరక శ్రమ చేయడం, వనమూలికలతో కూడిన టీ చేసుకుని మిత్రులతో కలిసి సేవించడం, పెరట్లో పండించుకున్న కూరగాయలు, ఆకుకూరలు చక్కగా ఆలివ్‌ ఆయిల్‌తో వాడుకుని లాగించడం, మధ్యాహ్నం ఒక కునుకు తీయడం, స్థానికంగా తయారైన వైన్‌ను లాగిస్తూ సాయంవేళ గాన, నృత్య సమ్మేళనాల్లో మునిగితేలడం, అప్పుడప్పుడూ ఉపవాసాలుండటం.. వంటి సరళమైన పనులతో ఇకారియా ప్రజలు వృద్ధాప్యంలోనూ ఆనందసాగరంలో మునిగితేలుతున్నారు. మనం ఇవన్నీ ఎందుకు చేయలేం? పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో హాయిగా బతకలేమా? మనం మునిగితేలుతున్న మతాల బోధన సారం ఇదే కదా!


logo