మంగళవారం 26 మే 2020
Telangana - May 17, 2020 , 02:01:44

డిస్కంలు ప్రైవేటుకు

డిస్కంలు ప్రైవేటుకు

  • ప్యాకేజీ షాక్‌ 
  • కేంద్రపాలిత ప్రాంతాల్లో అప్పగింత
  • అభ్యంతరాలపై గడువు ముగియకముందే మోదీ సర్కారు కీలక నిర్ణయం

కరోనా సంక్షోభ సమయంలో సాయం పేరుతో కేంద్ర ప్రభుత్వం సంస్కరణ బాట పట్టింది. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అమలుచేస్తామని చెప్పి.. ఆ సాకుతో అనేక విధాన నిర్ణయాల అమలుకు పూనుకున్నది. సమగ్ర చర్చ చేయకుండానే, రాష్ర్టాల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండానే తన వైఖరిని ప్రకటిస్తున్నది. నాలుగోరోజు ప్యాకేజీలో ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్‌ శనివారం విద్యుత్‌ సంస్కరణలకు తలుపులు తెరిచారు. అంతే కాదు రక్షణ, బొగ్గు తవ్వకం తదితర రంగాల్లో ప్రైవేటీకరణకు పచ్చజెండా ఊపారు. 

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్రం తీసుకురావాలని భావిస్తున్న విద్యుత్‌ సవరణ బిల్లు-2020పై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.. అభిప్రాయాలు తెలుపాలంటూ ఇచ్చిన గడువు ముగియనేలేదు. ఈలోపే కేంద్రం తాను అనుకున్న పని చేసేసింది. కేంద్రపాలిత ప్రాంతాల్లోని విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కమ్‌)లను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ప్రకటించారు. దీనివల్ల వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందని, అలాగే విద్యుత్‌ పంపిణీ నిర్వహణ, ఆర్థిక సామర్థ్యం మెరుగవుతుందని చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ విధానాన్ని అనుసరించేందుకు ఇది మోడల్‌గా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. డిస్కమ్‌లను ప్రైవేటీకరించాలని విద్యుత్‌ శాఖ గత కొంతకాలంగా యోచిస్తున్నది. 

ఇంతకుముందు ఢిల్లీ, ముంబై, ఇతర నగరాల్లో డిస్కమ్‌లను ప్రైవేటీకరించారు. డిస్కమ్‌ల బిడ్డింగ్‌లో పాల్గొనాలని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ శుక్రవారం పరిశ్రమ వర్గాలను కోరారు. త్వరలోనే సవరించిన పవర్‌ టారిఫ్‌ పాలసీని ఆవిష్కరిస్తామని, ఇందులో ప్రధానంగా  వినియోగదారుల హక్కులు, విద్యుత్‌ రంగం సుస్థిరతపై దృష్టిసారిస్తామన్నారు. కొత్త విధానం ప్రకారం.. డిస్కంలు తమ నష్టాలను వినియోగదారులపై మోపేందుకు వీలుండదని స్పష్టంచేశారు. డిస్కంలు నిర్ణీత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని, ప్రకృతి విపత్తులు, సాంకేతిక సమస్యలు సంభవించినప్పుడు మినహా లోడ్‌ షెడ్డింగ్‌ తలెత్తితే జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. కొత్త పాలసీని మంత్రుల బృందం ఆమోదించిందని, త్వరలోనే క్యాబినెట్‌ ముందుకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. నెలలోపు కొత్త పాలసీ అమల్లోకి రావొచ్చని పేర్కొన్నారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటనపై దేశవ్యాప్తంగా విద్యుత్‌సంఘాల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతున్నది.


విద్యుత్‌ సంస్థలు వ్యతిరేకిస్తున్నా.. 

విద్యుత్‌ సవరణ బిల్లు-2020 బిల్లుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలియజేయడానికి కేంద్రం రాష్ర్టాలు, విద్యుత్‌ సంస్థలు, ఎన్జీవోలు, ఇతరవర్గాలకు జూన్‌ 5 వరకు గడువు ఇచ్చింది. ఈ బిల్లుపై దాదాపు అన్నిరాష్ర్టాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా డిస్కంలు మండిపడుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని, పార్లమెంట్‌లో అడ్డుకుంటామని బహిరంగంగానే ప్రకటించారు. తమిళనాడు సీఎం పళనిస్వామి విద్యుత్‌సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామంటూ ఏకంగా ప్రధాని కార్యాలయానికి లేఖరాశారు. మరికొన్ని రాష్ర్టాలు కూడా కేంద్రానికి నేరుగా తమ వ్యతిరేకతను వ్యక్తంచేశాయి. కానీ, కేంద్రం మాత్రం డిస్కంల వ్యతిరేకతను, రాష్ర్టాల అభ్యంతరాలను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నది. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విద్యుత్‌ పంపిణీ సంస్థలను (డిస్కంలను) ప్రైవేటీకరిస్తున్నామని, దీనివల్ల విద్యుత్‌ వినియోగదారులపై పడే భారాన్ని తగ్గిస్తామంటూ కొత్త పలుకులు పలుకుతున్నది. గతంలో ఒడిశాలాంటి రాష్ర్టాల్లో విద్యుత్‌ను ప్రైవేటీకరించి చేతులు కాల్చుకున్నప్పటికీ కేంద్రం తన వైఖరిని మాత్రం బహిరంగంగానే స్పష్టంచేసింది. 

పట్టణప్రాంతం కనుకనే.. 

కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కంలను ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ప్రకటించడం వెనుక అక్కడ పట్టణ, నగర ప్రాంతం మాత్రమే ఉండటం కారణంగా కనిపిస్తున్నది. పాండిచ్చేరి, డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేళీ, చండీగఢ్‌, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌లలో ఎక్కువగా పట్టణ, నగర వాతావరణమే ఉంటుంది. లఢక్‌, జమ్మూకశ్మీర్‌లో కొంత గ్రామీణప్రాంతం ఉన్నప్పటికీ.. ఆ రెండు కేంద్రం అజమాయిషీలోనే ఉంటాయి. దీంతో ఈ ప్రాంతాల్లో డిస్కంల ప్రైవేటీకరణ సులువుగా, వేగంగా పూర్తి చేయవచ్చనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించిందని చెప్తున్నారు. ప్రభుత్వం, పరిపాలన వ్యవస్థ మొత్తం తమ చెప్పుచేతుల్లో ఉండటంతో తన నిర్ణయంపై వ్యతిరేకత రాదని, ప్రైవేటీకరణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయవచ్చనేది ఆలోచనతోనే ముందుడుగు వేసిందని విద్యుత్‌సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. 


రాష్ర్టాల నుంచి వ్యతిరేక వైఖరి

రాష్ర్టాల పరిస్థితి కేంద్రపాలిత ప్రాంతాలకు భిన్నంగా ఉన్నది. రాష్ర్టాల్లో 60 నుంచి 70 శాతం వరకు గ్రామీణ ప్రాంతాలే ఉంటాయి. పైగా ఒక్కోరాష్ట్రంలో ఒక్కో రాజకీయపార్టీ అధికారంలో ఉండటంతో డిస్కంల ప్రైవేటీకరణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. దీంతో ప్రజలు, విద్యుత్‌ సంస్థల నుంచికూడా వ్యతిరేకత వస్తుంది. దీంతో బిల్లు తీసుకురావడం ఆలస్యం కావచ్చనే ఉద్దేశంతోనే కేంద్రం తాజా నిర్ణయాన్ని ప్రకటించిందని చెప్తున్నారు. బిల్లుపై పార్లమెంట్‌ ఉభయసభల్లో చర్చ జరిగి.. చట్టంగా ఆమోదం పొందాలంటే ఇబ్బందికర పరిస్థితి ఉండవచ్చని ముందుగానే ఊహించిన కేంద్రం.. తమ ఆధీనంలో ఉండే కేంద్రపాలిత ప్రాంతాల్లోని డిస్కంలను ప్రైవేటీకరించే వ్యూహం అమలుచేస్తున్నట్టు పేర్కొంటున్నారు.

 వేగంగా పూర్తిచేయాలనే ఆతృతలో కేంద్రం

విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణను ముందుగా తమ ఆధీనంలో ఉండే యూటీల నుంచి మొదలుపెడితే.. రాష్ర్టాల్లోకి సులభంగా వెళ్లవచ్చని కేంద్రం అభిప్రాయంగా తెలుస్తున్నది. నిజానికి కేంద్ర పాలితప్రాంతాల్లో ఎక్కువగా పట్టణ వ్యవస్థే ఉండటంతో ప్రైవేటుకు లాభాలు అధికంగా వస్తాయి. డిస్కంలను ఢిల్లీలో ఇప్పటికే ప్రైవేటుపరం చేశారు. ఇప్పుడు మిగలిన యూటీల్లో చేస్తున్నారు. డిస్కంలతో కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ జరిపిన తాజా వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రైవేటీకరిస్తున్నామని చెప్పినట్టుగా సమాచారం. ఆపై బీజేపీపాలిత రాష్ర్టాల్లో దీనిని అమలు చేసేందుకు అవకాశం ఉన్నది. వీటన్నింటినీ చూపి.. మిగతా రాష్ర్టాల్లో మొదలుపెడతారు. వినియోగదారులపై భారం మోపి.. ప్రవేటు సంస్థలకు అప్పగించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటున్నది.

-రత్నాకర్‌రావు, పవర్‌ ఇంజినీర్స్‌ ,అసోసియేషన్‌ అధ్యక్షుడు

 కార్పొరేట్‌ చేతుల్లోకి విద్యుత్‌రంగం

పేద, ధనికవర్గాల మధ్య విద్యుత్‌ ధరల సర్దుబాటుకు అవకా శం కల్పించేలా క్రాస్‌ సబ్సిడీని రద్దుచేయ డం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నదో అర్థమవుతున్నది. విద్యుత్‌రంగాన్ని కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పెట్టడమే ఈ విద్యుత్‌ చట్టం సవరణ బిల్లు లక్ష్యం. ఒడిశా రాష్ట్రంలో కార్పొరేట్‌ శక్తులు విద్యుత్‌రంగాన్ని నాశనంచేస్తే.. తిరిగి ప్రభుత్వ రంగమే గాడిలో పెట్టిందనే విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కొని పోరాడుతున్నది ప్రభుత్వరంగ సంస్థలు, వ్యవస్థలే కానీ.. కార్పొరేట్లు కాదనే విషయాన్ని గమనించాలి. ప్రభుత్వరంగంలో ఉంది కాబట్టే తెలంగాణలో 24 గంటల విద్యుత్‌అందించగలుగుతున్నాం. ప్రైవేటు పరంచేస్తే.. ధరలు పెరుగడమేకాకుండా.. ఇప్పుడు అందుతున్న సర్వీసులన్నీ మాయమైపోతాయి. ఇది దేశ ప్రజలందరి సమస్యగా గుర్తించి ఉద్యమించాలి.

- ఎన్‌ శివాజీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు


logo