శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 01:30:14

సెకండ్‌ వేవ్‌ కట్టడి మన చేతుల్లోనే

సెకండ్‌ వేవ్‌ కట్టడి మన చేతుల్లోనే

డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం లేకపోలేదని, దానిని అడ్డుకోవడం మన చేతుల్లోనే ఉన్నదని అపోలో దవాఖానల సీనియర్‌ కన్సల్టెంట్‌ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ నెల తొలి 15 రోజుల్లో 18 శాతం వరకు కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పట్టిందని, అత్యంత క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ వచ్చామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యూరప్‌, అమెరికా దేశాలు సెకండ్‌ వేవ్‌తో అతలాకుతలం అవుతున్నాయని, ఐసీయూ పడకల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి పరిస్థితి భారత్‌లో రావొద్దంటే కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండటం ముఖ్యమని చెప్పారు. చలికాలంలో వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశం ఎక్కువని, డిసెంబర్‌లో కేసులు పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దసరా, దీపావళి, క్రిస్మస్‌ పండుగల వేళ గుంపులుగా తిరుగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

38 లక్షలు దాటిన కరోనా టెస్టులు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 38,56,530 టెస్టు నిర్వహించగా, 2,23,059 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 2,00,686 మంది కోలుకోగా, 21,098 మంది ఇండ్లు, దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్టు సోమవారం వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. రికవరీ రేటు రికార్డుస్థాయికి చేరుకున్నది. దేశంలో రికవరీ రేటు 88.02 శాతంగా నమోదు కాగా, తెలంగాణలో 89.96 శాతానికి చేరింది. ఆదివారం 26,027 పరీక్షలు నిర్వహించగా, 948 కేసులు వెలుగుచూశాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 212, రంగారెడ్డి జిల్లాలో 98, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 65 కేసులు నమోదయ్యాయి. కరోనాకు తోడు ఇతర అనారోగ్య కారణాల వల్ల నలుగురు మృతిచెందారు.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు      ఆదివారం మొత్తం 

పాజిటివ్‌ కేసులు 948 2,23,059

డిశ్చార్జి అయినవారు     1,896 2,00,686

మరణాలు   04 1,275

చికిత్స పొందుతున్నవారు     - 21,098