గురువారం 09 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 04:02:50

ఎడారిలో..దొంగల ముఠా

ఎడారిలో..దొంగల ముఠా

  • ‘ఖాకీ’లకే సినిమా చూపిస్తున్న కేటుగాళ్లు
  • దేశవ్యాప్తంగా కోట్ల రూపాయల్లో మోసాలు
  • స్థానిక పోలీసు, రాజకీయ అండతో ఆగడాలు
  • అరెస్టులకు వెళ్తే పోలీసులపైనే మూక దాడులు
  • రాష్ర్టాల సరిహద్దుల్లో ఉండి లొకేషన్లతో తికమక
  • తలలు పట్టుకుంటున్న పలు రాష్ర్టాల పోలీసులు 

ఒకడు బ్యాంకు అధికారిగా ఫోన్‌ చేసి.. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వివరాలు తీసుకొంటాడు. మరొకడు ఓఎల్‌ఎక్స్‌లో వాడిన వాహనాలు తక్కువ ధరకే అమ్ముతామని పెడతాడు. మరొకడు వాహనాలు కొంటానని చెప్పి వివరాలు తీసుకొని అవే వాహనాలను తిరిగి అమ్మకానికి పెడతాడు. తాము ఆర్మీ అధికారులమంటారు. ఆర్మీడ్రెస్‌లు వేసుకొని ఆర్మీ క్యాంపులో ఉన్నట్టుగా సీన్‌ క్రియేట్‌చేస్తాడు. వీడియోకాల్‌లో కూడా మాట్లాడి కన్విన్స్‌చేస్తారు. మీరు ఏ మాత్రం మొగ్గుచూపినా సరే.. మీకు తెలియకుండానే మీ సొమ్ము మాయమైపోతుంది. వీళ్లెవరూ చదువుకున్నోళ్లు కాదు. టెక్నోక్రాట్లు అంతకంటే కాదు. జస్ట్‌ ఒకే ఒక్క బేసిక్‌ స్మార్ట్‌ఫోన్‌తో కోట్లు కొల్లగొట్టేస్తున్నారు.

రీల్‌ కథ..

‘రాజస్థాన్‌కు చెందిన ఓ దోపిడీ దొంగల ముఠా. హైవేల పక్కన ఉన్న ఇండ్లే లక్ష్యంగా చేసుకుని మనుషులను అతి కిరాతకంగా చంపి డబ్బు, నగలు దోచుకెళ్తుంది. ఏడాదిలో రెండునెలలు నేరాలు చేసి తిరిగి రాజస్థాన్‌లోని సొంతూళ్లకు వెళ్లిపోతుంది. గ్యాంగ్‌ను వెతుక్కుంటూ వెళ్లిన డీఎస్పీ బృందానికి స్థానిక పోలీసులు సాయం చేయకపోగా, దొంగలకు సమాచారమిస్తారు. ఊరుఊరంతా ఏకమై పోలీసులను తరిమికొడతారు’ ఇది హీరో కార్తీ, విలన్‌ అభిమన్యుసింగ్‌ నటించిన ‘ఖాకీ’ సినిమా కథ.

రియల్‌ కథ..

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లా సైబర్‌ ముఠాలు అవి. చుక్క రక్తపాతం ఉండదు. కానీ, ఆన్‌లైన్‌లో రూ.కోట్లు కొల్లగొడుతున్నాయి. ఓఎల్‌ఎక్స్‌ అని, క్రెడిట్‌, డెబిట్‌కార్డుల అప్‌డేషన్‌ పేరుతో దేశవ్యాప్తంగా మోసాలు చేస్తున్నాయి. ఈ ముఠాలకు స్థానిక పోలీసులు, బ్యాంకు ఉద్యోగులు సహకరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు అక్కడకు వెళ్తున్న వివిధ రాష్ర్టాల పోలీసులపై దొంగలు ‘ఖాకీ’ సినిమా తరహాలో దాడులు చేస్తున్నారు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లా డీగ్‌, కమన్‌ మండలాల్లో అత్యధికంగా యువత సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నది. హర్యానాలోని మేవట్‌ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. వీళ్లను పట్టుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ‘మీవాళ్లను ఎవరు మోసపొమ్మన్నారు. మా వాళ్లేమైనా మీ తెలంగాణ వాళ్ల ఇండ్లమీదికి వచ్చి లూటీ చేశారా? మీరే తెలివిలేక మోసపోయారు. మా వాళ్లను వెతుక్కుంటూ ఇక్కడిదాకా వస్తారా? మీకెంత ధైర్యం’ అంటూ భరత్‌పూర్‌కు చెందిన నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధి అక్కడకు వెళ్లిన తెలంగాణ పోలీసులను గద్దించి పంపారు. ‘మాకు తెలియదా ఈ ముఠాల గురించి. మేమే ఏమీ చేయలేకపోతున్నాం. ఎందుకు సార్‌ ఇక్కడికొచ్చి అనవసరంగా టైం వేస్ట్‌ చేసుకుంటారు. వాళ్లు ఎంత క్రూరులో మీకు తెలుసా? వెళ్లి మీ ప్రజలు మోసపోకుండా అవగాహన కల్పించండి’ ఇన్వెస్టిగేషన్‌పై రాజస్థాన్‌కు వెళ్లిన పోలీస్‌ బృందానికి అక్కడి పోలీస్‌ ఉన్నతాధికారి హితవు ఇది. ఇలా స్థానిక పోలీసులు సహకరించక, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో దొంగలు తప్పించుకుంటున్నారు. 

