శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 02:11:01

ఆడబిడ్డ వాటాను కాజేయలేరు

ఆడబిడ్డ వాటాను కాజేయలేరు

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: తల్లిదండ్రుల ఆస్తిలో ఆడబిడ్డల వాటాను ఇప్పటి నుంచి అన్నదమ్ములు కాజేయలేరు. వారి సమ్మతితో పంచుకోవచ్చు లేదా, వారికీ సమాన వాటా ఇవ్వాల్సిందే. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో ఆడబిడ్డలకు కూడా ఆస్తిలో వాటా ఉండేలా చట్టం తెచ్చినా పెద్దగా అమలుకు నోచుకోలేదన్నది వాస్తవం. ఇక నుంచి అలా జరుగదు. ధరణి ఫోర్టల్‌తో ఆడబిడ్డలకు తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు కల్పించే నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌ తీసుకున్నారు. ఆడబిడ్డకు తెలియకుండా తల్లిదండ్రుల ఆస్తిని అన్నదమ్ములు తమ పేరుతో చేయించుకోవడానికి ధరణి ఒప్పుకోదు. ఆస్తిలో తనకు వాటా వద్దని ఆడబిడ్డలు స్వయంగా బయోమెట్రిక్‌ ఇస్తే తప్ప, ఆమెకు కూడా ఆస్తిలో వాటా దక్కుతుంది. ఇది తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్‌ ఇస్తున్న కానుక.

ఐదు, ఆరవ అంచెలకు వెళ్లాలంటే

ధరణి పోర్టల్‌ ద్వారా పౌతివిరాసత్‌ చేసేందుకు ఆరు అంచెలుంటాయి. పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యాక పౌతివిరాసత్‌ కాలంలో నమూనా ప్రకారం పట్టాదారుడి వారసులకు సంబంధించిన పూర్తి  వివరాలను నమోదు చేయాలి. కుటుంబ సభ్యులందరి జాయింట్‌ అగ్రిమెంట్‌ను, పట్టాదారుడి మరణ ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలి. రుసుము చెల్లించి, మూడవ అంచెలో పౌతివిరాసత్‌ కోసం స్లాట్‌బుక్‌ చేసుకోవాలి. స్లాట్‌బుక్‌ చేసిన 7 రోజుల తర్వాత తాసిల్దార్‌ కార్యాలయానికి పట్టాదారు వారసులు, సాక్షుల వెళ్తే వారి బయోమెట్రిక్‌ను కార్యాలయ సిబ్బంది స్వీకరిస్తారు. ఇది నాలుగో అంచె. ఆ సమయంలో పట్టాదారుల వారసుల జాబితాలో ఆడబిడ్డలు ఉంటే వారి బయోమెట్రిక్‌ను కూడా నమోదు చేస్తారు. వారి బయోమెట్రిక్‌ ఉంటేనే తదుపరి ఐదవ అంచె, ఆరవ అంచెలోకి వెళ్లేందుకు వీలవుతుంది. వాళ్లు ఒప్పుకొని బయోమెట్రిక్‌ ఇస్తేనే అన్నదమ్ములకు పట్టా వస్తుంది. లేకపోతే ఆడబిడ్డలకు కూడా సమవాటా ఇవ్వాల్సిందే. లేదంటే ధరణి ఒప్పుకోదు.