వెద జల్లె.. వెతతీర్చే!

ఫలితమిస్తున్న మొలక చల్లుడు పద్ధతి వరిసాగు
- కూలీల కొరతకు ప్రాచీనవిధానంలో పరిష్కారం
- దశాబ్దకాలంగా వరి పండిస్తున్న దంపతులు
- రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆదర్శం
- 15 ఎకరాల నుంచి 50వేల ఎకరాలకు విస్తరణ
వ్యవసాయంలో కూలీల కొరత వారిలో ఆలోచనను రేకెత్తించింది. వరి సాగులో కొత్త పద్ధతిని మొలకెత్తించింది. ప్రాచీన విధానానికి కొద్దిపాటి హంగులు జోడించి వెద సాగుకు రూపమిచ్చారు రూపిరెడ్డి దంపతులు. మొదట్లో దిగుబడి రాకపోయినా దిగులు చెందకుండా.. వెనుకడుగు వేయకుండా దశాబ్దకాలంగా ఒక్క కూలీ అవసరం లేకుండా 15 ఎకరాల్లో పంట పడిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ దంపతులు మొలకజల్లుడు విధానంతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ పద్ధతిని 15 ఎకరాల నుంచి 50 వేల ఎకరాలకు విస్తరించారు.
కరీంనగర్, నమస్తే తెలంగాణ: వ్యవసాయరంగంలో కూలీల కొరత తీవ్రంగా వేదిస్తున్నది. ఈ వెత నుంచి గట్టెక్కేందుకు పదేండ్ల క్రితమే ఓ రైతు దంపతుల మదిలో ఆలోచన తట్టింది. అక్కడా ఇక్కడా అన్వేషించి డ్రమ్ సీడర్ విధానాన్ని ఎంచుకున్నారు. కానీ, ఎర్రనేలలకు మాత్రమే పనిచేసే ఈ మిషన్ విధానం వారికున్న నల్లరేగడి భూమిలో సాధ్యం కాలేదు. దీంతో ప్రాచీన పద్ధతిలో వరి విత్తనం మొలకను చల్లి సాగును మొదలుపెట్టారు. మొదట్లో దిగుబడి సరిగా రాకున్నా దిగులుపడలేదు. మొదటి ఏడాది పొందిన అనుభవంతో కొద్దిగా మార్పు లు చేసి అదే విధానాన్ని కొనసాగించారు. తమకున్న 12 ఎకరాలతోపాటు, మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం 15 ఎకరాల్లో పదేండ్లుగా కూలీతో అవసరం లేకుండా వ్యవసాయం చేస్తున్నారు. వీరిని చూసి తోటి రైతులే కాదు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కూ డా అబ్బురపడుతున్నారు. ఒకప్పుడు హేళన చేసినవారికే సలహాలు, సూచనలు, మెళకువలు నేర్పుతున్నారు కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కలకు చెందిన రూపిరెడ్డి లక్ష్మి-తిరుపతిరెడ్డి దంపతులు.
ఇదీ.. వెదజల్లే విధానం
వరి మొలకను సిద్ధంచేసి మడుల్లో నేరుగా చల్లుకునే పద్ధతే వెద విధానం. సాధారణంగా ఒక ఎకరంలో వరి సాగుకు 30 కిలోల విత్తనం అవసరముంటుంది. వెదజల్లుడు విధానంలో మాత్రం దొడ్డు రకమైతే 12 నుంచి 15 కిలోలు, సన్నరకమైతే 8 నుంచి 10 కిలోల విత్తనం సరిపోతుంది. ముందుగా నానబెట్టిన వరి విత్తనాన్ని కాస్త మొలకెత్తిన తర్వాత విప్పి.. మొలకను విడివిడిగా చేసుకోవాలి. అనంతరం నాటుకు సిద్ధం చేసిన పొలంలో చల్లాలి. అయితే చాలామంది ఎకరం పొలంలో సమాంతరంగా మొలకను చల్లడంలో విఫలమవుతున్నారని.. ఐదు గజాలకు ఒకబెడ్ చేసుకుని.. ఒక్కో బెడ్‌కు 1.5 కేజీల విత్తనాలు చల్లాలని తిరుపతిరెడ్డి దంపతులు టెక్నిక్‌ను చెప్తున్నారు. ఇలా చేస్తే మొలక అంతటా ఒకేవిధంగా పడుతుందని పేర్కొంటున్నారు. సాధారణంగా వరినారు విత్తితే ఎకరాకు 28 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. వెద పద్ధతిలో 34 క్వింటాళ్ల వరకు వస్తుందని చెప్తున్నారు.
