ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 27, 2020 , 07:24:54

వంట గ్యాస్‌కు కొరత లేదు... ఆందోళన వద్దు

వంట గ్యాస్‌కు కొరత లేదు... ఆందోళన వద్దు

హైదరాబాద్ : కరోనా కేసులు క్రమేపీ పెరుగుతుండటం, లాక్‌డౌన్‌ సమయాన్ని మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 14వరకు పొడిగించడంతో వంటగ్యాస్‌ వినియోగం భారీగా పెరుగుతున్నది. లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగితే.. కొరత ఏర్పడుతుందేమోనన్న భయంతో అవసరం లేకున్నా ముందస్తుగానే బుక్‌ చేసుకుంటున్నారు.. ఆ తర్వాత ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ముందస్తుగా ఒక సిలిండర్‌ను అందుబాటులో ఉంచుకుంటున్నారు ప్రజలు.  ప్రస్తుతం వంటగ్యాస్‌ వినియోగం రెండు లక్షలు దాటుతున్నట్లు తెలిసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే లక్షకు మించి బుకింగ్‌లు అవుతున్నట్లు స్వయంగా చమురు సంస్థలకు చెందిన తెలంగాణ రీజియన్‌ బాధ్యులు చెబుతున్నారు.  

ఆందోళన వద్దు..  గేటు వద్దే డెలివరీ..

కరోనా నియంత్రణ నేపథ్యంలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వంటి నేపథ్యంలోనూ  ఎమర్జెన్సీ సర్వీసుల కింద వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ వంటి నిత్యావసరాలు అందుతాయని, అవసరం ఉంటేనే సిలిండర్లు బుక్‌ చేసుకోవాలని చమురు సంస్థలకు చెందిన రాష్ట్ర బాధ్యుడిగా ఉన్న సీనియర్‌ అధికారి కోరారు. వంటగ్యాస్‌ సరఫరాకు ఢోకా ఏర్పడదని తెలిపారు.  సోషల్‌ డిస్టెన్స్‌లో భాగంగా కాలనీలు, అపార్ట్‌మెంట్‌ వాసులు, గేటెడ్‌ కమ్యూనిటీ వర్గాలు డెలివరీ బాయ్స్‌కు సహకరించాలని చెబుతున్నారు. మెయిన్‌గేట్‌ వద్ద సిలిండర్‌ ఇస్తే ఎవరికీ వారు తీసుకువెళ్లాలని, సీనియర్‌ సిటిజన్లకు సంబంధిత నివాసితులే అందజేయాలని ప్రతిపాదనలు చేశారు. సిలిండర్‌ బుకింగ్‌కు నిర్ణీత సమయాన్ని ఖరారు చేయబోతున్నట్లు వెల్లడించారు.

భయబ్రాంతులకు గురికావద్దు :  తెలంగాణ ఎల్పీజీ  డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌

ప్రజలు వంట గ్యాస్‌ కొరత వస్తుందని భయబ్రాంతులకు గురికావద్దని తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కల్లూరి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కరోనా భయంతో డెలివరీ బాయ్స్‌ను ఇండ్లలోకి రావద్దని చెబుతున్నారని, అవసరమైతే మేయిన్‌గేట్‌ వద్ద డెలివరీ ఇస్తామన్నారు. వంటగ్యాస్‌ అయిపోతుందనంగా.. రెండు రోజుల ముందు బుక్‌చేసుకుంటే సరిపోతుందన్నారు. డిస్ట్రిబ్యూటర్‌ దగ్గరికి వెళ్లినా అప్పటికప్పుడు డెలివరీ ఇస్తారన్నారు. గ్యాస్‌ బుకింగ్‌ సమయాన్ని 21 రోజుల వ్యవధితో అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి 7 లక్షల 65 వేల కుటుంబాలకు 712 గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్‌ సరఫరా చేస్తున్నారని అన్నారు. దీనికోసం సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మంది సిబ్బంది సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.


logo