గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 02:40:44

కరెంట్‌ బిల్లుల్లో అవకతవకలు లేవు

కరెంట్‌ బిల్లుల్లో అవకతవకలు లేవు

  • స్లాబ్‌ మారకుండా బిల్లుల జారీ
  • అసత్య ప్రచారాలను నమ్మొద్దు 
  • ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: విద్యుత్‌శాఖ ఉద్యోగులు 30 రోజులకు బిల్లు తీయకుండా 31నుంచి 40 రోజుల మధ్యలో బిల్లులు తీస్తున్నారన్న ప్రచారం సరైంది కాదని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ జీ రఘుమారెడ్డి అన్నారు. తాము శాస్త్రీయంగానే బిల్లులను జారీచేస్తున్నామని సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదలచేశారు. విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నామని పునరుద్ఘాటించారు. నెలవారీ బిల్లులను ఆలస్యంగా జారీచేసినా.. కచ్చితత్వంతో జారీచేస్తున్నామని, ఇందుకు శాస్త్రీయ/ ప్రామాణిక పద్ధతిని అవలంబిస్తున్నామని ఆయన వెల్లడించారు.

అవగాహన లోపంతోనే..

తెలంగాణలో 1.56 కోట్ల మంది విద్యుత్‌ వినియోగదారులుండగా, వీరందరికీ ఇదే తరహాలో బిల్లులు జారీచేస్తున్నామని రఘుమారెడ్డి తెలిపారు. అందరికీ సకాలంలో సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా బిల్లుల జారీ జరుగుతుందని, ఇలాంటి పొరపాట్లకు అస్కారముండదని స్పష్టంచేశారు. కొందరు అసత్యప్రచారం చేస్తున్నారని, బిల్లుల్లో ఏవైనా సందేహాలుంటే సమీప విద్యుత్‌ కార్యాలయ అధికారులను సంప్రదించాలని కోరారు.

ఉదాహరణకు..

  • ఒక సర్వీసుకు 32 రోజులకు రీడింగ్‌ నమోదుచేయడం వల్ల 106 యూనిట్లు వాడారు అని అనుకుంటే. దానిని 30 రోజులకు ఇలా లెక్కిస్తున్నారు.
  • ఆయా బిల్లులు 30 రోజులకు విద్యుత్‌ వాడకం = వాడిన మొత్తం యూనిట్లు/ రీడింగ్‌ నమోదుచేసిన రోజులు X 30 రోజులు.. ఈ ఫార్మాలా ప్రకారం
  • 106/32X90 = 99 యూనిట్లు అవుతుంది. 1A క్యాటగిరీ (100 యూనిట్లలోపు ప్రకారం మొదటి స్లాబ్‌లో 53 యూనిట్లకు (50/30X32) రూ.1.45 చొప్పున యూనిట్‌కు చార్జీచేస్తారు. రెండోస్లాబ్‌లో 53 (50/30X32) రూ.2.60 యూనిట్‌కు చార్జీచేస్తారు. 
  • ఇలా లెక్కించడం వలన స్లాబు మారదని, వినియోగదారుడికి ఎలాంటి నష్టం వాటిల్లదని రఘుమారెడ్డి తెలిపారు.


logo