సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 02:15:11

ఆలయం, మసీదు మరింతవిశాలంగా

ఆలయం, మసీదు మరింతవిశాలంగా

  • ప్రభుత్వ ఖర్చుతో సచివాలయంతోపాటే నిర్మిస్తాం 
  • ప్రార్థనాస్థలాలకు నష్టంపై చాలా బాధపడ్డా: సీఎం కేసీఆర్‌
  • ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతించిన హోంమంత్రి 
  • ఉద్యోగ నేతల హర్షం.. సీఎంపై నమ్మకమున్నదన్న అసద్‌

ఇప్పుడున్న దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో.. ఎంతఖర్చయినా వెనుకాడకుండా ఆలయం, మసీదును విశాలంగా నిర్మిస్తాం. ప్రార్థనామందిరాల నిర్వాహకులతో త్వరలో సమావేశమవుతాను. వారి అభిప్రాయాలు తీసుకొని, కొత్త భవన సముదాయంతోపాటు ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తాం. తెలంగాణ రాష్ట్ర లౌకికస్ఫూర్తిని కొనసాగిస్తాం.  - ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొత్త సచివాలయ భవన సముదాయంతోపాటు, ఆ ప్రాంగణంలోనే ప్రభుత్వ ఖర్చుతో ఆలయం, మసీదును నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇప్పుడున్నదానికంటే ఎక్కువ విస్తీర్ణంలో వాటి నిర్మాణాన్ని చేపడుతామని పేర్కొన్నారు. పాత భవనాల కూల్చివేత సందర్భంగా ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలగడంపై సీఎం కేసీఆర్‌ విచారం వ్యక్తంచేశారు. ‘నూతన సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం పూనుకొన్నది. ఇందుకోసం పాతభవనాల కూల్చివేత కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ప్రాంగణంలోఉన్న ప్రార్థనామందిరాలపై శిథిలాలు పడి కొంత నష్టం వాటిల్లిందనే విషయం తెలిసింది. ఇలా జరగడంపై ఎంతో బాధపడ్డాను. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ఇందుకు ఎంతో చింతిస్తున్నాను. పాత భవనాలను కూల్చడమే ప్రభుత్వ ఉద్దేశం తప్ప.. ప్రార్థనామందిరాలకు నష్టం కలిగించాలనికాదు’ అని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ‘ఇప్పుడున్న దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో.. ఎంతఖర్చయినా వెనుకాడకుండా ఆలయం, మసీదును విశాలంగా నిర్మించి.. సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తాం. ప్రార్థనామందిరాల నిర్వాహకులతో త్వరలో సమావేశమవుతాను. వారి అభిప్రాయాలు తీసుకొని, కొత్త భవన సముదాయంతోపాటు ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నా’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ‘తెలంగాణ సెక్యులర్‌ రాష్ట్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకికస్ఫూర్తిని కొనసాగిస్తాం. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి’ అని కోరారు. 

సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మహమూద్‌అలీ, హోంమంత్రి

సచివాలయ ప్రాంగణంలో విశాలమైన ప్రాంతంలో ప్రార్థనామందిరాలను నిర్మించి ఇవ్వాలనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయాన్ని హోంమంత్రి మహమూద్‌అలీ స్వాగతించారు. ప్రస్తుతం ఉన్న స్థలంకంటే ఎక్కువ విస్తీర్ణంలో మసీదు, ఆలయం నిర్మించాలని సెక్యులర్‌ నాయకుడైన కేసీఆర్‌ నిర్ణయించడం హర్షణీయమన్నారు. నూతన భవనంలో సాంకేతికత, ఇతర సౌకర్యాలతో కూడిన సదుపాయాలతో ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.

సీఎం కేసీఆర్‌పై నమ్మకమున్నది: అసదుద్దీన్‌

కొత్త సచివాలయంతోపాటుగా ఆలయం, మసీదు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్‌ ప్రకటనను స్వాగతిస్తున్నామని, సీఎంపై తమకు నమ్మకం ఉన్నదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి స్టేట్‌మెంట్‌ను యునైటెడ్‌ ముస్లిం ఫోరం తరపున త్వరలోనే ప్రకటిస్తామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

సీఎంకు ఉద్యోగసంఘాల కృతజ్ఞతలు

సచివాలయ ప్రాంగణంలో నల్లపోచమ్మ ఆలయంతోపాటు మసీదును  ఇప్పుడున్న దానికంటే గొప్పగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంపై తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం, నల్లపోచమ్మ దేవాలయ కమిటీలు కృతజ్ఞతలు తెలిపాయి. కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం ఉంచా లని, ఎవరూ అపోహలకు పోకుండా సహనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై ఉద్యోగుల సంఘం, ఆలయ కమిటీ అధ్యక్షుడు మాధవరం నరేందర్‌రావు, ఉపాధ్యక్షురాలు మంగమ్మ, సంఘం కార్యదర్శి షేక్‌ యూస్‌ఫ్‌ మియా హర్షం తెలిపారు. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి క్తొ మసీదు, ఆలయం నమ్మకం, భరోసాను కల్గిస్తాయన్నారు. సీఎం నిర్ణయం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ కన్వీనర్‌ కొంతం గోవర్ధన్‌రెడ్డి, అధికార ప్రతినిధి సీహెచ్‌ ఉపేందర్‌ ప్రకటనలో పేర్కొన్నారు.


logo