ఆర్మీ దుస్తులతో కొత్త వేషాలు

భరత్‌పూర్‌ జిల్లాలోని సైబర్‌ ముఠాల ప్రధాన చోరీ అస్త్రం ఓఎల్‌ఎక్స్‌. ఈ ముఠాలు ఏకంగా కాల్‌ సెంటర్లే నడుపుతుంటాయి. కాల్‌సెంటర్ల నుంచి కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు.. బ్యాంకు అధికారుమంటూ క్రెడిట్‌, డెబిట్‌కార్డుల వివరాలు తీసుకుంటున్నారు. తాము ఆర్మీ అధికారులమని వేరే రాష్ర్టానికి బదిలీఅయిందని, సెకండ్‌హ్యాండ్‌ కార్లు, బైక్‌లు ఇలా ఖరీదైన వస్తువులు తక్కువ ధరకే అమ్ముతామని ప్రకటనలిస్తారు. ఎవరైనా సంప్రదిస్తే అడ్వా న్స్‌ అంటూ డబ్బు తమఖాతాల్లో వేయించుకుని మోసగిస్తారు. ఆ డబ్బు ఇతర ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంటారు. ఆర్మీ అధికారులమంటూ చేస్తున్న మో సాలను నమ్మడంలేదని.. ఈ దొంగలు కొత్త వేషాలు మొదలుపెట్టారు. ఆర్మీ దుస్తులతో వీడియోకాల్స్‌ మాట్లాడుతుంటారు. మరికొందరు మిలిటరీ డ్రెస్‌లో వెనుక మాట్లాడుకుంటున్నట్టు బిల్డప్‌ ఇస్తారు. 

దొంగలకు అండ

సైబర్‌ ముఠాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, బ్యాంకు అధికారులు అండగా నిలుస్తున్నారు. ‘సైబర్‌ దొంగలని పట్టుకోవాలని ఒకసారి వివిధ ర్యాంకుల ఆఫీసర్లతో కలిపి 40 మంది తెలంగాణ పోలీసులం స్పెషల్‌ పర్మిషన్‌తో భరత్‌పూర్‌కు వెళ్లాం. ముందే మా ఆఫీసర్లు, రాజస్థాన్‌ పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. భరత్‌పూర్‌ జిల్లా ఎస్పీ స్వయంగా ఒక ఏసీపీస్థాయి అధికారిని, 60 మంది రాజస్థాన్‌ పోలీసులను ఇచ్చి పంపారు. అంతా కలిసి 100 మంది బెటాలియన్‌తో రెండు ఊళ్లకు బయలుదేరాం. ఓ ఊరికి చేరుకునే సరికే.. వెనక్కి రండి అంటూ ఎస్పీనుంచి ఫోన్‌ వచ్చింది. మేం వెతుకుతున్న దొంగ కండ్లముందే ఉన్నాడు. కానీ అరెస్టు చేయలేకపోయాం. లోకల్‌ ఎమ్మెల్యే ఫోన్‌చేసి ఒత్తిడి తెచ్చారని తర్వాత తెలిసింది’ అని భరత్‌పూర్‌ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ ఎస్సై తెలిపారు.  తెలంగాణనుంచి రాజస్థాన్‌లోని ఏ బ్యాంకులోకి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయ్యిందో కనుక్కుని అక్కడకెళ్లి వివరాలు సేకరించేలోపు పోలీసుల ఫొటోలు, ఫోన్‌నంబర్లు ముఠాల వాట్సాప్‌ గ్రూపుల్లోకి వెళ్లాయని చెప్పారు. 

