శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Feb 14, 2020 , 02:26:04

అత్యంత సురక్షిత నగరం హైదరాబాద్‌

అత్యంత సురక్షిత నగరం హైదరాబాద్‌
  • రూ.500 కోట్లతో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఆధునీకరణ
  • హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు
  • హెచ్‌సీఎస్సీ లోగో ఆవిష్కరణలో హోంమంత్రి మహమూద్‌ అలీ

అమీర్‌పేట్‌, నమస్తే తెలంగాణ: శాంతిభద్రతల పరిరక్షణలో ప్రపంచస్థాయి నగరాలతో పోటీ పడుతూ.. అత్యంత సురక్షిత నగరంగా హైదరాబాద్‌ గుర్తింపు పొందిందని హోంమంత్రి మహమూద్‌ అలీ చెప్పారు. రూ.700 కోట్లతో రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కృషిచేస్తున్నదన్నారు. హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ (హెచ్‌సీఎస్సీ) లోగోను గురువారం బేగంపేట్‌లోని హోటల్‌ గ్రాండ్‌ కాకతీయలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను రూ.500 కోట్లతో ఆధునీకరిస్తున్నామని, నగరవ్యాప్తంగా ఒక లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటుచేయబోతున్నామని చెప్పారు. 


తెలంగాణ పోలీస్‌ అత్యుత్తమ వ్యవస్థ

జాతీయస్థాయిలో తెలంగాణ పోలీస్‌ అత్యుత్తమమైన వ్యవస్థగా రూపుదిద్దుకున్నదని నగర పోలీస్‌ కమిషనర్‌, హెచ్‌సీఎస్సీ చైర్మన్‌ అంజనీకుమార్‌ చెప్పారు. హైదరాబాద్‌ నగరాన్ని మరింత సురక్షితమైన ప్రదేశంగా మార్చేందుకు అన్ని రకాల విధానాలను అవలంబిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హెచ్‌సీఎస్సీ కార్యదర్శి భరణిఅరోల్‌, ప్రతినిధులు ఏ నారాయణరాజు, సినీరంగానికి చెందిన దిల్‌రాజు, సుప్రియ, ఐపీఎస్‌ అధికారులు డీఎస్‌ చౌహాన్‌, శిఖాగోయల్‌, అనిల్‌కుమార్‌, తరుణ్‌జోషి,  ఏఆర్‌ శ్రీనివాస్‌, రమేశ్‌, పీ విశ్వప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


హెచ్‌సీఎస్సీకి పలువురి విరాళం

హెచ్‌సీఎస్సీకి పలువురు విరాళాలు ప్రకటించారు. జూబ్లీహిల్స్‌ కోఆపరేటివ్‌ బిల్డింగ్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ రూ.10 లక్షల చెక్కును హోంమంత్రి మహమూద్‌ అలీకి అందజేసింది. నాట్కో ఫార్మా సంస్థ రూ.5 లక్షలు, గ్రీన్‌ కంపెనీ రూ.5 లక్షలు, గంగవరం పోర్ట్‌ రూ.2 లక్షలు, నవయుగ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ రూ.3 లక్షలు, అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈడీ సుప్రియ రూ.3 లక్షలు, సినీ నిర్మాత దిల్‌రాజు రూ.3 లక్షలు, మైరాన్‌ హోమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.50 వేలు విరాళాలుగా ప్రకటించారు.


logo