గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 12:24:44

సీఎం కేసీఆర్ దార్శనికత దేశానికే స్ఫూర్తిదాయకం : మంత్రి పువ్వాడ

సీఎం కేసీఆర్ దార్శనికత దేశానికే స్ఫూర్తిదాయకం : మంత్రి పువ్వాడ

ఖమ్మం : రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకే ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసి మరింత చేయూతనిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం అడవిమల్లెల గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు పుష్కలంగా నీళ్లు, రైతుబంధు సాయం, గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతుందన్నారు.

రైతును రాజును చేస్తానని తొలి నాళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయం గుర్తు చేశారు. నాడు చెప్పారు.. నేడు చేసి చూపిస్తున్నారు. అది నిబద్ధత అంటే అని కొనియాడారు. మాటలతో కాలయాపన చేయకుండా వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఒకే సంకల్పంతో నేటి వరకు అలుపెరుగక శ్రమిస్తున్న ముఖ్యమంత్రి  దార్శనికత నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఖమ్మం జిల్లాలోని 129 క్లస్టర్ ల పరిధిలోని 129 రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీనితో పాటు రైతులకు కేటాయించిన కల్లాలను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నియోజకవర్గానికి వెయ్యి కేటాయించామన్నారు. 


రాష్ట్రంలో  సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర సంస్కరణలు వ్యవసాయానికి ఊతమిచ్చాయని, రైతులందరినీ ఒకే చోటకు చేర్చి సాగుపై చర్చించుకొనే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించడం వ్యవసాయ రంగంలోనే ముందడుగు అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ , అదనపు కలెక్టర్ స్నేహలత, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, డీసీఎమ్మెస్ చైర్మన్ శేషగిరిరావు, అధికారులు, నాయకులు ఉన్నారు.logo