ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 16:51:56

పోలీసులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి!

పోలీసులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి!

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కలవరం రేపుతోంది. ఎవరు తుమ్మినా, దగ్గినా, జ్వరం అని చెప్పినా ఉలిక్కిపడుతున్నారు. ఈ నేపధ్యంలో పోలీసు శాఖలో ఇప్పడు హెల్త్‌ డీఎస్‌ఆర్‌ను ప్రవేశపెట్టారు. ఉదయం, సాయంత్రం కచ్చితంగా పోలీసులు తమ ఆరోగ్య స్థితిగతులను నమోదు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఇందుకుగాను నగరంలోని పోలీసు స్టేషన్లలో థర్మల్‌ స్క్రీనింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 

ఉదయం విధులకు హాజరైన సమయంలో, విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు కచ్చితంగా శరీర ఉష్ణోగ్రతలు చెక్‌ చేసుకుని ఆ వివరాలను హెల్త్‌ డీఎస్‌ఆర్‌ యాప్‌లో పొందుపర్చాలి. జ్వరంగా అనిపించినా, గొంతునొప్పి, దగ్గు, జలబు ఉన్నా ఆయా వివరాలను యాప్‌లో తెలియజేయాలి. వీటిని కమిషనర్‌ కార్యాలయంలో స్పెషల్‌ బ్రాంచి విభాగం సిబ్బంది నిత్యం పరిశీలిస్తారు. థర్మల్‌ స్క్రీనింగ్‌లో శరీరం ఉష్ణోగ్రతలు 100 సెల్సియస్‌ దాటితే దవాఖానకు వెళ్ళాలని సూచిస్తున్నారు. హోంగార్డు నుంచి సీపీ వరకు.. అన్ని పోలీసు స్టేషన్లు, మినిస్ట్రీరియల్‌ స్టాఫ్‌కు థర్మల్ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. 

ఇదేమాదిరిగా రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కూడా చర్యలు తీసుకుంటున్నారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతిరోజు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. రెండు రోజులకు ఒక్కసారి స్టేషన్‌ను శానిటైజ్‌ చేస్తున్నారు. డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో బట్టలను డిస్‌ఇన్‌ఫెక్షన్‌ నీళ్లతో శుభ్రం చేసుకొంటున్నారు. చేతులు శుభ్రం చేసుకొనేందుకు వాష్‌ బేసిన్‌లను నెలకొల్పారు. స్టేషన్‌ వచ్చేవారు కూడా మొదట చేతులు శుభ్రపరుచుకొని, థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజ్‌ చేసుకోవడంతోపాటు కచ్చితంగా మాస్క్‌ ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు.


logo