సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 03:14:36

ఆన్‌లైన్‌ తరగతుల్లో వ్యాపార కోణం లేదు

ఆన్‌లైన్‌ తరగతుల్లో వ్యాపార కోణం లేదు

  • తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే నిర్వహణ
  • మానసికంగా 80 శాతం మంది సంసిద్ధం
  • ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్ల ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణలో ఎలాంటి వ్యాపార కోణం లేదని తెలంగాణ గుర్తింపు స్కూల్‌ యాజమాన్యాల సంఘం (ట్రస్మా) అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు స్పష్టంచేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే క్లాసులు కొనసాగుతున్నాయని తెలిపారు. విషయ పరిజ్ఞానం కోసం పాఠ్యాంశాల బోధన అవసరాన్ని గుర్తించిన 80 శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులపై మక్కువతో మానసికంగా సంసిద్ధులయ్యారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వ జీవోకు అనుగుణంగా ప్రైవేటు విద్యాసంస్థలు ఎలాంటి ఫీజులు కూడా పెంచలేదని తెలిపారు. అలాంటి తమపై కొందరు నిందారోపణలు చేయడం తగదని హితవుపలికారు. 

ఢిల్లీ, పంజాబ్‌, కేరళ తదితర రాష్ర్టాల్లో ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా యోచిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించామని వివరించారు. ఆన్‌లైన్‌ విద్యాబోధన విద్యార్థుల అవగాహన కోసమే తప్ప ఇందులో ఎలాంటి వ్యాపార ఉద్దేశం లేదని పేర్కొన్నారు. 


logo