శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:43:59

అమరుల సేవలు చిరస్మరణీయం

అమరుల సేవలు చిరస్మరణీయం

  • వారి స్ఫూర్తితో అడవులను రక్షిద్దాం
  • అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి అల్లోల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ /చార్మినార్‌: అడవుల సంరక్షణ కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారని, ఆ అమరవీరుల సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 1984 నుంచి ఇప్పటివరకు తెలంగాణకు చెందిన 21 మంది అటవీ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలర్పించారని చెప్పారు. అడవులను కాపాడటానికి, వన్యప్రాణుల సంరక్షణకు అటవీ అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారన్నారు. కరోనా సమయంలోనూ ధైర్యంతో విధులు నిర్వర్తించారని, ఈ క్రమంలో కరోనా బారినపడి కొందరు మృతిచెందారని విచారం వ్యక్తంచేశారు. అటవీ నేరాలకు పాల్పడేవారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రకృతి ప్రసాదించిన వన సంపదను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అటవీశాఖ స్పెషల్‌ సీఎస్‌ శాంతికుమారి, పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ రఘువీర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ (సౌత్‌జోన్‌, చెన్నై) ఆర్‌ హేమంత్‌కుమార్‌, పీసీసీఎఫ్‌లు డోబ్రియల్‌, లోకేశ్‌జైస్వాల్‌, అదనపు పీసీసీఎఫ్‌లు స్వర్గం శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌రెడ్డి, పర్గెన్‌, జూపార్క్‌ డైరెక్టర్‌ కుక్రేటి, జూపార్క్‌ క్యూరేటర్‌ క్షితిజ పాల్గొన్నారు.


logo