శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 02:20:28

పార్సిల్‌.. కొరియర్‌.. కార్గో సరుకు రవాణా ఏదైనా.. ఆర్టీసీ రెడీ

పార్సిల్‌.. కొరియర్‌.. కార్గో సరుకు రవాణా ఏదైనా.. ఆర్టీసీ రెడీ

  • పచ్చళ్లు మొదలు ఫార్మా దాకా అన్నీ డెలివరీ
  • సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశంతో నలుచెరగులా విస్తరణ
  • అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి కంపెనీలతోనూ సంప్రదింపులు
  • రాష్ట్రవ్యాప్తంగా ఏజెంట్ల నియామకానికి రేపు నోటిఫికేషన్‌

ఓ మారుమూల గ్రామంలో ఉండే ఓ తల్లి హైదరాబాద్‌లోని కొడుక్కు పచ్చళ్లు పంపాలనుకున్నది. సురక్షితంగా తరలించేందుకు ఆర్టీసీ ఉన్నది.

ఓ పల్లెటూరి వ్యక్తి అమెజాన్‌లో వస్తువు బుక్‌చేస్తే పట్నంలోని తన దోస్త్‌ అడ్రస్‌ ఇవ్వాల్సివచ్చేది. ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ ద్వారా ఆ గ్రామానికే అమెజాన్‌ పార్సిల్‌ వస్తుంది.

హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కంపెనీ తన డీలర్లకు సరుకును చేర్చాలంటే.. విస్తృతమైన, నమ్మకమైన వ్యవస్థ తెలంగాణ ఆర్టీసీ.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర రోడ్డురవాణాసంస్థ లాభాల వైపు అడుగులు వేస్తున్నది. పూర్తిస్థాయిలో వాణిజ్యపరంగా తన సేవలను విస్తరిస్తున్నది. పచ్చళ్ల దగ్గరి నుంచి ఫార్మా దాకా ప్రతి వస్తువునూ ప్రైవేట్‌ కంటే తక్కువ చార్జీకే రవాణాచేస్తున్నది. కార్పొరేట్‌ సంస్థల దగ్గరి నుంచి గ్రామా ల్లోని రైతుల వరకు సేవలందిస్తున్నది.   

882 కార్గో బస్సులు లక్ష్యంగా

ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్గో సేవల కోసం 882 బస్సులకు అనుమతిచ్చారు. దీంతో ఆర్టీసీ అధికారులు 8-9 టన్నుల వరకు ఉన్న వస్తువులను రవాణాచేసేందుకు తొలిదఫా 104 బస్సులను కార్గో సేవలకు అనుగుణంగా మార్చారు. లాక్‌డౌన్‌ సమయంలోనే బాలామృతం, నిత్యావసర వస్తువులు, మందులు, ఇతర సామగ్రిని రవాణా చేశారు. నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయశాఖ 30 బస్సులను వాడుకొంటున్నది. సరుకు రవాణాద్వారా ఇప్పటివరకు రూ. 2 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ ఆర్జించింది. గత నెల 19న  మంత్రి పువ్వాడ అజయ్‌ ఆర్టీసీ పార్సిల్‌-కొరియర్‌-కార్గో సేవలను ప్రారంభించారు. దీంతోపాటు సరుకు రవాణా బస్సుల సంఖ్యను 126 కు పెంచారు. త్వరలో కొత్తగా 24 కార్గో బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 

పలు కంపెనీలతో ఒప్పందం 

హైదరాబాద్‌లోని ఫాల్కన్‌ మోటర్ల ఏజెన్సీతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న ఆర్టీసీ.. ఆటో మొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌ తయారుచేసే కంపెనీలతో కూడా  సంప్రదింపులు జరుపుతున్నది. సింగరేణి, ఎఫ్‌సీఐ తదితర సంస్థలతోనూ ఆర్టీసీ అధికారులు జరిపిన చర్చలు సఫలమవుతుండటంతో 70-80 బస్సులను కార్గో సర్వీసులుగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 


త్వరలో 50 మినీ కార్గో బస్సులు

త్వరలో 2-3 టన్నుల సామర్థ్యంతో మినీ కార్గో బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తేనున్నది. నగరాల్లో ఇల్లు ఖాళీ చేసినపుడు సామాన్లు తరలించడానికి తమను సంప్రదిస్తే బయటి కన్నా తక్కువకే కార్గో సేవలను అందిస్తామని ప్రత్యేకాధికారి కృష్ణకాంత్‌ తెలిపారు. తొలుత కరీంనగర్‌లో ఈ తరహా సేవలను అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. 

