ఆదివాసీగూడెం నుంచి ఆస్ట్రేలియాకు

- గిరిజన విద్యార్థి దిశను మార్చిన తెలంగాణ సర్కార్
- తోడ్పాటునిచ్చిన అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్
- కెమికల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ చేస్తున్న సిద్దేశ్వర్
హైదరాబాద్, జనవరి12 (నమస్తే తెలంగాణ): ఆదివాసీల్లో అదీ అట్టడుగున ఉండే ఆంధ్ కులంలో పుట్టిన గిరిజన యువకుడు ఆస్ట్రేలియా విమానమెక్కాడు. తెలంగాణ ప్రభుత్వం అందించిన ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తో ఆ దేశంలోని మొనాష్ యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీంగ్‌లో ఎంఎస్ చేస్తున్నాడు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు చేరిన గిరిజన యువకుడు సిద్దేశ్వర్ గురించి ఆయన మాటల్లోనే..
మాది ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం దేవ్పటార్. అమ్మ మీరాబాయి. నాన్న చంపత్. అమ్మానాన్నలకు మేం ఏడుగురం సంతానం. మాది గిరిజనుల్లో ఆంధ్ అనే ఉపకులం. తెలంగాణ మొత్తంలో మావాళ్ల జనాభా 3వేలకు మించదు. మాకున్న భూమి మొత్తం రాళ్లురప్పలతో ఉండటంతో వ్యవసాయానికి వీలుపడేది కాదు. దీంతో మా నాన్న భవన నిర్మాణకూలీగా మారాడు. నా చదువంతా సర్కారీ స్కూళ్లు, కాలేజీల్లోనే సాగింది. ప్రస్తుత జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపెల్లిలో ఏడో తరగతి చదువుతుండగా.. హైదరాబాద్‌లో టీచర్లుగా పనిచేసే ఆ గ్రామానికి చెందిన దంపతులు నాతోపాటు ఆరుగురిని యూసుఫ్‌గూడ సంక్షేమ హాస్టల్లో చేర్పించారు. వెంగళ్రావునగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీటు ఇప్పించారు. టెన్త్‌లో 9.0 జీపీఏ వచ్చింది. ఇంటర్ ఆదిలాబాద్ గిరిజన రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో చేశా. శ్రీనివాసస్వామి అనే లెక్చరర్ ఫస్టియర్ నుంచే ఎంసెట్ శిక్షణ ఇచ్చారు.
ప్రతి కాలేజీ నుంచి 10 మందిని ఎంపికచేసి లాల్టేక్డిలో ఉంచి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించారు. ఇంటర్లో 869 మార్కులు, ఎంసెట్‌లో 27 వేల ర్యాంక్‌తో జేఎన్జీయూ క్యాంపస్‌లో కెమికల్ ఇంజినీరింగ్‌లో సీటు వచ్చింది. 2014 -18 మధ్య ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం గురించి తెలిసింది. పథకం, అర్హతల గురించి శోధించాక.. ఈ స్కాలర్‌షిప్‌తో ఏదో ఒక దేశానికి వెళ్లి ఎంఎస్ చేయాలని కలలుగన్నా. ఇందుకోసం ఐఈఎల్‌టీఎస్‌కు ప్రిపేరై 6.5 స్కోర్ సంపాదించా. అప్పుడే కన్సల్టెన్సీ ద్వారా ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీలో ఎంఎస్ కెమికల్ ఇంజినీంగ్‌లో సీటు వచ్చింది.
ట్విస్ట్‌లు దాటుకుని
ఓవర్సీస్ స్కాలర్షిప్కు ఎంపికైనవారు ముందుగా మొదటి సెమిస్టర్ ఫీజుకట్టి యూనివర్సిటీల్లో జాయిన్ అయితేనే సీటు గ్యారంటీ. నా కోర్సు ఫీజు రూ.44 లక్షలు. బీటెక్‌లో 66 శాతం మార్కులు రావడంతో మొత్తం ఫీజులో నాలుగు లక్షలు మాఫీ చేశారు. మొదటి సెమిస్టర్ ఫీజుగా రూ.7 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పటికి ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరుకాలేదు. ఊట్నూర్ ఐటీడీఏ చుట్టూ తిరిగినా ఫలితంలేకపోయింది. ఫీజుకట్టడానికి రెండు రోజుల గడువు ఉందనగా అప్పటి ఆదిలాబాద్ కలెక్టర్ దివ్యదేవరాజన్ మేడంను కలిశాం. ఆమె గిరిజన సంక్షేమశాఖ అధికారులతో మాట్లాడి రూ.7 లక్షలు మంజూరు చేయించారు. జూనియర్ కాలేజీవాళ్లు రూ.1.2 లక్షలను సమకూర్చారు. మా నాన్న అప్పుతెచ్చి విమానటికెట్లు, వీసా మొత్తాన్ని సమకూర్చారు. దీంతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టా. అసలు అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ లేకపోతే ఆస్ట్రేలియాకు వెళ్లాలన్న ఆలోచనే వచ్చేదికాదు. ప్రభుత్వం రూ.20లక్షల స్కాలర్షిప్ ఇవ్వకపోతే నాలాంటి వాళ్లు ఆదివాసీగూడేలకే పరిమితమయ్యేవారు. అక్కడే ఆశలను సమాధి చేసుకునేవాళ్లు.
తాజావార్తలు
- బైక్‌ను ఢీకొన్న కంటైనర్.. ఒకరు మృతి
- ఎన్నికల వేళ మమతా దీదీకి మరో ఎదురుదెబ్బ?
- యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం
- 'ధరణితో భూ రికార్డులు వ్యక్తుల చేతుల్లోంచి వ్యవస్థలోకి'
- శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- నన్ను ఫాలో కావొద్దు..రియాచక్రవర్తి వీడియో వైరల్
- రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
- చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్‌పై విప్ బాల్క సుమన్ సమీక్ష
- "ఉపశమనం కోసం లంచం" కేసులో డీఎస్పీ, ఇన్స్పెక్టర్ అరెస్ట్
- క్రాక్ 2 ఆయనతో కాదట..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్