ముఠాలకు వాట్సాప్‌ గ్రూప్‌

రాజస్థాన్‌ భరత్‌పూర్‌ జిల్లాలోని కామన్‌, డీగ్‌ మండలాలతోపాటు సరిహద్దునే ఉన్న హర్యానాలోని మేవట్‌ జిల్లాలోని సైబర్‌ దొంగలంతా వాట్సాప్‌ గ్రూప్‌లు పెట్టుకున్నారు. వారి ప్రాంతానికి ఇతర రాష్ర్టాల పోలీసులు వచ్చినట్టు తెలిస్తే వాళ్ల వివరాలు, ఫొటోలు సేకరించి గ్రూప్‌లో పెడతారు. అంతా గప్‌చుప్‌ అయిపోతారు. ఆ ఫొటోల్లోని పోలీసులను గుర్తిస్తే ట్రాప్‌చేసి కొట్టి పంపిస్తారు. ముఠాల్లోని ప్రతి ఒక్కరి ఇండ్లలో నాటు తుపాకులు ఉంటాయి. సైబరాబాద్‌ స్పెషల్‌ పోలీస్‌ బృందంపైనా ఓసారి ఇదే తరహా దాడిచేశారు. మరోకేసులో దొంగను పట్టుకునేందుకు వెళ్లిన హైదరాబాద్‌ సీసీఎస్‌ ఎస్సై, మరో ముగ్గురు పోలీసులపై గోవింద్‌గఢ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దాడికి యత్నించారు. ఏ రాష్ట్ర పోలీసులైనా సరే ఊళ్లో అడుగుపెట్టేదే ఆలస్యం అంతా ఏకమై దాడికి వస్తారు.

చదువు తక్కువ.. మోసాలు ఎక్కువ

భరత్‌పూర్‌ ముఠాల్లో పది, ఆపైన చదివినవాళ్లు తక్కువే. ఒక గ్యాంగ్‌లో కొందరు వస్తువులు అమ్ముతామని ప్రకటనలు పెడుతుంటే, మరికొంత మంది బైక్‌లు కావాలంటూ కస్టమర్లలా ప్రకటనలు పెడతారు. అమ్ముతామని వచ్చే వాళ్లనుంచి బండి ఫొటో లు, ఐడీకార్డులు ఇలా అన్ని వివరాలు తీసుకుంటా రు. అడ్రస్‌మార్చి వాటిని తిరిగి అమ్ముతున్నట్టు మరో ప్రకటన తయారుచేసి ఇతరులను మోసగిస్తుంటారు. రాజస్థాన్‌ మాజీ మహిళా సీఎం ఖాతానుంచి ఈ గ్యాంగ్‌ రూ.4 లక్షలు కొట్టేసింది. పోలీసులు.. దొంగలను బతిమిలాడి డబ్బు తిరిగి ఇప్పించారని ఓ పోలీస్‌ చెప్పుకొచ్చారు.

సరిహద్దుల్లో ఉంటూ గజిబిజి

భరత్‌పూర్‌, మేవట్‌ జిల్లాల సైబర్‌ నేరగాళ్ల బాధితులు దేశమంతా ఉంటున్నారు. హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ సరిహద్దుల్లోనే ఈ ముఠాల ఉంటా యి. రైలు ఎక్కితే గంటల్లో ఢిల్లీకి పోతారు. రెండ్రోజులు ఓ రాష్ట్ర సరిహద్దులో, ఇంకొన్ని రోజులు మరో రాష్ట్ర సరిహద్దులో ఉంటూ టవర్‌ లొకేషన్లను మారుస్తూ పోలీసులను తికమక పెడుతుంటారు. ఈ ముఠాలను ఎలా కట్టడి చేద్దామని ఆల్‌ ఇండియా సైబర్‌ పోలీస్‌ గ్రూప్‌ (దేశంలోని అన్నిరాష్ర్టాల సైబర్‌ పోలీసు టీంలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి)లో రోజూ చర్చ జరుగుతుందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. 

ఐదుగురు చిక్కితే 200 కేసులు పరిష్కారం

బెంగళూరు సైబర్‌ క్రైం పోలీసులు 20 రోజులపాటు భరత్‌పూర్‌లో మాటువేసి ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఐదుగురు సైబర్‌ మోసగాళ్లను అరెస్టుచేశారు. వీళ్ల అరెస్టుతో 200 కేసులు పరిష్కారమయ్యాయి. తెలంగాణ పోలీసులు భరత్‌పూర్‌ గ్యాంగ్‌లో ఒకడిని వాళ్ల తరహాలోనే ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన పెట్టి ట్రాప్‌చేసి హైదరాబాద్‌కు రప్పించి పట్టుకున్నారు.

నమ్మించి 5 లక్షలు కొట్టేశారు:నలుగురిని మోసంచేసిన సైబర్‌నేరగాళ్లు

 సైబర్‌ నేరగాళ్లు శనివారం హైదరాబాద్‌లో నలుగురి నుంచి రూ.4.99 లక్షలు కొట్టేశారు. బజాజ్‌ ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌నని తక్కువ వడ్డీకి రుణం ఇస్తామని ప్రాసెసింగ్‌ ఫీజుపేరిట ఓ వ్యక్తి నుంచి రూ.1.75 లక్షలు, కేవైసీ అప్‌డేట్‌ పేరుతో ఇద్దరినుంచి రూ.1.66 లక్షలు, కేబీసీ లాటరీ వచ్చిందంటూ ఓ మహిళ నుంచి రూ.1.58లక్షలను కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు చేశారు.


logo