గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 13:29:13

రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

మహబూబాబాద్‌ : రైతులంతా సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ ధాన్యం కల్లాల దగ్గరే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం సేకరిస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. జిల్లాలోని కొత్తగూడ మండలం, పోగుళ్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, కల్లాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొత్తగూడెంలోని, పోగుళ్ల పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టాలని ముందే నిర్ణయించామని తెలిపారు. మక్కలు వద్దన్నా వేశారు. అయినా రైతు నష్టపోవద్దని మక్కలు కూడా కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. 

ధరణి పోర్టల్ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భూములకు కూడా రక్షణ కల్పిస్తూ స్థానిక గిరిజనులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నామని వెల్లడించారు. పోడు భూములను కూడా సమగ్రంగా సర్వే చేయించి స్వయంగా తానే వచ్చి పొడుభుముల పట్టా ఇస్తానని సీఎం కేసిఆర్ గారు హామీ ఇచ్చారు. కానీ కొంతమంది గిరిజనుల భూములు లాక్కుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి అలాంటి వారి మాటలు నమ్మొద్దన్నారు. అటవీ ఇబ్బందులను తొలగించి రోడ్లకు అనుమతులు వచ్చే విధంగా పని చేసే లైజన్ ఆఫీసర్ పెట్టి రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు.


గిరి వికాసం కింద గిరిజనుల భూములు అభివృద్ధి చేసి పంట పండించుకునే వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. గిరిజన బిడ్డగా ఈ ప్రాంత సమస్యలు నాకు తెలుసు. ఇక్కడి అన్ని సమస్యలు స్థానిక ఎమ్మేల్యే, ఎంపీతో కలిసి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. కేంద్రం పట్టించుకోకపోయినా మన ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇస్తుందన్నారు.కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, స్థానిక సీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.