పదేండ్లుగా కూలీ అవసరం లేకుండా..
వెద పద్ధతిలో పదేండ్లుగా వరి సాగుచేస్తున్నామని, ఇప్పటివరకు ఒక్క కూలీ సహాయం కూడా తీసుకోలేదని లక్ష్మి-తిరుపతిరెడ్డి పేర్కొంటున్నారు.
చదువుకోని సైంటిస్టులు
ఏడో తరగతి చదివిన తిరుపతిరెడ్డి, ఐదు వరకే చదివిన లక్ష్మి వ్యవసాయంలో మాత్రం సైంటిస్టులుగా పేరుపొందారు. జిల్లాకు చెందినవారే కాకుండా.. ఇతర జిల్లాలు, పక్క రాష్ర్టాల నుంచి రైతులు వచ్చి వెద సాగు విధానాన్ని పరిశీలించి వెళ్తున్నారు. జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధనాస్థానంలో తిరుపతిరెడ్డి స్వయంగా ఈ విధానాన్ని ప్రయోగించి శాస్త్రవేత్తలను అబ్బురపర్చారు. మంత్రి నిరంజన్‌రెడ్డి సొంత వ్యవసాయక్షేత్రంలోనూ అక్కడి సిబ్బంది, రైతులకు మెళకువలు నేర్పించారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ పరిశోధనాస్థానంలో వీసీ ప్రవీణ్‌రావు సమక్షంలోనూ ప్రదర్శించారు. ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన వరి వెద సాగు విధానంపై అవగాహన సదస్సుకు తిరుపతిరెడ్డి దంపతులను ఆహ్వానించి ప్రధాన వక్తలుగా మాట్లాడించారు. వీరి సేవలను గుర్తించిన అనేక సంస్థలు పలు అవార్డులు కూడా అందించాయి. ప్రతిష్టాత్మక ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహక అవార్డు- 2020’ లక్ష్మికి దక్కింది.
ఎవరడిగినా సలహాలిస్తున్నపదేండ్ల కింద నా మాట ఎవలినలే. ఈ పద్ధతిల కూలీల ఖర్చు లేకుంట.. అధిక దిగుబడులు సాధించినంక ఒక్కలొక్కలు నా ఆలోచనలు సరైనవని తెలుసుకుంటున్నరు. అప్పుడు నవ్వినోళ్లు ఇప్పుడచ్చి సలహాలడుగుతున్నరు. జమ్మికుంట కేవీకే సార్లు ఒక వీడియో చేసి యూట్యూబ్‌ల పెట్టిన్రు. అప్పటి నుంచి చానా మంది ఫోన్లు చేసి సలహాలు అడుగుతున్నరు. సీఎం కేసీఆర్ సార్‌కు ఈ విధానం గురించి ప్రత్యక్షంగా వివరించాలని ఉన్నది. అవకాశం వస్తుందని ఆశిస్తున్న.
- రూపిరెడ్డి తిరుపతిరెడ్డి
పదేండ్ల తర్వాత గుర్తింపు
వరి వెదసాగు పద్ధతి శానా మంచిది. మొదట్లో ఎన్నో కష్టాలువడ్డం. మమ్ములను చూసి అందరూ నవ్విండ్రు. 2010ల బురద పొలంల డ్రమ్ సీడర్ పనిచేయకపోతే ఈ ఐడియా మాకొచ్చింది. పదేండ్ల నుంచి మా పొలంల ఒక్క కూలీ కూడా పనికి రాలేదు.
- రూపిరెడ్డి లక్ష్మీరెడ్డి
తాజావార్తలు
- వారం పాటు ఖైరతాబాద్ రైల్వే గేటు మూసివేత
- వైభవంగా మల్లన్న స్వామి ఉత్సవాలు
- వైభవంగా గోదాదేవి కల్యాణం
- టీకాకు సన్నద్ధం
- వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి
- లక్ష్మీనరసింహ స్వామికి పట్టు వస్ర్తాలు
- హెచ్‌సీఎల్‌లో 20 వేల ఉద్యోగాలు
- హైదరాబాద్-షికాగో నాన్‌స్టాప్
- విప్రోతో ఫియట్ జోడీ
- యాపిల్ ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు