శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 01:30:00

తెలంగాణ రాష్ట్రమే దేశాన్ని ఆదుకుంటున్నది

తెలంగాణ రాష్ట్రమే దేశాన్ని ఆదుకుంటున్నది

  • ఆర్థిక రంగంలో మూల స్తంభంగా నిలిచింది 
  •  కేంద్రం తీసుకుంటున్న నిధుల్లో తిరిగి వస్తున్నది సగమే
  • ఇతర రాష్ర్టాల కంటే అప్పులు తక్కువ.. అభివృద్ధి ఎక్కువ 
  •  తెలంగాణ సంపద, తలసరి ఆదాయం పెరిగింది
  • మరి జాతీయ సంపద ఎందుకు అంత పెరుగలేదు? 
  •  గణాంకాలను బయటపెట్టిన మంత్రి కేటీఆర్‌

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ర్టానికి నిధుల కేటాయింపులో అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్న కేంద్రం గోరంత ఇచ్చి కొండంతలుగా చెప్పుకుంటున్నదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. అసలు రాష్ట్రమే కేంద్రానికి నిధులిచ్చి ఆదుకుంటున్నదని, కానీ కేంద్రం నుంచి ఒరిగిందేమీ లేదని స్పష్టంచేశారు. తెలంగాణ ఆవిర్భవించిన నాటినుంచి రాష్ట్రంనుంచి వివిధ పన్నుల రూపంలో దాదాపు 2.73 లక్షల కోట్లు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. తిరిగి రాష్ర్టానికి సగం నిధులను మాత్రమే ఇచ్చిందని వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన అపూర్వమైన పరిపాలన విధానాల వల్లే రాష్ట్ర సంపద (జీఎస్‌డీపీ) భారీగా పెరిగిందని తెలిపారు. జీఎస్‌డీపీతోపాటు తలసరి ఆదాయం అనూహ్యంగా పెరిగి దేశ సగటు కంటే ఎంతో ముందున్నదని చెప్పారు. అద్భుతమైన నాయకత్వం, ప్రగతిశీల విధానాలు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ధిష్ట ప్రణాళికతో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని అన్నారు. ఈ కారణంగానే రాష్ట్రం అభివృద్ధి పథాన దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్వీట్‌చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి?, రాష్ట్రం నుంచి కేంద్రానికి జమవుతున్న మొత్తం నిధులెంత? అనే పలు ఆసక్తికరమైన అంశాలను మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌చేశారు. కేంద్రం రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని రాష్ట్రమే తన సంపదను పెంచుకొని దేశానికి ఆర్థికంగా మూలస్తంభంగా నిలుస్తున్నదని గణాంకాలతో సహా విశ్లేషించారు. మరోవైపు స్థిరమైన విధానాలు, పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులు, పెట్టుబడుల వెల్లువ వల్ల రాష్ట్ర సంపద పెరుగటమే కాకుండా ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు. అదే సమయంలో జాతీయ సంపద ఎందుకు పెరుగలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంనుంచి కేంద్ర ఖజానాకు వెళ్తున్న నిధులలో సగం మాత్రమే తెలంగాణకు తిరిగి వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటైన 2014 నుంచి ఇప్పటివరకు రూ.2,72,926 కోట్లు కేంద్ర ప్రభుత్వం వివిధ పన్నుల రూపంలో తీసుకున్నదని వివరించారు. ఇందుకు బదులుగా కేవలం 1,40,329 కోట్లు మాత్రమే రాష్ర్టానికి తిరిగి ఇచ్చిందని విశ్లేషించారు. ఎవరు ఎవరిని ఆదుకుంటున్నారు.. ఎవరు ఎవరికి నిధులిస్తున్నారో తెలుసుకొని మాట్లాడాలని పరోక్షంగా బీజేపీ నాయకులను ఉద్దేశించి ట్వీట్‌చేశారు. ఇవిగో సాక్ష్యాలంటూ.. కేటీఆర్‌ అధికారిక గణాంకాలను వెల్లడించారు.

అప్పు తక్కువ.. అభివృద్ధి ఎక్కువ 

అతి తక్కువ అప్పులు తీసుకొని ఎక్కువ అభివృద్ధిని సాధిస్తున్న రాష్ర్టాలలో తెలంగాణ ప్రముఖస్థానంలో ఉన్నది. సాధారణంగా ఫిస్కల్‌ రెస్పాన్సబిలిటీ అండల బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనల ప్రకారం.. ఏదైనా రాష్ట్రం తమ అవసరాల కోసం మొత్తం సంపద జీఎస్‌డీపీలో 25 శాతం అప్పులు తీసుకొనే వీలుంటుంది. చాలా రాష్ర్టాలు ఈ పరిమితిని మించి భారీ మొత్తంలో అప్పులు చేసినా తెలంగాణ మాత్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ఏ మాత్రం దాటకుండా ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నది. మన కంటే పెద్ద రాష్ర్టాలు సైతం ఎక్కువ అప్పులు చేసి పరిమితిని దాటాయి. కానీ తెలంగాణ మాత్రం పరిమితి దాటలేదని మంత్రి కేటీఆర్‌ లెక్కలతో సహా వివరించారు.