శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 07, 2020 , 01:08:38

కాటేసిన కనురెప్ప

కాటేసిన కనురెప్ప
  • భార్యపై కోపంతో భర్త ఘాతుకం
  • తప్పించుకున్న నాలుగేండ్ల కొడుకు
  • కామారెడ్డి జిల్లా తాడ్కోల్‌లో విషాదం

కామారెడ్డి ్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారుల పాలిట కన్నతండ్రే కాలయముడిలా మారాడు. కందూర్‌ వేడుకకు వెళ్దామని చెప్పిన తండ్రి మాటలు నమ్మి సంతోషంగా ఇంట్లోంచి వచ్చిన ఆ బిడ్డలకు అవే చివరి గడియలయ్యాయి. పేకాటకు భార్య డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఆ తండ్రి తన ముగ్గురు కూతుర్ల ఉసురు తీశాడు. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్‌ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. తాడ్కోల్‌కు చెందిన ఫయాజ్‌, నిలోఫర్‌బేగం దంపతులు. వీరికి ముగ్గురు కూతుళ్లు ఆఫియా(10), మాహిన్‌(9), జోయా(7), కొడుకు రైస్‌(4) ఉన్నారు. కూలి పనిచేసే ఫయాజ్‌ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. పేకాట, మద్యానికి బానిసైన ఇతడు డబ్బుల కోసం నిత్యం భార్యను వేధించేవాడు. పిల్లలను సైతం తీవ్రంగా హింసించేవాడు. గురువారం రాత్రి పేకాటకు డబ్బులు ఇవ్వాలని భార్యను అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తెలిసిన వాళ్ల కందూ ర్‌(ముస్లిం వేడుక)కు వెళ్దామని ఫయాజ్‌ తన పిల్లలకు చెప్పాడు. తండ్రి మాటలు నమ్మిన ముగ్గురు బిడ్డలతోపాటు కొడుకు అతనితో వెళ్లారు. చెరువుగట్టు వద్దకు వెళ్లాక ఫయాజ్‌ ముగ్గురు అమ్మాయిలను చెరువులోకి తోశాడు. 


లోతు తక్కువగా ఉండటంతో నీటిలో ముంచి కాళ్లతో తొక్కి అదిమిపట్టాడు. వారు ప్రతిఘటించినప్పటికీ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. కాగా, అక్కల్ని తండ్రి కొడుతుండటం చూసిన తమ్ముడు రైస్‌ భయం తో ఇంటికి పరిగెత్తాడు. గాబరాగా ఇంటికొచ్చిన కొడుకును చూసిన తల్లి ఆందోళనకు గురైంది. కొడుకును వెంటేసుకుని చెరువుగట్టుకు వెళ్తుండగా భర్త ఫయాజ్‌ ఎదురయ్యాడు. పిల్లలేరని నిలదీయగా.. భోజనం చేస్తున్నారని జవాబిచ్చాడు. బురద బట్టలతో ఉన్న భర్తను చూసిన నిలోఫర్‌.. ఏదో జరిగిందని అనుమానంతో ముందుకుసాగింది. కొద్దిదూరంలో పిల్లల చెప్పు లు, ఆ పక్కనే చెరువు నీటిలో పైకి తేలుతున్న బిడ్డల శవాలను చూసి కుప్పకూలింది. విషయం తెలుసుకున్న స్థానికులు చెరువులోని పిల్లలను బయటికి తీయగా అప్పటికే ఆఫియా, మాహిన్‌ కన్నుమూశారు. కొనఊపిరితో ఉన్న చిన్నకూ తురు జోయా సైతం తల్లిని చూసిన మరుక్షణమే కన్నుమూసింది.  పోలీసులు ఫయాజ్‌ను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.

logo