ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 01:37:34

గ్రామాల్లోనే కరోనా నిర్ధారణ

గ్రామాల్లోనే కరోనా నిర్ధారణ

  • సబ్‌సెంటర్లలోనే వైరస్‌ గుర్తింపు పరీక్షలు
  • ప్రజలకోసం ఎంతఖర్చయినా వెనుకాడం
  • మందుల కొరత లేకుండాఅన్నిఏర్పాట్లు
  • కరోనాను పూర్తిగానియంత్రించేదాకా పర్యవేక్షణ
  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ను పూర్తిగా నియంత్రించే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటలరాజేందర్‌ తెలిపారు. ప్రాథమికదశలోనే కరోనాను గుర్తించి వైద్యమందించేందుకు గ్రామస్థాయిలోనే ఏర్పాట్లుచేస్తున్నామని చెప్పారు. జ్వరం వచ్చినవారిని సబ్‌సెంటర్లస్థాయిలోనే గుర్తించి కరోనా నిర్ధారణ చేస్తామని చెప్పారు. పాజిటివ్‌ వచ్చి కరోనా లక్షణాలు లేనివారిని హోంఐసొలేషన్‌ ఉంచి చికిత్స అందిస్తామని, అవసరమైన వారిని పెద్ద దవాఖాలనకు తరలిస్తామని వివరించారు. పూర్తిస్థాయిలో మందులను అందుబాటులో ఉంచుతామని, ప్రజలకు వైద్యమందించేందుకు ప్రపంచంలో ఎక్కడ మందులున్నా తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని చెప్పారు. కరోనా మందులు తయారుచేస్తున్న ఫార్మా కంపెనీలు, సరఫరాచేస్తున్న డీలర్లతో శనివారం బీఆర్కే భవన్‌లో మంత్రి ఈటల సమావేశమయ్యారు. కరోనాకు మందులు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చూడాలని ఆదేశించారు. మండలస్థాయిలోనే అన్నిషాపుల్లో మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రభుత్వ దవాఖానకు విధిగా మందులు సరఫరాచేయాలని సూచించారు. ఎక్కువ ఖరీదుఉన్న మందులు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. అత్యవసర మందులు, ఇంజెక్షన్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డ్రగ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ ప్రీతిమీనాను ఆదేశించారు. వైరస్‌లోడ్‌ను తగ్గించడానికి వినియోగిస్తున్న మ్‌డిసివిర్‌ మందును తయారుచేస్తున్న హెట్రో కంపెనీ యాజమాన్యంతో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా మాట్లాడారని.. రాష్ట్ర అవసరాలకు అవసరమైన మందులను సరఫరా చేయాలని కోరారని చెప్పారు. ఆ మందు త్వరలో ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని  తెలిపారు. 

రోగులను వెనుకకు పంపవద్దు

హైదరాబాద్‌లోని ప్రధాన దవాఖానల సూపరింటెండెంట్లతో కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోనూ మంత్రి ఈటల సమీక్ష నిర్వహించారు. దవాఖానలవారీగా సమస్యలను తెలుసుకొని పరిష్కారమార్గాలు సూచించారు. అవసరమైన సిబ్బందిని నియమించు కోవాలని చెప్పారు. సిబ్బందిని, అవసరమైన పరికరాలను 24 గంటల్లోనే అందజేస్తామని హామీఇచ్చారు. దవాఖానకు వచ్చిన ఏ ఒక్క రోగిని వెనక్కి పంపించకూడదని.. ప్రాథమిక చికిత్స అందించి కరోనా నిర్ధారణ పరీక్షలుచేసే ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఉస్మానియా దవాఖానపై కూడా మంత్రి ఈటల సమీక్షించారు.

ప్రజలకు అందుబాటులోఉంచాల్సిన మందులు

1. యాంటీబయాటిక్స్‌- అజిత్రోమైసిన్‌/డోక్సిసైలిన్‌/ అమోక్సిసిల్లిన్‌, క్లావులానిక్‌ యాసిడ్‌/ సెఫిగ్జ్జిమ్‌/ సియోఫోటగ్జిమ్‌ 

2. సిట్రిజిన్‌/ ఫ్లెక్సోఫాండైన్‌

3. పారాసిటమాల్‌

4. డెక్సామీథాసోన్‌/ మిథైల్‌ ప్రెడ్నోసోలోన్‌

5. మల్టివిటమిన్లు - జింక్‌/ విటమిన్‌ సీ/ విటమిన్‌ డీ

6. దగ్గు టానిక్‌లు -బెనాడ్రిల్‌/ ఆంబ్రోక్సిల్‌ 

7. హైడ్రాక్సీక్లోరోక్విన్‌logo