శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 00:30:05

సామాన్యుడి మాట

సామాన్యుడి మాట

నేను 23 ఏండ్ల క్రితం ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వచ్చాను. తొలుత రాంనగర్‌లో ఉండగా.. ప్రస్తుతం హైటెక్‌ సిటీలో ఉంటున్నాను. గత పాలకులు హైదరాబాద్‌ నగరం అభివృద్ధిపై దృష్టిపెట్టకపోవడం దురదృష్టకరం. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలు నిజంగా అభినందనీయం.

మొదటిసారిగా హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లను అందంగా తీర్చిదిద్దడం చూశాను. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి అండర్‌ పాస్‌లు, ఫ్లై ఓవర్లు.. ఇలా ఒకటేమిటి చాలా పనులు చేపట్టారు. పాడుబడిన దుర్గం చెరువు అనేది గతం.. ఇప్పుడు దాని స్థానంలో తలమానికమైన కేబుల్‌ బ్రిడ్జిని నిర్మించారు. చాలా కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకురావడంలో మంత్రి కేటీఆర్‌ పాత్ర అందరికీ తెలిసిందే. ఒక్క కంపెనీ తెస్తేనో.. ఒక్క బిల్డింగ్‌ కడితేనో అభివృద్ధి కాదు. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగాలి. అందుకే విజ్ఞులైన నగర ప్రజలు ఈసారి టీఆర్‌ఎస్‌కే ఓటేసి 100 స్థానాలు గెలిపించుకుని గ్రేటర్‌ హైదరబాద్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది.  జగన్‌, హైటెక్‌ సిటీ

ఝూటా బాత్‌ 

హైదరాబాద్‌ సిటీలో గతుకులతో ఉన్న రోడ్లకు మెరుగులు దిద్దుతం. ఖర్చుకు రాజీ పడకుండా రోడ్లను అద్దాల్లా మార్చుతం. ఇక గ్లోబల్‌ సిటీలో రోడ్ల రూపురేఖలు మార్చడమే లక్ష్యం అంటూ పెద్ద పెద్ద హామీలిచ్చిన నేతలను.. ఇప్పుడు సిటీలో గుంతల రోడ్లు వెక్కిరిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ నేతల మాటలు నీటిపై రాతలుగానే మిగిలిపోయాయి.

సచ్‌ జవాబ్‌ 

హైదరాబాద్‌ను సాంకేతిక హబ్‌గా తయారుచేయాలన్న లక్ష్యంతో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు హైదరాబాద్‌లో అత్యున్నతంగా రహదారులు, వంతెనలు, పార్కులు నిర్మించడంతోపాటు బైపాస్‌లు, అండర్‌ పాస్‌లు ఏర్పాటుచేయడంతో ఇప్పుడు నగర వాసులు హాయిగా ప్రయాణించగలుగుతున్నారు. భారీ వర్షాలకు గుంతలు తేలిన రోడ్లను రాత్రికి రాత్రే బాగుచేయడం ద్వారా నగరంలోని అన్ని ప్రధాన రోడ్లు హాయిగా, హ్యాపీగా ప్రయాణం చేసేందుకు అనువుగా తయారయ్యాయి. నగరంలోని 700 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్ల నిర్వహణకు ప్రభుత్వం ఐదేండ్లకు రూ.1,800 కోట్లతో నిర్వహణ బాధ్యతలు అప్పగించిందంటే.. నగర రోడ్ల గురించి ప్రభుత్వం ఎంత పట్టించుకుంటున్నదో అర్థం చేసుకోవచ్చు.