మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 02:50:46

లోపాలున్నాయని కేంద్ర బృందం చెప్పలేదు

లోపాలున్నాయని కేంద్ర బృందం చెప్పలేదు

  • కేంద్రం కంటైన్‌మెంట్‌ పాలసీ అమలు చేస్తున్నాం
  • కేవలం 20 రోజుల్లో 1.32 లక్షల పరీక్షలు 
  • కేసులుంటే ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు చర్యలు తీసుకుంటాయి 
  • హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో పర్యటించిన కేంద్ర బృందం రాష్ట్రంలో కరోనా టెస్ట్‌ల సంఖ్య పెంచాలని చెప్పిందే తప్ప లోపాలున్నట్టు తెలుపలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం మే 16న జారీచేసిన కంటైన్‌మెంట్‌ పాలసీని రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు మంగళవారం వైద్యారోగ్యశాఖ, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ హైకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఇన్‌ఫెక్షన్‌ పెరిగిన ప్రాంతాలను స్టేట్‌ ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు శుద్ధి చేయడంతోపాటు కంటైన్‌ చేస్తున్నాయని తెలిపింది. ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైనా.. ఆ క్లస్టర్‌లో కంటైన్‌మెంట్‌ నిబంధనలు అమలు చేస్తున్నామని పేర్కొన్నది. రాష్ట్రంలో 410 కంటైన్‌మెంట్‌ జోన్లు క్రియాశీలకంగా ఉన్నాయని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 61, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో 349 కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. జూన్‌ 26 నుంచి జూలై 15 వరకు కేవలం 20 రోజుల వ్యవధిలో లక్షా 37 వేల 732 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. రాష్ట్రంలో పరీక్షల సంఖ్య 2.08 లక్షలు దాటిందని వెల్లడించారు. పాజిటివ్‌ వ్యక్తులకు దగ్గరి కాంటాక్ట్‌లోకి వెళ్లిన వారికి ఐసీఎమ్మార్‌ నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గత నెలలో కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌అగర్వాల్‌ ఆధ్వర్యంలోని బృందం మూడ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిందని, సీఎస్‌తోనూ భేటీ అయ్యిందని వివరించారు. టెస్టుల సంఖ్య పెంచాలని చెప్పారే తప్ప, లోపాలున్నట్టు తమకు తెలుపలేదని వివరించారు. రాష్ట్రంలోని 4,744 సబ్‌సెంటర్లు, 636 పీహెచ్‌సీలు, 249 అర్బన్‌ పీహెచ్‌సీలకు థర్మల్‌ స్క్రీనింగ్‌ కిట్లు పంపిణీ చేశామని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఐదు ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌లు సౌకర్యాలపై అఫిడవిట్‌లను సమర్పించారని ధర్మాసనానికి తెలిపారు. ప్రైవేటు దవాఖానల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మే 16న మార్గదర్శకాలు జారీచేశామని విన్నవించారు. రాష్ట్రవ్యాప్తంగా 57 ప్రైవేటు దవాఖానలను కొవిడ్‌ హాస్పిటల్స్‌గా గుర్తించామని, వీటిలో వైద్య చార్జీలపై ప్రభుత్వం గరిష్ఠ పరిమితిని విధించిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 61 ప్రభుత్వ దవాఖానలు కొవిడ్‌-19 చికిత్స అందిస్తున్నాయని పేర్కొన్నారు. 


logo