శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 14:09:11

యూరియా కొరత లేదు.. రైతుల ఆందోళన చెందొద్దు..

యూరియా కొరత లేదు.. రైతుల ఆందోళన చెందొద్దు..

హైదరాబాద్‌ : రాష్ట్రంలో రైతులకు సరిపడ యూరియా అందుబాటులో ఉంది అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు కావాలనే యూరియా కొరత ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కరోనా విపత్తును గ్రహించి సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి పలు మినహాయింపులు ఇచ్చారు అని ఆయన తెలిపారు. వానాకాలం సాగుకు 22.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం పడుతాయన్నారు. 10.50 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. దశల వారీగా ఎరువులు రాష్ర్టానికి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. జులై కోటా కింద 2.05 లక్షల మెట్రిక్‌ టన్నులు రావాల్సి ఉందన్నారు. ఇందులో ఇప్పటికే 1.06 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా చేశారు. మిగతా యూరియా ఈ నెలాఖరు వరకు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్లు మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. 

కరోనా సమయంలో రైతుల పంటన్నీ 100 శాతం కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి స్పష్టం చేశారు. కరోనా ఇబ్బందులు గమనించి సీఎం కేసీఆర్‌ వ్యవసాయంపై పలుమార్లు సుదీర్ఘ సమావేశాలు ఏర్పాటు చేసి మార్గదర్శనం చేశారు. 36 గంటల్లో 56 లక్షల మంది రైతుల ఖాతాలకు రైతుబంధు నిధులు చేరవేసిన సమర్థత వ్యవసాయ శాఖది అని తెలిపారు. ఇది ప్రపంచ రికార్డు మాత్రమే కాదు.. శాఖ పనితీరుకు నిదర్శనమని మంత్రి చెప్పారు. అంతా సమర్థంగా జరుగుతున్న చోట ప్రజల్లో ఏదో రకమైన ఆందోళన, గుబులు పుట్టించడానికి, రైతాంగం ైస్థెర్యం దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా పని చేస్తున్నాయని నిరంజన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల ఆత్మైస్థెర్యం దెబ్బతీసే ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కొందరు చేసే దుష్ప్రచారానికి రైతులు ఆందోళనకు గురికావొద్దు అని కోరారు. 

రాష్ట్ర వ్యాప్తంగా డీలర్లు, సహకార సంఘాలు, మార్క్‌ఫెడ్‌, వ్యవసాయ శాఖ కమిషనర్‌ దగ్గర ఎక్కడా యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. పత్తి పంటకు అవసరమైన రెండో విడత యూరియా కూడా రైతులు వాడుకున్నారు. మిగిలిన యూరియా వరినాట్లకు మాత్రమే వినియోగించాలన్నారు. ప్రస్తుతం 1.56 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉందని మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. 


logo