ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 20:05:51

అత్యాచారాల కేసుల విచారణను వేగవంతం చేయాలి : మ‌ంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌

అత్యాచారాల కేసుల విచారణను వేగవంతం చేయాలి : మ‌ంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌

హైద‌రాబాద్ : ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు, ఆత్మ గౌరవాన్ని మరింత పెంపొందించేందుకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు, అత్యాచారాలను అరికట్టేందుకు తీసుకువచ్చిన పీసీఆర్, పీఓఏ చట్టాలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు త‌మ‌ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేప‌ట్టింద‌న్నారు. కావునా అత్యాచారాల కేసుల విచార‌ణ‌ను వేగ‌వంతం చేయాల‌ని మంత్రి పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో గురువారం న‌గ‌రంలోని మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో పీసీఆర్‌, పీఓఏ చట్టాల అమలుకు సంబంధించిన స్టేట్ లెవల్ హైపర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ స‌మావేశానికి మంత్రి హాజ‌రై మాట్లాడారు.

ఎస్సీ, ఎస్టీలలో మరింత ధైర్యమిచ్చే విధంగా ఈ చట్టాల అమలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఛార్జీషీట్ వేసేందుకు కొంత ఆలస్యం జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న చర్యల గురించి చక్కని సందేశం ఇచ్చేందుకుగాను హైదరాబాద్‌లో "సివిల్ రైట్స్ డే"ను విస్త్రత స్థాయిలో నిర్వహించే ఆలోచన ఉందని తెలిపారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మరింత చురుగ్గా, బాధ్యతాయుతంగా పనిచేసేలా పర్యవేక్షించాల్సిందిగా కోరుతూ కలెక్టర్లకు లేఖలు రాయాలని అధికారులను ఆదేశించారు.

స‌మావేశానికి హాజ‌రైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలలో ఈ చట్టాల అమలు తీరుపై ప్రతి నెల సమీక్షా సమావేశాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ భేటీలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్, కమిషనర్ యోగితారాణా, పోలీసు అడిషనల్ డీజీ గోవింద్ సింగ్, డీఐజీ శ్రీనివాసరావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శి పాండా, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ వైజయంతి తదితరులు పాల్గొన్నారు.