శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 01:58:38

గజగజ వణుకుడే!

గజగజ వణుకుడే!

  • శీతాకాలంలో తీవ్రంగా చలి పంజా 
  • పసిఫిక్‌లో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
  • ‘లానినా’ ప్రభావమే కారణం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వానలు కసితీరా పగ తీర్చుకున్నాయి. ఇప్పుడిక చలి వంతు వచ్చేస్తున్నది. జనాలను గజగజ వణికించేందుకు సిద్ధమవుతున్నది. ఈ సంవత్సరం శీతాకాలంలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే వానలు, వరదలతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వార్త బుగులు పుట్టించనున్నది. సాధారణంగా ప్రతి ఏటా చలికాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల నుంచి 14 డిగ్రీలలోపు నమోదవుతుంటాయి. గత ఏడాది రాత్రి ఉష్ణోగ్రత అత్యల్పంగా 13 డిగ్రీల నుంచి 14డిగ్రీల మధ్య నమోదైంది. 2017లో 11 డిగ్రీల నుంచి 12డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదయ్యాయి. ఈ సంవత్సరం మాత్రం ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయే అవకాశాలున్నట్టు వాతావరణ నిపుణుడు శ్రీధర్‌ చెప్పారు. సాధారణంగా వర్షం, ఎండ, చలి తీవ్రతలను పసిఫిక్‌ మహాసముద్రం మధ్యభాగంలోని ఉష్ణోగ్రతల ఆధారంగా అంచనా వేస్తారని ఆయన తెలిపారు. సముద్ర మధ్యభాగంలోని ఉపరితలంపై ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 5డిగ్రీల వరకు తక్కువగా ఉంటే దాన్ని ‘లానినా’ అంటారని, ఇప్పుడు ఆ ప్రదేశంలో లానినా ఉన్నట్టు వివరించారు. దాని ప్రభావం వల్లే ఈ శీతాకాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదై చలి తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించారు. 

‘ఎలినా’తో వానలు 

సముద్రం మధ్యలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉంటే దాన్ని ‘ఎలినా’ అంటారని శ్రీధర్‌ తెలిపారు. దాని ప్రభావంతో వర్షాలు అధికంగా కురుస్తాయని, అది ఏర్పడటం వల్లే ఈసారి అసాధారణ వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నారు.