శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 15, 2020 , 03:34:23

అసలు మందు ధైర్యమే

అసలు మందు ధైర్యమే

  • కరోనాపై 90 ఏండ్ల వృద్ధురాళ్ల విజయం
  • గాంధీలో లెక్కలేనన్ని విజయగాథలు
  • డాక్టర్లు ఇచ్చిన ధైర్యంతో బాగయ్యా
  • కోలుకున్నవారి అనుభవాలు
  • నాతోపాటు మా ఇంట్ల ముగ్గురికి వైరస్‌ అంటుకున్నట్టు డాక్టర్లు చెప్పిండ్రు. డాక్టర్లు చెప్పినట్టు ఇంట్లనే ఉండి మందులు వాడినం. నాకు కరోనా నయమైంది’ ఇది.. కరీంనగర్‌ జిల్లా లక్ష్మీదేవిపల్లికి చెందిన 93 ఏండ్ల వృద్ధురాలు జనగం ఆగమ్మ మాట! జ్వరమొచ్చిందని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు పోతే.. కరోనా అనే అనుమానంతో చేర్చుకోలేదని, అక్కడి నుంచి గాంధీ దవాఖానకు వెళితే.. 14 రోజుల్లో బాగుచేసి పంపించారని కామారెడ్డికి చెందిన 67 ఏండ్ల బిల్డర్‌ గూడెల్లి మల్లయ్య సర్కారుక వందనాలు చెప్తున్నాడు. వీరేకాదు.. అనేకమంది కరోనాను జయిస్తున్నారు. కొందరు ఇండ్లల్లో ఉండి కోలుకుంటుంటే.. మరికొందరు గాంధీ దవాఖానలో చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంతో తిరిగి ఇండ్లకు వెళుతున్నారు. ‘కరోనాకు ధైర్యమే దీనికి పెద్ద మందు’ అని ఆ వైరస్‌ను జయించిన అనేకమంది చెప్తున్నారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/గంగాధర: కరోనా ఇప్పుడు సాధారణం. ఇరురుపొరుగు, గల్లీలో, సుట్టాలు, పక్కాలు, తెలిసినవారు.. ఇలా ఎవరో ఒకరు దీనిబారిన పడుతున్నారు. కానీ.. ‘కరోనా అంటే భయపడాల్సిన పనిలేదు. సాధారణ మందులతోనే నయమైపోతున్నది. ధైర్యమే దీనికి పెద్ద మందు’ అని ఆ వైరస్‌ను జయించిన అనేకమంది చెప్తున్నారు. మహమ్మారి బారినపడిన 60 నుంచి 90 ఏండ్ల వృద్ధులు వ్యాధి నుంచి కోలుకొని క్షేమంగా ఇంటికిచేరారు. గాంధీ, కరీంనగర్‌ దవాఖానలో కొందరు, హోం ఐసొలేషన్‌ ద్వారా మరికొందరు చికిత్స పొంది వైరస్‌ను జయించారు. గాంధీలో బాగాచూశారని చెప్తున్నారు.

గాంధీలో బాగా చూశారు

మార్చి 23న నాకు జ్వరం వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు పోతే కరోనా అనుమానంతో అడ్మిట్‌ చేసుకోలే. టెస్టు చేస్తే పాజిటివ్‌ అన్నారు. అక్కడినుంచి గాంధీ దవాఖానకు పోయినం. 14 రోజులు ఉన్న. అంతా బాగైంది. కరోనా అంటే అందరూ ఏదో రకంగా చూసేటోళ్లు. నేను ధైర్యంగానే ఉన్న. అప్పుడు గాంధీలో ఎక్కువమంది మర్కజ్‌ పోయి వచ్చినోళ్లే ఉండె. గాంధీలో డాక్టర్లు బాగా చూసుకున్నరు. రాజారావు సార్‌ ధైర్యంగా ఉండాలని చెప్పిండు. మాకు సాధారణ మందులే ఇచ్చిండ్లు. తిండి మాత్రం బాగా ఉండేది. ఎన్ని రోజులు ఉండాలో అని మొదట్ల అనిపించింది. ఆ తర్వాత అలవాటైంది. కరోనా వచ్చినా ఏమీ బుగులు పడలే. మనం ధైర్యంగా ఉంటే కరోనా ఏమీచేయదు.

- గూడెల్లి మల్లయ్య (67 ఏండ్లు), బిల్డర్‌, కామారెడ్డి


రోగనిరోధకశక్తి  ముఖ్యం

లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకున్నా. మా అపార్టుమెంట్‌లో 36 మంది కి వైరస్‌ సోకింది. మే 14న టెస్టులు చేస్తే మా ఇంట్లో 8 మందికి పాజిటివ్‌గా తేలింది. నన్ను, మా పెద్ద కొడుకును, కోడలును గాంధీ దవాఖానకు తీసుకెళ్లారు. లక్షణాలు లేని మిగిలిన ఐదుగురిని హోంఐసొలేషన్‌లోనే ఉండాలని సూచించారు. గాంధీలో పది రోజులు న్నాం. తర్వాత డిశ్చార్జి అయ్యాక హోంఐసొలేషన్‌లో ఉన్నాం. హోంక్వారంటైన్‌లో ఉన్నవారికి డాక్టర్‌ ఫోన్‌లో సూచనలుచేశారు. రోగనిరోధకశక్తి ఉంటే కరోనాను సులభంగా జయించవచ్చు. ధైర్యమే కరోనాకు మందు. లేకపోతే రోగనిరోధకశక్తి తగ్గుతుంది. మా కొడుకులకు వాళ్ల స్నేహితులు చాలామంది ధైర్యం చెప్పారు. ఆ ధైర్యమే వైరస్‌ను జయించేలా చేసింది.

-  ఏవీ నాగలక్ష్మి (60), గృహిణి, హైదరాబాద్‌ (పీజీఎల్‌2-14)

ఇంట్లనే ఉండి మందులు ఏసుకున్నం

జ్వరం రావడంతో జూలై 26న ఇంట్లోవాళ్లతో కలిసి కరోనా పరీక్షలు చేయించుకున్న. నాతోపాటు మా ఇంట్ల ముగ్గురికి వైరస్‌ అంటుకున్నట్టు చెప్పిండ్రు. డాక్టర్లు చెప్పినట్టు ఇంట్లనే ఉండి మందులు వాడినం. నాకు కరోనా నయమైంది. 

- జనగం ఆగమ్మ (93), లక్ష్మీదేవిపల్లి, గంగాధర మండలం, కరీంనగర్‌ జిల్లా

కరీంనగర్‌ దవాఖానల వారం ఉన్న..

నాకు ముందుగాల జరం వచ్చింది. పోయిన నెల 26 తారీఖునాడు పరీక్షలు చేయించుకున్న. కరోనా వచ్చింది. పానం బాగలేక కరీంనగర్‌ సర్కారు దవాఖానల వారంరోజులున్న. ఆడినుంచి శాతవాహన యూనివర్సిటీల ఉన్న ఐసొలేషన్‌ కేంద్రంల వారంరోజులు ఉండి ఇంటికొచ్చిన. కరోనా అనంగనే భయపడకుండ డాక్టర్లు చెప్పినట్టు మందులు ఏసుకున్న.

- గుర్రం లచ్చమ్మ (94),  లక్ష్మీదేవిపల్లి, గంగాధర మండలం, కరీంనగర్‌ జిల్లా


logo