ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 01:45:42

దేనికైనా సిద్ధమే

దేనికైనా సిద్ధమే

  • సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉన్నది 
  • అమరుల త్యాగాలు వృథా కానీయం 
  • వాయుసేన అధిపతి భదౌరియా వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని వాయుసేన అధిపతి ఎయిర్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా అన్నారు. చైనాతో తాము యుద్ధం కోరుకోవడం లేదని,  అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. గల్వాన్‌ లోయలో ప్రాణాలర్పించిన అమరజవాన్ల త్యాగాలను వృథా కానివ్వబోమని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ క్యాడెట్స్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో భదౌరియా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

అన్ని ఎయిర్‌బేస్‌లు అప్రమత్తం

వాస్తవాధీన రేఖ వెంట భారత వాయుసేన అప్రమత్తంగా ఉన్నదని భదౌరియా తెలిపారు.  చైనా వైమానిక స్థావరాల గురించి ఆయన స్పందిస్తూ.. వారి స్థావరాలు ఏమిటో, అవి ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ మోహరించారో తమకు తెలుసునని పేర్కొన్నారు. ‘సాధారణంగా చైనా ఏటా ఎండాకాలంలో సరిహద్దుల వెంట బేస్‌ క్యాంపుల్లో సైన్యాన్ని, యుద్ధవిమానాలను మోహరిస్తుం ది. ఈసారి ఎక్కువ సైన్యాన్ని అక్కడకు చేర్చింది. ఆ వివరాలు మా వద్ద ఉన్నాయి’ అని అన్నారు.   

ఒప్పందాలకు చైనా తూట్లు

సైన్యాధికారుల చర్చల్లో కుదిరిన ఒప్పందానికి విరుద్ధంగా చైనా దాడులకు దిగడం సహించరానిదని భదౌరియా వ్యాఖ్యానించారు. అయినా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గాల్వన్‌లోయలో అమరులైన మన వీర జవాన్ల పరాక్రమం.. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించడంలో తమ సంకల్పాన్ని మరింత పెంచిందని చెప్పారు. అత్యాధునిక సాం కేతికతతో కూడిన 300కుపైగా యుద్ధవిమానాలు త్వరలో వాయుసేనలో చేరబోతున్నాయన్నారు.


logo