పార్సిల్‌, కొరియర్‌ సేవలకు మంచి స్పందన...

ఆర్టీసీ పార్సిల్‌, కొరియర్‌ ఆదాయం క్రమంగా పెరుగుతున్నది. తొలిరోజు రూ.15 వేలుగా ఉన్న ఆదాయం.. ఇప్పుడు రోజుకు రూ.3.20 లక్షలకు చేరింది. రాష్ట్రంలోని 147 బస్‌స్టేషన్లలో ఈ సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌లోని పలు  ప్రాంతాల్లో పార్సిల్‌, కొరియర్‌ సేవలకు మంచి స్పందన వస్తున్నది.  

రాష్ట్రవ్యాప్తంగా ఏజెంట్ల వ్యవస్థ..

ఆర్టీసీ కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సేవల వినియోగంలో భాగంగా బుకింగ్‌తో పాటు డెలివరీ సేవల కోసం ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యానికి కూడా ఆర్టీసీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా ప్రధాన కూడళ్లు, వాణిజ్య ప్రాంతాల్లో అడ్డాలు ఉన్నవారిని ఏజెంట్లుగా నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఔత్సాహికులు దరఖాస్తు చేసుకుంటే, సమీపంలోని ఆర్టీసీ అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఎంపికైన ఏజంట్ల నుంచి పట్టణ ప్రాంతమైతే రూ.20 వేలు, ఇతర ప్రాంతాల్లో రూ.10 వేలు డిపాజిట్‌ చేసుకొని లైసెన్స్‌ ఇవ్వనున్నారు. కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సేవల బుకింగ్‌, అవసరమైతే డోర్‌ డెలివరీ వంటి సేవలకు ఏజెంట్లకు పది శాతం కమీషన్‌ ఇచ్చేందుకు నిర్ణయించారు. 

త్వరలో కంప్యూటరీకరణ.. 

ఆర్టీసీ కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సేవల వినియోగంలో బుకింగ్‌, ఆన్‌లైన్‌ సేవలు, రశీదులు తదితర వివరాలను నిక్షిప్తంచేసి వ్యవస్థ సక్రమంగా నడిచేలా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపకల్పనచేస్తున్నారు. ఈ బాధ్యతను నెటెక్సెల్‌ అనే సంస్థకు ఇచ్చారు. రాష్ట్రంలోని పార్సిల్‌, కొరియర్‌ సేవలు ఉన్న 147 బస్‌ స్టేషన్లలో కంప్యూటర్లు, డిజిటల్‌ మిషన్లు అందుబాటులోకి రానున్నాయి. మొదటి విడతగా సోమవారం నగరంలోని పలు స్టేషన్లకు 50 డిజిటల్‌ వెయింగ్‌ మిషన్లను సమకూరుస్తున్నారు. ప్రజలు సెల్‌ఫోన్ల ద్వారానే ఆర్టీసీ కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సేవల్ని బుకింగ్‌ చేసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను  రూపొందిస్తున్నారు.

అమెజాన్‌, ఫ్లిప్‌కార్టులతో చర్చలు 

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ సంస్థలకు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే వీటి డెలివరీకి హైదరాబాద్‌ తదితర పట్టణాల్లో మాత్రమే అవకాశం ఉంది. వాటిని మారుమూల గ్రామాలకు చేర్చే అంశంపై ఆయా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కృష్ణకాంత్‌ తెలిపారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు తెచ్చిన వస్తువులను నిర్దేశిత ప్రాంతాలకు చేరవేసేందుకు ఆర్టీసీ కార్గోను ఆశ్రయిస్తే సేవలందుతాయి.  


logo