బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 09, 2020 , 00:47:21

పొడిగింపే మార్గం

పొడిగింపే మార్గం

  • కరోనా కట్టడికి సీఎం కేసీఆర్‌ నిరంతర కృషి
  • ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో  టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేకే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో కరోనా వ్యాప్తిని సమర్థంగా నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ పొడిగింపు ఒక్కటే మార్గమమని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ స్పష్టంచేసింది. కష్టనష్టాలున్నా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేసింది. పార్లమెంటులోని అన్ని రాజకీయపక్షాల నాయకులతో ప్రధాని మోదీ బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించగా.. హైదరాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్‌ కే కేశవరావు, టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా చేస్తున్న ప్రయత్నాలు ఎంతో బాగున్నాయని, తెలంగాణ సీఎం కేసీఆర్‌ 24 గంటలపాటు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను కొనసాగించడమే ఉత్తమమార్గమమని సూచించారు.

400 కోట్లకుగాను కోటి ఆదాయం

లాక్‌డౌన్‌ వల్ల తెలంగాణలో రాబడులు పడిపోయాయని కేకే అన్నారు. ‘రోజుకు రూ.400కోట్లకుపైగా రాబడి రావాల్సి ఉండగా, అత్యంత కష్టంగా రూ.కోటి ఆదాయమే సమకూరుతున్నది’ అని తెలిపారు. ఇబ్బందులున్నా పేద కుటుంబాల్లోని ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, ప్రతి కుటుంబానికి రూ.1500 నగదు అందిస్తున్నామని చెప్పారు. రాష్ర్టాలకు రావాల్సిన నిధులను అందించాలని, పాత బకాయిలు చెల్లించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 


logo