శుక్రవారం 29 మే 2020
Telangana - Apr 10, 2020 , 01:45:20

బతుకమ్మ చీరెలకు ఢోకా లేదు

బతుకమ్మ చీరెలకు ఢోకా లేదు

  • లాక్‌డౌన్‌ సమస్యను అధిగమించేలా అధికారుల చర్యలు
  • రంజాన్‌ తోఫా పంపిణీకి వ్యూహం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ ప్రభావం బతుకమ్మ చీరెలు, రంజాన్‌ తోఫాల పంపిణీపై పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. అక్టోబర్‌ 25న బతుకమ్మ పండుగ రానున్న ది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.318కోట్లతో 93 లక్షల చీరెల తయారీకి ఆర్డర్‌ ఇస్తూ జనవరిలోనే ఉత్తర్వులు జారీచేసింది. గతం కంటే భిన్నమైన రంగుల్లో, 287 డిజైన్లు రూపొందించిన అధికారులు సిరిసిల్ల, వరంగల్‌, కరీంనగర్‌లోని 26,238 మరమగ్గాలపై చీరెల తయారీకి ఏర్పాట్లుచేశారు. మరమగ్గాల ఆసాములు చీరెల తయారీకి అవసరమైన యార్న్‌ తెప్పించి, పనులకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు చివరికల్లా చీరెలు సిద్ధమవుతాయని భావిస్తున్న సమయంలో కరోనా మహమ్మారి ముంచుకొచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా చీరెల తయారీ నిలిచిపోయింది. పరిస్థితిని గమనించిన అధికారులు.. సెప్టెంబర్‌నాటికైనా చీరెల తయారీ పూర్తయ్యేవిధంగా చర్యలు చేపడుతున్నారు. లాక్‌డౌన్‌ ముగియగానే ఎక్కువమంది కార్మికులతో రాత్రి, పగలు పనిచేయించి, లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తున్నారు. బతుకమ్మ చీరెలను సెప్టెంబర్‌ నెలలోనే జిల్లాలకు సరఫరాచేయాలన్నది అధికారుల లక్ష్యంగా కనిపిస్తున్నది. 

రంజాన్‌ తోఫా సిద్ధం

వచ్చే నెలలో రానున్న రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లింలకు కానుకగా ఇచ్చే తోఫా పంపిణీకి  ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల కుటుంబాలకు తోఫాను అందజేయాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన బట్టలను సిరిసిల్ల మరమగ్గాల మీద తయారుచేశారు. ఇవి ప్రాసెసింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత వారం, పదిరోజుల్లోనే వాటిని అన్ని జిల్లాలకు చేరవేసేవిధంగా టెస్కో అధికారులు ప్రణాళిక సిద్ధంచేశారు. 


logo